Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాంగ్రెస్ యుక్త్ భాజపా!

కాంగ్రెస్ యుక్త్ భాజపా!

With No difference: కర్ణాటక ఫలితాలు వెల్లడవగానే ‘భాజపా ముక్త్ దక్షిణ భారత్’ అనే నినాదం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. నిజానికి కర్ణాటకలో భాజపా ఓడటం ఇవాళే తొలిసారి కాదు. గతంలోనూ ఓడింది… మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పరాజయం పాలైంది. అయినా ఈ నినాదం వినిపించటానికి కారణం… ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటూ భాజపా, ప్రధాని నరేంద్ర మోడీలు గతంలో పదే పదే వల్లించిన వాదమే! దానికి పొటీగానే ఇప్పుడు ‘భాజపా ముక్త్ దక్షిణ భారత్’ వచ్చిందనేది అందరికీ అర్థమయ్యేదే!

కాంగ్రెస్ ముక్త్ భరత్ అంటే… మామూలుగానైతే కాంగ్రెస్ నుంచి భరత్ ను విముక్తి చేయాలని అర్థం! ఇలా పిలుపునివ్వటం ద్వారా దేశంలో అస్సలు కాంగ్రెస్ పార్టీ అనేదే లేకుండా చేయాలనుకుంటున్నారా అని అడిగితే… 2014లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో నరేంద్ర మోడీ ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘కాంగ్రెస్ ముక్త్ భరత్ అంటే…. కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేయాలని కాదు, కాంగ్రెస్ సంస్కృతి నుంచి భారతావనిని విముక్తి చేయాలన్నది మా ఉద్దేశం’ అని మోడీ సంకల్పం చెప్పుకున్నారు. మరి ఈ పదేళ్ళలో భాజపా ఈ సంకల్పాన్ని ఎంత మేరకు నెరవేర్చుకోగలిగిందనేది విశ్లేషించాల్సిన అంశం! పైగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఈ రాజకీయ ‘ముక్తా’వళి  సమీక్షించుకునేందుకు మంచి సమయం, సందర్భం కూడా!

ఢిల్లీ చేతుల్లో అధికారమంతా కేంద్రీకృతం చేయటం; పాలనపరంగా రాష్ట్రాలు కేంద్రానికి అణిగిమనిగి ఉండాలనుకోవటం;  విపక్షాలపై విచారణ సంస్థలను ప్రయోగించటం; సొంత పార్టీలోనూ అధిష్టానమే సర్వస్వంగా మారటం; ప్రతి నిర్ణయానికీ అధిష్టానంపై ఆధారపడటం; ఢిల్లీ నుంచి నాయకత్వాన్ని, ఆదేశాలను రుద్దటం; రాష్ట్ర నాయకత్వాలను నిర్వీర్యం చేయటం లేదా సమర్ధ నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవటం; స్థానిక నాయకత్వాల మధ్య విభేదాలను ప్రోత్సహించి ఢిల్లీ పెద్దలపై ఆధారపడేలా చూసుకోవటం…. ఇవీ కాంగ్రెస్ సంస్కృతికి అద్దంపట్టే ప్రధాన భావనలు. మరి వీటి నుంచి భాజపా ఎంతమేరకు విముక్తి కల్గించిందని ప్రశ్నించుకుంటే సమాధానం పెద్ద కష్టమేమీ కాదు. (పార్టీ విత్ ఏ డిఫరెన్స్)కాంగ్రెస్ కు భిన్నమైన పార్టీ అనే భావనతో ఆరంభమైంది కాస్తా.. ఇప్పుడు అచ్చం కాంగ్రెస్ లా మారటం రాజకీయ వైచిత్రి! కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య (విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల) విభేదాలు శృతి మించుతున్నాయి. నాడు ఇందిరాగాంధీ  హయంలో ఇష్టం వచ్చినట్లు 356 అధికరణాన్ని ప్రయోగించి ప్రభుత్వాలను కూల్చేసేవారు. ఇప్పుడది రాజకీయ బేరసారాలతో వేరే రూపంలో జరుగుతోంది. ఇందిర హయంలో మాదిరిగానే విపక్షనేతలపై వేధింపులు సాగుతున్నాయనే ఆరోపణలకు ఆస్కారం పెరిగింది.

అన్నింటిపైనా ఢిల్లీ పెత్తనమే. సొంత పార్టీలోనూ అధిష్టానమే సర్వాధికారిగా మారింది. ఇందిరాగాంధీ మాదిరిగానే వ్యక్తి పూజకు పెద్దపీట! స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రికం దాకా అధిష్టాన నేత… నరేంద్ర మోడీని చూపించి ఓట్లు పొందాలనుకోవటం… ఇవన్నీ కాంగ్రెస్ కంటే భాజపా భిన్నమైన పార్టీ అనే భావనను మరపించేవే! అందుకే కాంగ్రెస్ ముక్త్ భారత్ అని నినదించిన పార్టీ… కాంగ్రెస్ యుక్త భాజపాగా రూపాంతరం చెందుతోందనే ఆందోళన, ఆవేదన ఆ పార్టీలోనే కనిపిస్తోంది. ఈ సంగతిని గుర్తించకుండా కాంగ్రెస్ గతంలో చేసిన తప్పిదాలనే భాజపా ప్రస్తుతం చేస్తోంది. అన్ని రాష్ట్రాలకూ విస్తరించాలనుకుంటున్న ఆ పార్టీ స్థానికంగా బలమైన నాయకులను తయారు చేసుకోవటంపై దృష్టి సారించకుండా నరేంద్ర మోడీ ఛరిష్మాతో అన్నీ నెగ్గేస్తామనుకోవటం అత్యాశే కాదు, ఆధునిక భారతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటమే!

ఏ పార్టీ అయినా రాజకీయంగా ఎదగాలనుకోవటం, అధికారంలోకి రావాలనుకోవటం, అందుకు తగ్గ వ్యూహాలు రచించుకోవటం సహజం. కానీ ఏ విధానాలను రూపుమాపుతామని చెప్పారో, వేటిని అసహ్యించుకున్నారో వాటి బాటలోనే పయనించటం ఆ పార్టీపై నమ్మకాన్ని తగ్గిస్తోంది. కాంగ్రెస్ కంటే భిన్నమైన పార్టీ అని ప్రజలు నమ్మి భాజపాను గెలిపించారు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తున్న, భిన్నమైన పరిస్థితులు కనిపించినప్పుడల్లా తిరస్కరంచడానికి అదే ప్రజలు వెనకాడటం లేదన్నది నడుస్తున్న చరిత్ర చెబుతున్న పాఠం.

ఎన్నికల్లో కులాలు, మతాలు, ఇతరత్రా సమీకరణాల ప్రభావం ఉన్నా… సమర్థ నాయకత్వం, పాలనకు రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారనేది ప్రతి ఎన్నికలూ స్పష్టం చేస్తున్నాయి, ఎంతగా ఆకర్షణలు, ప్రలోభాలున్నా… ప్రతి సందర్భంలోనూ ప్రత్యామ్నాయాలను ప్రజలు బేరీజు వేసుకుంటూనే ఉన్నారు. బెంగాల్ ఎన్నికలనే తీసుకుంటే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోడీని చూసి భాజపాకు 18 సీట్ల దాకా కట్టబెట్టినవారు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చిసరికి మమతా బెనర్జీకే పట్టం గట్టారు. కారణం ఆమెను మించిన సమర్థ నాయకత్వం భాజపాలో కన్పించకపోవటమే! అంతెందుకు… గత ఒరిస్సా అసెంబ్లీకి లోక్ సభతో పాటు ఒకేసారి ఎన్నికలయ్యాయి. మెజార్టీ లోక్ సభ సీట్లను భాజపాకు కట్టబెట్టిన ఒరియా ఓటర్లు, అసెంబ్లీ లో మాత్రం నవీన్ పట్నాయక్ పార్టీ బిజేడికి అప్పగించారు. అదీ ఆధునిక ఓటరుకున్న స్పష్టత.

ఓటర్లలోని ఈ పరిస్థితిని గమనించకుండా… ప్రధాని నరేంద్ర మోడీని చూసి రాష్ట్రంలో ఓట్లేయమని భాజపా అడుగుతోంది. మోడీ వచ్చి తమ రాష్ట్రంలో పాలించరని మొన్న హిమాచల్ లో, నిన్న కర్ణాటకలో ఓటర్లు మనసులో మాట స్పష్టంగా చెప్పారు. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ రూపంలో భాజపాకు బలమైన నాయకుడున్నాడు కాబట్టే ఆ పార్టీ నెట్టుకు రాగలుగుతోంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సారధ్యాన్ని నమ్మారు కాబట్టే రెండో దఫా కూడా గెలిపించారు. ఇతర సమీకరణాలన్నీ ఎలా ఉన్నా.. స్థానిక నాయకత్వ సమర్థత అనేది ఆయా పార్టీల విజయావకాశాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. అది లేనప్పుడు రాహుల్ ను చూసి కాంగ్రెస్ కు, మోడీని చూసి భాజపాకు రాష్ట్రాల్లో అధికారాన్ని అప్పగిస్తారనుకుంటే ఇందిరాగాంధీ కాలంలో ఆగిపోయినట్లే!

బిక్కుబిక్కుమంటూ రాహూల్ గాంధీ ప్రచారాన్ని జాగ్రత్తగా నడిపించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు…. ఇప్పుడు గెలవగానే ఆయన వల్లే గెలిచామని, రాహుల్ పాదయాత్రను చూసి కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారని ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల ఆత్మవంచన ఎలా ఉన్నా నిజం ఏంటన్నది అందరికీ తెలుసు. రాష్ట్రంలో భాజపా స్థానిక నాయకత్వం కంటే కాంగ్రెస్ నాయకత్వం మెరుగ్గా ఉంటుందని నమ్మారు కాబట్టి నరేంద్ర మోడీ వచ్చిన అడిగినా భాజపాను గెలిపించలేదు. సమర్థ పాలనను కోరుకుంటున్న సమకాలీన ప్రజానీకం సదా మెరుగైన ప్రత్యామ్నాయాల కోసం వెదుకుతుందనేదే కర్ణాటక ఫలితం చెబుతున్న సత్యం!

-అజ్ఞానానంద

RELATED ARTICLES

Most Popular

న్యూస్