Historic Veena:
పల్లవి:-
నాద తనుమనిశం శంకరం
నమామి మే మనసా శిరసా
అను పల్లవి:-
మోదకర నిగమోత్తమ సామ
వేద సారం వారం వారం
చరణం:-
సద్యోజాతాది పంచ వక్త్రజ
స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర
విద్యా లోలం విదళిత కాలం
విమల హృదయ త్యాగరాజ పాలం
పల్లవి:-
శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా!
అనుపల్లవి:-
నాభి హృత్కంఠ రసన నాసాదులయందు…శోభిల్లు సప్తస్వర…
చరణం:-
ధర ఋక్ సామదులలో వర గాయత్రీ హృదయమున సుర భూసుర మానసమున శుభ త్యారాజునియెడ…శోభిల్లు సప్తస్వర…
త్యాగయ్య కీర్తనల్లో సంగీత వైశిష్ట్యాన్ని చెప్పే ఎన్నో కీర్తనల్లో రెండు కీర్తనలివి. నాదతనుమ్- నాదమే శరీరంగా ఉన్న శివుడికి;
అనిశమ్- ఎల్లప్పుడూ;
నమామి మే మనసా శిరసా- మనసంతా పవిత్రభావంతో తలవంచి నమస్కారం.
మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం- వేదాల్లో గొప్పదయిన సామవేద సారమయిన సంగీత స్వరూపుడుడిగా ఉన్న శివుడికి మాటి మాటికి నమస్కరిస్తున్నాను. శివుడి సద్యోజాతాది పంచముఖాల నుండి సప్త స్వరాలు పుట్టాయి.
శోభిల్లు సప్త స్వరాలను ధ్యానం చేయాలి. భజించాలి. సప్తస్వరాల్లో ఒక్కొక్కటి మన శరీరంలో నాభి, హృదయం, కంఠం, నాలుక మీద పలుకుతాయి. వేదాల్లో, గాయత్రిలో ఉన్న మహిమాన్విత మంత్రాక్షరాలే సప్తస్వరాలుగా మారాయి.
ఇంతకంటే ఈ కీర్తనల అర్థంలోకి వెళ్లడానికి ఇది వేదిక కాదు. నిజానికి ఈ కీర్తనలకు ఇంతకు మించిన ఎంతో లోతయిన అర్థముంది. మంత్ర శాస్త్ర రహస్యాలున్నాయి. సంగీత శాస్త్రం మర్మాలున్నాయి. వేద సంప్రదాయముంది. సప్త స్వరాల్లో ఒక్కొక్క స్వరంలో ఒక్కో దైవాన్ని చూసే భక్తి తాదాత్మ్యముంది.
తాళం విరుపులో నాదతనుమ్ అనిశం కాస్తా- నాదా- తనుమ- నిశం అయ్యింది. సామవేద సారం కాస్తా- సామా- వేదం అయ్యింది. ఒక్క మంగళంపల్లి బాల మురళీ కృష్ణ మాత్రం అదే రాగంలో ఉన్నదున్నట్లు సాహిత్యానికి భంగం కలగకుండా పాడారు. స్వర లయల్లో రాగం శ్రుతి తప్పకుండా మిగిలి ఉండవచ్చు కానీ- మంత్రాక్షరాలను ఎత్తుగడలో బంధించిన త్యాగయ్య లేని దీర్ఘం పెట్టి ఎందుకు పాడతాడు? అన్న చిన్న లాజిక్ ను మన పేరు గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసులు మిస్సయ్యారు. పైగా పల్లవి- నాదతనుమ్
అనుపల్లవి- మోదకర లో రెండో అక్షరం ద ప్రాస. యతి- ప్రాసల్లో ఉన్న అక్షరరూపం మార్చడానికి వీల్లేకుండా సులభంగా దొరికేది. సంగీతం తెలిసినవారికి స్వరాలు, శ్రుతి, ఆరోహణ, అవరోహణ, గమకాలు, ఊపిరి బిగబట్టడం, మనో ధర్మమే ప్రధానం తప్ప- సాహిత్యం, సంధి, సమాసం, పదాల అన్వయం పట్టింపు ఉండదు. ఒక్కొక్క అక్షరాన్ని తీర్చి దిద్దిన, ఇక మళ్లీ పుట్టని త్యాగరాజాదుల సంగీతాన్ని మనం కాపాడుతున్న మాట నిజమే కానీ- వాగ్గేయకారుల సాహిత్యాన్ని మనం అర్థం చేసుకుని పాడుతున్నామా అన్నదే సమాధానం దొరకని ప్రశ్న. బహుశా అందుకే త్యాగయ్య-
“తెలిసి కీర్తన చేయవే!”
అని స్పష్టంగా చెప్పినట్లున్నాడు.
“భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెందరో మహానుభావులు”
ఇందులో భావ- రాగ- లయాది త్యాగయ్య చెప్పిన వరుస. భావం ఒక్కటి వదిలేసి మనం రాగ లయలనే ఎక్కువ పట్టుకున్నాం. రాగం, తాళం సాహిత్యానికి శాశ్వతత్వం ఇస్తాయి కానీ- మనో ధర్మంతో పాటు ఆయా భాషల ఉచ్చారణ ధర్మం, మాండలికం పలుకు ధర్మం, సంధిలో పదాలు కలిసినప్పుడు మారే అక్షరాల వ్యాకరణ ధర్మం, ఆ పదాలకు నిర్దిష్టమయిన, నిర్దుష్టమయిన ప్రతిపాదిత అర్థ ధర్మం కూడా అంతే ప్రధానం. లేక పొతే నాదతనువు కలిగిన శివుడిని నాదా? నీదా తనువు? అని అడుగుతున్నట్లు అర్థం. శబ్దం ఎంత గొప్పదయినా అది అర్థాన్ని మోయకపోతే- కోయిల గానంలా ఒక పరిధి వరకే ఆనందింపజేస్తుంది. వాగ్గేయకారుల్లో ముందు వాక్కే గంగలా ఆలోచనామృతమై ప్రవహిస్తుంది. తరువాత అది గేయంగా ఆపాతమధురమై తేనెలు చిలుకుతుంది.
ఏదో ఒకటి ఆ మాత్రం పాడుతున్నారు- అదే గొప్ప- అనుకుంటే చేయగలిగింది లేదు. అందుకే కొందరు మౌఖిక స్వర సంగీతం కంటే- వీణ, వయోలిన్, వేణువు లాంటి వాద్యాల మీద శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికే ఇష్టపడుతుంటారు. వాద్యాల మీద సంగీత కీర్తనలక్కూడా సాహిత్యమే ప్రాతిపదిక. కానీ ఇందులో సాహిత్యాన్ని దాటి ఆయా వాద్యానికి సొంతమయిన శబ్దం ప్రధానమవుతుంది. ఒక పెళ్లి మంగళ వాద్య మేళాన్ని గొంతులో పలికించగలమా? గోటి మీటులకు కదిలి పాడే వీణ తీగల వసంత గానాన్ని గొంతు పలికించగలదా? విషాద జీరను తీగల గొంతు చించుకుని పాడే వయోలిన్ కన్నీటి ధారను గొంతు పలికించగలదా? వెదురులో ఒదిగిన గాలి వేణువు పాటై గాంధర్వ గానంగా మనసుకు రెక్కలు కట్టడాన్ని గొంతు పలికించగలదా?
అన్ని వాద్యాలకు రారాజు వీణ. తీగ వాద్యాలకు తల్లి వీణ. సరస్వతి చేతి అలంకారం వీణ- కచ్ఛపి. నారదుడి చేతిలో ఆగక మోగే వీణ- మహతి. బొబ్బిలి వీణ. నూజివీడు వీణ. తంజావూరు వీణ. మైసూరు వీణ. త్రివేండ్రం వీణ. సరస్వతి వీణ. రుద్ర వీణ. చిత్ర వీణ. విచిత్ర వీణ. ఇంకా లెక్కలేనన్ని వీణలు. వీణలో భాగాలకు మన శరీరంలో మూలాధారాది చక్రాలకు లోతయిన సంబంధముందని నాదోపాసకులు చెబుతారు. అనాహత నాదమే మన శరీరంలో ప్రాణానికి ఆధారమయిన ఊపిరి. గుండె లయ సంగీతం. “వడిబాయక తిరిగే ప్రాణబంధుడా!” అని ఊపిరిలో ఉన్న దైవాన్ని, లయలో ఉన్న ప్రాణాన్ని అన్నమయ్య కనుగొన్నాడు.
సంగీతానికి రాళ్లు కరుగుతాయి. ప్రకృతి పులకిస్తుంది. దీపాలు వెలుగుతాయి. మేఘాలు కురుస్తాయి. పోయే ప్రాణాలు నిలబడతాయి. ఆ సంగీతంలో ప్రాణముందని గ్రహించాలి. నాదమే ప్రాణమని, దైవమని త్యాగరాజాదులు ఎలా ఉపాసించారో తెలుసుకోవాలి. సాహిత్యం, స్వరాలు తెలియకపోయినా మనదయిన సంగీతం వినడాన్ని చెవులకు అలవాటు చేయాలి. మనసుకు నేర్పాలి. సంగీతాభిరుచి రుచిని రుచి చూడాలి.
జి-20 సదస్సుకు వచ్చే 200 మంది అతిరథ మహారథులకు బహుమతులుగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం బొబ్బిలి వీణలకు ఆర్డర్ ఇచ్చింది. మొన్ననే విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు వచ్చిన అతిథులకు కూడా బొబ్బిలి వీణలనే బహూకరించారు.
నా మిత్రుడు ప్రఖ్యాత వీణా విద్వాంసుడు ధూళిపాళ శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం మేరకు ఒక్కో ప్రాంతం వీణది ఒక్కో ప్రత్యేకత. మీటినప్పుడు వీణ తీగలో పుట్టే శబ్దం వాడే చెక్క, తీగల అమరికను బట్టి ఆధారపడి ఉంటుంది.
తెలుగువారికి బొబ్బిలి, నూజివీడు వీణలు అత్యంత ప్రీతిపాత్రమైనవి. అందులో బొబ్బిలి వీణ శబ్ద మాధుర్యం వినాల్సిందే కానీ…మాటలకు అందేది కాదు.
తమిళనాడులో 90 శాతం తంజావూరు వీణనే వాడతారు. శబ్దం వీనులవిందుగా ఉంటుంది. వాడడం, మోయడం కూడా సులభం.
అన్ని వీణలను పనస చెక్కతోనే తయారు చేస్తారు. తేలిగ్గా ఉంటుంది. ఏ రుతువులో, ఏ వాతావరణంలో అయినా ఒకేలా ఉంటుంది.
తెలుగు నేలమీద ఈమధ్య మామిడి చెక్కతో కూడా వీణలు తయారు చేస్తున్నారు కానీ…అవి చాలా బరువు. రుతువులు మారుతున్నప్పుడు చెక్క సంకోచ వ్యాకోచాలకు గురై శబ్దం మారిపోతూ ఉంటుంది.
కర్ణాటక మైసూరు ప్రాంతంలో నల్ల చెక్కతో వీణలు తయారు చేస్తారు. అందుకే మైసూరు వీణ నల్లగా ఉంటుంది. మైసూరు వీణతో ప్రపంచాన్ని సమ్మోహనంలో ముంచి తేల్చినవాడు మన చిట్టి బాబు.
ఈమని శివశంకర శాస్త్రి మొదలు ఇప్పటి ఫణి నారాయణ దాకా వీణా వాదనలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న తెలుగువారు ఎందరో ఉన్నారు.
బొబ్బిలి వీణలు బొమ్మగా మారి బహుమతులు అయినందుకు బాధ పడాల్సిన పని లేదు. అలా అయినా బొబ్బిలి వీణలకు అంతర్జాతీయ గుర్తింపు వస్తోందని, ఆ రూపంలో అయినా వంశపారంపర్యంగా ఈ వీణల తయారీని నమ్ముకుని బతుకుతున్న అరుదయిన కళాకారులకు కొంతలో కొంత ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని సంతోషించాలి.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :