Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసృజనాత్మక నిద్ర

సృజనాత్మక నిద్ర

Sleep Well: నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను రెప్ప వేసే కాలమే నిమిషం. దేవతలకు మనలాగా కనురెప్పలు పడవు కాబట్టి వారు అనిమేషులు.

కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత సులభం కాదు. కొందరు నిద్రకోసం పరితపిస్తారు. నిద్రకు వేళాయెరా! అని తమను తాము జోకొట్టుకుంటూ సంగీతం వింటూ రాత్రంతా నిర్ణిద్ర గీతాలు విని తరిస్తూ ఉంటారు. కొందరికి మాత్రల్లో నిద్ర దొరుకుతుంది. కొందరికి మద్యంలో దొరుకుతుంది. కొందరికి ఏ సీ ల్లో దొరుకుతుంది. తమకు నిద్ర ఎందుకు పట్టడం లేదని కొందరు నిద్రపోతున్న వారిని తట్టి లేపి నిలదీస్తుంటారు. నిద్ర లేమి ఒక జబ్బు అని కొందరి భయం. నిద్ర లేమి ఒక మానసిక సమస్య అని కొందరి ఆందోళన.

సర్వంసహా చక్రవర్తి హంసతూలికా తల్పం మీద పడుకున్న నిద్ర; పక్కనే కటికనేల మీద ఆయన బంటు పడుకున్న నిద్ర రెండూ ఒకటే అన్నాడు అన్నమయ్య.

“కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది” అని శాస్త్రీయ నిరూపణను పాటలో బంధించి జోలపాడాడు ఆత్రేయ. నిజానికి నిద్ర విశ్రాంతి స్థితి. మెదడు, శరీరం బలం కూడగట్టుకోవడానికి అనువయిన సమయం. ప్రతి ఉదయం నూతనోత్సాహంతో పరుగులు పెట్టడానికి నిద్ర పెట్టుబడి. ఉత్ప్రేరకం. జీర్ణక్రియకు, ఆరోగ్యానికి అత్యవసరం.

రాత్రి ఉద్యోగాలు, రాత్రి రాచకార్యాలు, అర్ధరాత్రి దాటినా టీ వీ, స్మార్ట్ ఫోన్లు చూస్తుండడాలు…ఇలా కారణమేదయినా నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేయడమన్నది ఇప్పుడు దానికదిగా ఒక ఆనందం. ఒక నవీన సంస్కృతి. పగటి నిద్ర పనికి చేటు. రాత్రి మేల్కొలుపు ఒంటికి చేటు. గూట్లో దీపం; నోట్లో ముద్ద; కంటికి కునుకు- ఒకప్పటి సామెత. చుక్కలు పొడిచేవేళకు ఆదమరచి నిద్రపోవాలి. సూర్యుడు పొడవకముందే నిద్రలేవాలి.

కొందరు కళ్లు తెరిచి పడుకోగలరు. కొందరు ఎక్కడయినా పడుకోగలరు. కొందరు నడుస్తూ పడుకోగలరు. కొందరు నిద్రలోనే పోతారు. కొందరు నిద్రపోకుండానే పోతుంటారు. కొందరు సరిగ్గా నిద్రకు ముందే భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ కథల సీరియళ్లు, హారర్ సినిమాలు చూసి నిద్రకు దూరమవుతారు. లేదా అలాంటి మనుషులను తలచుకుని తలచుకుని నిదురరాని రాత్రిళ్లు గడుపుతుంటారు.

కుంభకర్ణుడి నిద్ర యుగయుగాలుగా ఒక కొలమానం. సామాన్యులు అందుకోలేని నిద్ర అది. ఊర్మిళ నిద్ర కూడా జగద్విదితమే. భారతంలో రాయబార ఘట్టంలో కపట నిద్రలు, దొంగ నిద్రలు మనకు తెలిసినవే. యోగనిద్ర యోగవిద్యతో మాత్రమే సాధ్యమయ్యేది. ఇక ఎప్పటికీ లేవలేనిది శాశ్వత నిద్ర. తెలుగు సాహిత్యంలో ఇంకెవరూ వాడని “పెద్ద నిద్ర(మరణం)” అన్న మాటను శ్రీనాథుడు ప్రయోగించాడు. నిద్రపోయే ముందు కలలో రాక్షసులు వచ్చి గొడవచేయకూడదని-

“రామస్కందం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యస్య స్మరణం దుస్వప్నం తస్య నస్యతి” అని శ్రీరామచంద్రుడు, కుమారస్వామి, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు- అయిదుగురు వచ్చి మన నిద్రను రక్షించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.

నిద్రలేవగానే-
“కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కర దర్శనమ్” అని లక్ష్మి, సరస్వతి, పార్వతి రోజంతా చేయి పట్టి నడిపించాలని నిద్రలేచి కళ్లు తెరుస్తున్నాం.

నిద్రలో కలలు నిజమనుకుని కొందరు మేలుకున్నాక నాలుక కరుచుకుంటారు. కొందరు మెలకువలోనే కలలు కంటూ ఉంటారు. రామాయణంలో త్రిజట స్వప్నం నిజమయ్యింది కాబట్టి మన కలలు కూడా నిజం కాకపోవు అని స్వప్నశాస్త్రం చుట్టూ తిరుగుతూ ఉంటాం. పగలు చూస్తే కొందరు రాత్రి కలలోకి వస్తారు. దుస్వప్నాలు రాకుండా కాపాడాల్సిందిగా ప్రార్థనలు కూడా ఉన్నాయి. లేస్తే మనుషులు కారు కాబట్టి కొందరు త్వరగా లేవరు. రాముడికి విశ్వామిత్రుడు కౌసల్యా సుప్రజా రామా! అని అందంగా, శ్రావ్యంగా మేలుకొలుపు పాడాడు. మనకు పాలవాళ్లు, పేపర్ బాయ్ లు, ఇంకెవరో తలుపులుబాదుతూ మేలుకొలుపు పాడతారు. వెంకన్నకు అన్నమయ్య జోలపాట పాడాడు. భద్రాద్రి రామయ్యకు రామదాసు జోల పాట పాడాడు. అయోధ్య రామయ్యకు త్యాగయ్య జోలపాట పాడాడు. మనకెవరు పాడతారు జోలపాటలు?

ఆకలి రుచి ఎరుగదు- నిద్ర సుఖమెరుగదు. అలసిన శరీరం హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. మనసులో వేన వేల ఆందోళనలు, భయాలు, బాధలు, ఆలోచనలు ఎగసి ఎగసి పడుతుంటే నిద్ర రమ్మన్నా రాదు. జీవితం ఎప్పుడూ యుద్ధమే. గెలిచినా, ఓడినా యుద్ధం ఆగదు. దైనందిన జీవితంలో ఏ రోజుకారోజు పోరాటమే. ఈ పోరాటానికి తగిన శక్తిని కూడగట్టి ఇచ్చేది నిద్ర ఒక్కటే. నిద్ర ఎక్కువయితే నిద్ర మొహం. తక్కువయితే నిద్రకు మొహం వాచిన ముఖం.

నిదురించే తోటలోకే పాటలు వస్తాయి. వచ్చి కొమ్మల్లో రెమ్మల్లో పూలను పూయిస్తాయి. కళలకు రంగులద్దుతాయి. కలల గాలులకు గంధం పూస్తాయి.

“సడిసేయకో గాలి!
సడిసేయబోకే!బడలి పుడమి ఒడిలో జగతి నిదురించేనే!
చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే ..
ఏటి గలగలకే ఎగిరి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నే నూరుకోనే …
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
నీలిమబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరిపోరాదే …” సమస్త తెలుగు సినిమా పాటలను తక్కెడలో ఒకవైపు వేసి…ఈ సడి సేయకేను ఒక్కటే ఒకవైపు వేసినా…సరితూగగల పాట.

నిద్రకు- ఆరోగ్యానికి ఉన్న ప్రత్యక్ష సంబంధం శాస్త్రీయంగా ఎప్పుడో రుజువయ్యింది. తాజాగా- నిద్రకు- జ్ఞాపకశక్తికి; నిద్రకు- సృజనాత్మకతకు ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా రుజువు చేసే అధ్యయనాల్లో ఆసక్తికరమయిన విషయాలు బయటపడ్డాయి. అమెరికాలో మస్సాచుస్సెట్స్ యూనివర్సిటీ- ఎం ఐ టీ అంటే శాస్త్ర సాంకేతిక విద్యకు, పరిశోధనలకు పెట్టింది పేరు. ఆ యూనివర్సిటి నిద్ర మీద చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే-
“నిద్రకు సృజనాత్మకతకు ప్రత్యక్ష సంబంధం ఉంది” అని.

అప్పటికే బాగా సృజనాత్మకత ఉన్న వ్యక్తిలో కూడా పడుకుని లేచిన వెంటనే ఉన్న సృజనాత్మక శక్తికి- రోజంతా పని చేసి…అలసిపోయి…పడుకోబోయే ముందు ఉన్న సృజనాత్మకత శక్తికి తేడా ఉంది. నిద్ర లేచిన వెంటనే బుర్ర చాలా క్రియేటివ్ గా పని చేయడాన్ని ఈ పరిశోధనలో కనుగొన్నారు.

దీని సారాంశాన్ని మనమిలా అన్వయించుకోవచ్చు.
1. ముఖ్యమయిన ఇంటర్వ్యూలు, పెద్ద పెద్ద పనులు ఉన్నప్పుడు రోజూ కంటే ఎక్కువసేపు పడుకోవాలి.
2. సృజనాత్మక రంగంలో ఉన్నవారు నిద్రకు అత్యంత విలువ ఇవ్వాలి. నిద్ర లేచిన వెంటనే సృజనాత్మక కళను తట్టి లేపాలి.
3. సృష్టిలో ఎవరికయినా నిద్రకు మించిన సుఖం లేదని తెలుసుకోవాలి.
4. నిద్రలో రంగు రంగుల కలలే కాదు…వర్ణ వర్ణాల కళలు కూడా వికసిస్తాయన్న ఎరుకతో నిద్రపోవాలి.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్