Don’t Sound: దగ్గుబాటి వెంకటేష్ కు రానా స్వయానా అన్న కొడుకు. రానాకు నాన్న తరువాత నాన్నంతటివాడు వెంకటేష్. వాళ్లిద్దరి మధ్య కత్తులు నూరుకునేంత వైషమ్యాలు ఎందుకుంటాయి? ఒక వేళ ఉన్నా పరస్పరం గొంతులు కోసుకునేంత పగలుగా ఎందుకు మారతాయి?
అందుకే లక్షల కోట్ల అంతర్జాతీయ వినోద ఓ టీ టీ కంపెనీ నెట్ ఫ్లిక్స్ వెంకటేష్- రానా మధ్య యుద్ధాన్ని భాషలో ఒత్తులు తీసేసి తేలిక చేసింది. లేదా అది అసలు యుద్ధం కాదు; ఒట్టి నటన అని అక్షరాలతో ప్రతీకాత్మకంగా చెబుతున్నట్లుంది!
అపోహలు
అభిప్రాయభేదాలు
వాగ్వాదాలు
రచ్చ
సిగపట్లు
బాహాబాహీ లాంటివి చాలా చిన్న మాటలు. యుద్ధం చాలా పెద్ద మాట. యుద్ధంలో ఓడినవాడు యుద్ధసీమలో, గెలిచినవాడు ఇంట్లో ఏడుస్తారని లోకానుభవం. అంటే యుద్ధం ఎవరికీ ఓదార్పు కాదని.
అందుకే ఇది అలాంటి రక్తం ఏరులై పారే యుద్ధం కానే కాదని…
నెట్ ఫ్లిక్స్-
“నాయుడు కుటుంబంలో యుద్దం
చూడడానికి ఊరంతా సిద్దం”
అని-
యుద్ధానికి బదులుగా ఒత్తు తీసిన “యుద్దం”,
సిద్ధానికి బదులుగా ఒత్తు తీసిన “సిద్దం”
రాసిందని మనం అనుకుంటేనే ఆ మొదటి పేజీ రంగుల ప్రకటనలో తాటికాయంత అక్షరాలను దాటి లోపలి పేజీల్లోకి వెళ్లగలం.
తెలుగు ప్రకటనల్లో భాషకు పట్టిన దరిద్రం మీద ముప్పయ్ ఏళ్లలో కనీసం మూడు వందలకు పైగా వ్యాసాలు రాసి ఉంటాను. ఒట్టి కంఠ శోష- అంతే. పరిస్థితి నానాటికి తీసికట్టు.
అంతర్జాతీయ స్థాయి యాడ్ ఏజెన్సీలు మొదట ఇంగ్లీషులో ప్రకటనలు రాసి వాటిని ఎక్కడికక్కడ అవసరాన్ని బట్టి ప్రాంతీయ భాషల్లోకి అనువదించేవి. చాలా కృతకమయిన భాషతో చదవడానికి వీలు కాకుండా ఉంటాయి ఆ అనువాదాలు. మనుషులు చేసినదే యంత్రానువాదమని ఇదివరకు భాషా శాస్త్రవేత్తలు గుండెలు బాదుకునేవారు. ఇప్పుడు గుడ్డి గూగుల్ అనువాద యంత్రమే అనువాదం చేస్తోంది కాబట్టి యంత్రానువాదం మాట తిట్టు కాకుండా పొగడ్తగా మారినట్లుంది. లేదా యంత్రానువాదంలో గూగుల్ తో అనువాదకులు, కాపీ రైటర్లు పోటీలు పడుతున్నట్లున్నారు. “దృశ్యాత్మక సృజనీకరణ” అని ఈమధ్య ఒక ప్రకటన కింద డిస్ క్లైమర్ చూసి నాకు కళ్లు తిరిగాయి. కడుపులో దేవినట్లయ్యింది. తీరా అదే ప్రకటన ఇంగ్లీషు యాడ్ చూస్తే…
“Creative visualisation” మాటకు “సృజనాత్మక దృశ్యీకరణ”
అనబోయి ఆ మాట అన్నట్లు ఊహించాల్సి వచ్చింది.
“సృజనాత్మక చిత్రీకరణ” అంటే ఎవరైనా జైల్లో పెడతారని భయపడినట్లున్నారు.
ప్రకటనలు అంటే చూడకుండా, చదవకుండా దాటేయాల్సినవి అన్న నిశ్చితాభిప్రాయంతో పట్టించుకోవట్లేదు కానీ…
పట్టించుకుంటే అనువాద ప్రకటనల ప్రభావంతో ఊరికో ఎర్రగడ్డ అవసరమవుతుంది! ఇప్పుడున్న దేశ కాల పరిస్థితుల దృష్ట్యా అది ఏమాత్రం అభిలషణీయం కానే కాదు!
కాబట్టి-
మనం నాయుడు కుటుంబంతో పాటు…
రష్యా- ఉక్రెయిన్
“యుద్దం” చూడడానికి కూడా తేలిక మనసుతో “సిద్దం” కావడమే ఉత్తమం!
ఏయ్ ఎవరక్కడ?
చిత్తం ప్రభూ!
యుద్దానికి అంతా సిద్దమా?
సిద్దం…సిద్దం ప్రభూ!!
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :