Biggest Fraud Indian Banking :
Another Defaulter:
మహారాజ రాజశ్రీ దివాలా తీయబోయే బ్యాంకు దివ్యసముఖమునకు-విలాసానగర్ వాసి దిలాసారావు రుణంకోసం పెట్టుకున్న దరఖాస్తు.
పేరు :
దిలాసారావు.
అడ్రెస్ :
విలాసానగర్, హై స్పిరిట్ హిల్స్.
వయసు :
అరవై. కానీ ఇరవైలా కనపడతాను.
హెల్త్ ప్రొఫైల్ :
లేని రోగం లేదు.
చదువు :
టెన్త్ టెన్ టైమ్స్.
వృత్తి :
వ్యాపార రాజకీయం.
ప్రవృత్తి :
రాజకీయ వ్యాపారం.
కంపెనీ :
ఓడలు ముంచే ఇన్ఫ్రా.
అనుభవం :
పది రాష్ట్రాల్లో ఇంకెప్పటికీ పూర్తికాని ప్రాజెక్టులు.
పార్టీ సభ్యత్వం:
రోజూ రాత్రి పార్టీలు. ఇప్పటికి అయిదు పార్టీలు- ఏది రూలింగులో ఉంటే ఆ పార్టీ.
అర్హత :
పెద్దవారితో ఫోటోలు, వీడియోలు, వియ్యాలు. చిన్నవారితో కయ్యాలు.
గ్యారెంటీ :
భారతదేశంలో ప్రతినగరంలో ఇల్లూ వాకిలి, హంగు ఆర్భాటం ఉన్నా అవన్నీ భార్యా పిల్లలపేరుతో ఉండడంవల్ల- గ్యారెంటీ ఇవ్వడానికి ఏమీ లేదు.
పిల్లలు:
చదువు మానేసి రాత్రిళ్లు ఒంటిగంటప్పుడు కార్లో మెట్రో పిల్లర్లను కొట్టుకునే కొడుకు. కంపెనీ వ్యవహారాలను చూసుకునే మాయక కూతురు, అంతకుమించిన మాయక అల్లుడు.
ఉద్యోగులు :
ఆరునెలలుగా జీతాలివ్వకపోయినా మిగిలిఉన్న వెయ్యి మంది.
23 కోట్లు ఎందుకోసం?
కూతురు , అల్లుడు డొక్కు ప్యాసింజర్ విమానాల్లో తిరగలేకపోతున్నారు. సొంతంగా రెండు బోయింగ్ 747 విమానాలు కొనుక్కోవాలి. అలాగే అబ్బాయికి ఒక హెలిక్యాప్టెర్, నాకు లండన్లో ఒక హోటల్, మా ఆవిడకు స్విట్జర్ల్యాండ్ లో ఒక పెద్ద ఆల్ప్స్ పర్వతం కొనడానికి. సీ షెల్స్ లో వెధవది రెండు ద్వీపాలు మా రెండో ఆవిడకు నచ్చి చచ్చాయి. ఇంకొన్ని చెప్పుకోలేని చిల్లర ఖర్చులకు.
తిరిగి చెల్లించే పద్దతి:
ఈ ఎం ఐ లు కట్టడం అన్నది నా నిఘంటువులోనే లేదు.
వడ్డీ రేటు:
ఎంతయినా పరవాలేదు.
భవిష్యత్ ప్రాజెక్టులు:
23 వేలకోట్లు చేతికొచ్చాక లండన్ లో కూర్చుంటేకానీ క్లారిటీ రాదు.
మీరు విల్ ఫుల్ డిఫాల్టరా :
నేరం నాది కాదు. వ్యాపారానిది. నమ్మాను. పెట్టాను. పోయింది. కట్టాలనే అనుకుంటాను. కట్టలేకపోతున్నాను. అయినా వెంటపడి బ్యాంకులు నన్ను లోన్లు తీసుకోమని ప్రాధేయపడుతుంటే కాదనలేక తీసుకుంటున్నాను.
మీ జీవితాశయం:
భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం. దేశంలో పేదలను పూర్తిగా నిర్మూలించడం. నాకు గంజి తెలుసు- కానీ తాగను. నాకు బెంజీ తెలుసు- కానీ వాడకుండా ఉండలేను.
మీకు వచ్చిన అవార్డులు :
దేశంలో అత్యధిక లోన్లు తీసుకున్న వ్యక్తిగా వరుసగా ఇరవై ఏడో సారి అవార్డు.
మీ విదేశీ టూర్లు:
అన్ని అంతర్జాతీయ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీల్లో పాఠాలు చెప్పాను.
మీ హాబీలు :
పొద్దున పూజలు,
మధ్యాహ్నం డబ్బులు,
సాయంత్రం గోల్ఫ్ లు ,
రాత్రిళ్లు పబ్బులు.
మీ ఛారిటీ :
మా ఊళ్లో వందకోట్లతో గుడికడుతున్నాను. ఊరిజనం నాకే గుడి కడతామన్నారు. నేనే సున్నితంగా తిరస్కరించాను.
మీరు చేయలేకపోయిన పనులు:
ఏమీ లేవు. అన్నీ చేసేశాను.
మీ మీద పెండింగ్ కేసులు:
చట్టం తనపని తాను చేసుకుపోతుంది. మా లాయర్లు వారిపని వారు చేసుకుని పోతుంటారు.
మీ ఫిలాసఫీ:
డబ్బు బ్యాంకులకు కాస్తుంది.
బ్యాంకులు ఎగ్గొట్టేవారిని కాస్తాయి. ఎగ్గొట్టేవారిని లోకం కళ్లు కుళ్లుతో చూస్తాయి.
మీ నినాదం:
రుణానుబంధ రూపేణా పైసా గీసా రావాలయా!
మీరు రాస్తున్న పుస్తకం:
సారీ. నేను రాయట్లేదు. నేను జుట్టుకు రంగు మాత్రమే రాసుకుంటాను. నా మీద అభిమానంతో ఉద్యోగం పోయిన ఒక బ్యాంకు మేనేజర్ పుస్తకం రాశాడు.
పదేళ్లుగా అది బెస్ట్ సెల్లర్ బుక్.
టైటిల్ – “దిలాసారావు రుణవిలాసం”
మీకింత జ్ఞానం ఎలా వచ్చింది:
ఆ పాపం నాది కాదు- అది జన్యులోపం.
లోన్ ఎప్పటిలోపు కావాలి:
23 వేల కోట్లు ఒకే విడతలో వచ్చే వారం ఇదే సమయానికి కావాలి. సంతకాలకు నేను బ్యాంకులకు రాను. బ్యాంకులే మా గేటుదగ్గరికి రావాలి.
మీ ఫోన్ నంబర్ :
ఈజీగా గుర్తు పెట్టుకునే నంబరే.
ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ
మీ మెయిల్ ఐ డి :
[email protected]
———————
అనేక బ్యాంకు బోర్డుల కన్సార్షియం బొంబాయి అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న అరవయ్యో అంతస్తు గాజు మహల్లో అసాధారణ ప్రత్యేక అత్యవసర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, దిలాసారావు అభ్యర్థనను కళ్ళకద్దుకుని అంగీకరించిందని తెలియజేయజేస్తూ సంతోషించకుండా ఉండలేకపోతున్నాం.
————————
ఈ 23 వేల కోట్లకు బ్యాంకులు నువ్వులు నీళ్లు వదిలి, తూర్పు తిరిగి గోవిందా! గోవిందా! అని ఎప్పటిలాగే ఇంకో దిలాసారావు 46 వేల కోట్ల రుణమివ్వడానికి సంకల్పం చెప్పుకుని…ఆచమనం చేస్తున్నాయని విడిగా చెప్పాల్సిన పనిలేదు!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :