Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఫలితాల ప్రకటనలు ఒక ప్రహసనం

ఫలితాల ప్రకటనలు ఒక ప్రహసనం

War for Winner: ప్రతిష్ఠాత్మక ఐ ఐ టీ ల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే జె ఈ ఈ ఫలితాలొచ్చిన ప్రతిసారీ నాకు దిగులుతో కూడిన వైరాగ్యం నుండి పుట్టిన అయోమయం కలగలిసిన అజ్ఞానం పేర్చిన అవిద్య వెంటపడుతుంది. నేను అలాంటి మనవాతీతులు సాధించే పరీక్ష రాయలేదని నాకు ఏ కోశానా బాధ లేదు.

ఆ ఫలితాలొచ్చిన మరు క్షణం వచ్చే ప్రకటనలు చూడాలన్నా, చదవాలన్నా, వినాలన్నా భయంగా ఉంటుంది. బాధగా ఉంటుంది. సిగ్గుగా ఉంటుంది. ఏ కోచింగ్ సెంటర్ ప్రకటనలో చూసినా ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ వారికే వచ్చి ఉంటుంది. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ పది, పదిహేను పెద్ద కోచింగ్ సెంటర్లకు సమానంగా పంచే ర్యాంకుల ప్రజాస్వామికీకరణ నూత్న విద్యా విధానం ఏదయినా ఉండి ఉంటే నా అజ్ఞానం క్షమించబడుగాక!

“మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం” అన్నట్లు ఈ ప్రకటనల నిత్య చైతన్య పారాయణ హోరులో ఒకటి- ఒకటి, రెండు- రెండు అన్నట్లు ఒకటి రెండు మంచి విషయాలు కూడా లేకపోలేదు.

భాషలో “సాధ్యం” అన్న మాటకు ఎన్ని పర్యాయపదాలు ఉన్నాయో? ఆ మాటకు వ్యతిరేకార్థాలు ఎన్ని ఉన్నాయో? స్వరపేటికలో స్వర తంత్రులు తెగిపోయేలా గొంతు చించుకుని ఆ మాటను ఎంత తీవ్ర శ్రుతిలో చెప్పవచ్చో? “సాధ్యం” అన్న ఒక్క మాటతో ఆసేతు హిమాచలం వెన్నులో ఎలా వణుకు పుట్టించవచ్చో? ఆ ఒక్క మాటతో మన పిల్లలను మనకు మనమే నిర్దయగా వారికి అప్పగించాలన్న ఆత్రుత పెరుగుతుందో? లాంటి కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా అర్థం కావాలంటే జె ఈ ఈ ఫలితాలు వచ్చినప్పుడు రేడియో వినాలి. టీ వీ లు చూడాలి. పత్రికలు తిరగేయాలి.

సాధారణ భాషా నియమాల ప్రకారం సాధ్యానికి ముందు “అ” వచ్చి అసాధ్యం అయి వ్యతిరేకార్థ పదం ఏర్పడుతుంది. కానీ వీరి అసాధ్యం కూల!
“ఆలిండియా ఓపెన్ కేటగిరి మొదటి పది ర్యాంకులు మాకే సాధ్యం. ఇంకెవరికీ అసాధ్యం. కలలో కూడా దుస్సాధ్యం. దుర్భేద్యం” అన్న ప్రకటనలో తెలుగు భాషా భాగాలు, వ్యతిరేక పదాలు, అతిశయోక్తి, ఉత్ప్రేక్ష అర్థాలంకారాలు, అంత్య ప్రాసల శబ్దాలంకారాలు నాలాంటి విద్యార్థులకు లెక్కలేనన్ని.

ఇక్కడ దాకా ప్రస్తుతం. ఏడాదిన్నర కిందట- పిల్లల ర్యాంకుల ప్రకటనల్లో అతిశయోక్తులు, అర్ధ సత్యాలు, అసత్యాలు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసినప్పుడు ఐ ధాత్రి రాసిన మాటలు ఇక్కడి నుండి-

ప్రకటనలు ఆగేనా?
—————–
అంటే…ఇక-
ఒకటి…ఒకటి…ఒకటి…
అంటూ రెండు కాక ఒకటే అయిన చైతన్య అద్వైత ఆలిండియా అగ్రగామి ప్రకటనలు కనబడవా?

అంటే…ఇక-
రెండు…రెండు…రెండు…
అంటూ ఒకటే అయినా రెండుగా కనిపించే నారాయణ ద్వైత ప్రకటనలు వినపడవా?

అంటే…ఇక-
బైజూస్ ఆన్ లైన్ కోచింగ్ ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో పిల్లలు సూర్యచంద్రుల్లా తారాపథంలో వెలుగుతుండగా షారుఖ్ ఖాన్ మురిసి ముప్పందుమయ్యే ప్రకటనలు కనుమరుగవుతాయా?

అంటే…ఇక-
ఆకాష్ ప్రకటన ఆకాశంలో కలిసిపోతుందా?
విరాట్ కోహ్లీ పిల్లల చేత బూస్ట్ తాగించలేడా?
మన ఎర్రచందన పుష్పం అల్లు అర్జున్ ఇంటర్ పిల్లలకు తగ్గకుండా పాఠాలు చెప్పకూడదా?
క్రికెటర్ రోహిత్ శర్మ ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షల పిల్లలకు ఇన్ఫినిటీ క్లాసులు తీసుకోకూడదా?
పిల్లల మెదడు వికసించడానికి ఫలానా డ్రింకు తాగండి అని ప్రిన్సులు పిలుపునివ్వకూడదా?
పుడితే ఇంద్రధనుసులోనే పుట్టాలని…లేకపోతే పుట్టకుండా తల్లి కడుపులోనే ఉండిపోండి అని సెలెబ్రిటీ శాపనార్థాలు పెట్టకూడదా?

పిల్లలకు ఇది పెడితే బలం; ఇది తినిపిస్తే మహా బలం; అవి వేస్తే అందం; ఇవి తొడిగితే మహానందం; ఇక్కడ చేరితే స్వర్గం; అక్కడ ఉంటే పునర్జన్మే లేని మోక్షం…లాంటి ప్రకటనలు ఇక కనబడనే కనపడవా?

కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయంగా రుజువు కాని ఉత్పత్తుల ప్రకటనల్లో నటించేవారి మీద కూడా చర్యలు ఉంటాయి. అలాంటి ప్రకటనలను తయారు చేసినవారు, ఆ ప్రకటనకు మూలమయిన కంపెనీ లేదా సంస్థ వారు అందరూ అందులో ఉన్న ప్రతి అక్షరానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు-
“శ్రీ చైతన్యలో చేరడం వల్లే ఇన్ని వేల మంది మెడిసిన్లో, ఇన్ని లక్షల మంది ఇంజనీరింగ్ లో చేరగలిగారు” అని అల్లు అర్జున్ చెబుతున్న ప్రకటన ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ఎన్ని లక్షల మందికి శిక్షణ ఇస్తే…అందులో నుండి ఎన్ని వందల మంది ఎంపికయ్యారో స్పష్టంగా చెప్పాలి. అలా చెప్పనప్పుడు ఎంపికయిన వారి నంబర్లు మాత్రమే చెప్పి పిల్లలను ఆకర్షించడం తప్పు అవుతుంది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో ఉన్న అల్లు అర్జున్ కు, శ్రీ చైతన్య యాజమాన్యానికి, ఆ ప్రకటనను అచ్చేసిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలకు కూడా నోటీసులు ఇవ్వవచ్చు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆ ప్రకటనలను నిషేధించవచ్చు.

ఆచరణలో సాక్షాత్తు నారాయణుడికే విద్యా చైతన్యం ఇవ్వగలిగిన సంస్థలను మానవమాత్రులయిన ఐ అండ్ బి అధికారులు ఏమి చేయగలరు? అన్న నిర్వేదం, వైరాగ్యం ఉండనే ఉంటాయి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు కూడా ఉండి ఉంటాయి.

కొత్త నిబంధనలతో ప్రయోజనం ఉండవచ్చు. ఉండకపోవచ్చు.
కనీసం- చర్చ అయినా జరుగుతుంది. ఎక్కడో ఒక చోట ఇలాంటి ప్రకటనలకు అడ్డు కట్ట వేయకపోతే…సరస్వతికి తామే అ ఆ ఇ ఈ లు దిద్దించామని, బృహస్పతికి తామే హోమ్ ట్యూషన్ చెప్పామని, సూర్యుడికి తామే వెలుగులు పంచామని, నదికి తామే నడకలు నేర్పామని…ఇంకా అదని…ఇదని…ఏది చెప్పినా మనం గంగిరెద్దుల్లా తలలూపాల్సి ఉంటుంది.

(తాజా జె ఈ ఈ మెయిన్ ప్రకటనల హోరు నేపథ్యంలో సర్వతంత్ర స్వతంత్ర సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సార్వభౌమ దేశం పెద్ద పెద్ద కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల ఈక కూడా పీకలేవు అని అర్థం చేసుకోవడానికి…మరోమారు పునరుక్తి. అంతే!
పునరపి జననం…పునరపి…అంతే!)

అన్నట్లు-
నారాయణకు మిగతావారందరూ అందుకోలేని, చేరుకోలేని “ప్రత్యర్థులు” అట. ఇదే స్ఫూర్తితో చైతన్యకు మిగతావారు శత్రువులే అయి ఉంటారు. వారికి వారే తొడగొట్టి సవాళ్లు విసురుకుంటున్న ఈ ప్రమాణాల ప్రకారం-
1. కాలేజీలు- యుద్ధ సీమలు.
2. విద్యార్థులు- వీరసైనికులు.
3. తరగతి గదుల్లో నేర్పేది- యుద్ధ విద్య.
4. ఒత్తిడి తట్టుకోలేని విద్యార్థుల ఆత్మహత్యలు- వీర మరణాలు.
5. నారాయణకు చైతన్య శత్రు దేశం; వైస్ వర్సా చైతన్యకు నారాయణ రష్యాకు ఉక్రెయిన్ లాంటిది.
6. తల్లిదండ్రులు- విషాద చారికలు.
7. పరీక్షలు- అణుబాంబులు.
8. ఫలితాల ప్రకటనలు- మానవ బాంబులు.
9. చివర ఫలశ్రుతి- యుద్ధం మిగిల్చిన బూడిద.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్