Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగూగుల్ డూడుల్ - పానీ పూరీకి అరుదైన గౌరవం

గూగుల్ డూడుల్ – పానీ పూరీకి అరుదైన గౌరవం

Pani-Puri: ఒకనాడు ద్రౌపది ఇంట్లో ఉన్న కాసిని పదార్థాలతో చేసిన వంటకం గోల్ గప్పా పేరుతో కుంతీదేవి ఆశీర్వాదంతో ప్రసిధ్ధమయింది- ప్రముఖ గప్పా రచయిత

కాదు కాదు మొగల్ వంటిళ్లలో తయారై పానీ పూరీ అనే పేరుతో అక్కడినుంచి సామాన్యుల వరకు ప్రయాణించింది – గొప్పల రచయిత

ఎహె ఇవన్నీ తప్పు, కచోరి లోంచి పుట్టిన చిచోరి పానీ పూరీ అని పాకనిపుణులంటారు. ఎవరేమన్నా, ఏమనుకున్నా పానీ పూరీ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ పెద్దన్న అనదగ్గ ఒక పానీ పూరీ తయారీ దారుడు 2015, జూలై 12 న ఇండోర్ లో 51 రకాలు తయారుచేసి రికార్డు నెలకొల్పాడు. ఎనిమిదేళ్ల తర్వాత గూగుల్ ఆ రికార్డును గౌరవిస్తూ డూడుల్ విడుదల చేసింది. ఇంతకన్నా పానీపూరీ ప్రియులకు ఏం కావాలి? రోజూ తిన్నా తనివితీరని స్ట్రీట్ ఫుడ్ కి ఇంత గౌరవం కలిగించినందుకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చేలా తింటున్నారు.

అన్నట్టు కళ్ళల్లో నీళ్లు అంటే గుర్తు వచ్చింది-రబ్ నే బనా దీ జోడీ అనే సినిమాలో పందెం కోసం షారుఖ్ ఖాన్ పానీ పూరీ తింటాడు. ఆ కారానికి కళ్ళల్లో నీళ్లు తిరిగినా. మళ్ళీ ఇంటికెళ్ళాక కూడా తినాల్సి వస్తుంది. సినీ ప్రియులతో పాటు పానీ పూరీ అభిమానులు కూడా సంబరపడ్డారు. అలా ఎన్నో చిత్రాల్లో పానీపూరీ కి ప్రత్యేక స్థానం దక్కింది.

పానీపూరీ అంటే ఆలూ కూర , చోలే పెట్టి పుదీనా నీళ్లతో ఇచ్చేదే అనుకుంటారు చాలామంది. కానీ ఎన్నెన్నో రుచులతో అలరిస్తోందీ వంటకం. చింతపండు, కారం కలిపిన పానీ నుంచి పుదీనా, మామిడి, పళ్ళ రసాలు… ఇలా రకరకాల పానీలు దొరుకుతున్నాయి. పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్లకంటే పానీ పూరీ వ్యాపారాలు ఎక్కువ సంపాదిస్తారని కూడా వినికిడి. ఆ మధ్య , ఆ మధ్య ఏముందిలే ఎప్పుడూ ఉంటారు ఆడిపోసుకోడానికి అన్నట్టు పానీ పూరీ మంచిది కాదని, ఎన్నో రోగాలు వస్తాయని భయపెట్టేవాళ్ళు. ముఖ్యంగా ఇంట్లో తల్లులు పిల్లలు బయట తినకూడదని వారే తయారుచేస్తుంటారు కూడా. టైఫాయిడ్ వంటి జ్వరాలకు ఇదే కారణమనేవాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే సంకల్పబలం ముందు ఇవి ఏ పాటి అని రోజురోజుకూ వీటిని తినేవారి సంఖ్య పెరుగుతోంది. మరి గూగులమ్మ కూడా అందుకే జూలై 12 పానీ పూరీ డే గా జరిపింది. ఇంతకీ ఈ శుభదినాన తిన్నారా లేదా! తినకపోతే పాపం చుట్టుకుంటుంది సుమా! పరిహారంగా రేపు డబల్ డోస్ వేసుకోవాలి మరి!

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్