Saturday, November 23, 2024

రుణం- దారుణం

Farmers – Loans: చనిపోయినవారికే ఆత్మలు ఉంటాయనడం శాస్త్ర విరుద్ధం. అసలు ఆత్మకు చావే లేదని గీతలో శ్రీకృష్ణుడు బల్లగుద్ది మరీ చెప్పాడు. ఆత్మను కత్తి కోయలేదు. అగ్ని కాల్చలేదు. నీళ్లు తడపలేవు. గాలి ఎండబెట్టలేదు. ఆత్మ నిత్యం. ఆత్మ సత్యం. మనసులోపలి మనసును అంతరాత్మ అంటున్నాం. అంటే ఆత్మకంటే అంతరాత్మ ఇంకా గొప్పది అనుకుంటే చాలు. అంతకంటే లోతుగా వెళితే ఆత్మల అంతరాత్మల మనోభావాలు దెబ్బతింటాయి. మనస్సాక్షి కంటే అంతరాత్మ సాక్షి ఇంకా గొప్పది. అందుకే నీ అంతరాత్మను నువ్వే ప్రశ్నించుకో! అని ఇదివరకు అనేవారు. మొన్న మొన్నటిదాకా సినిమాల్లో అంతరాత్మ బయటికి వచ్చి సూటిగా ప్రశ్నించి మళ్లీ అదే శరీరంలోకి గౌరవంగా దూరిపోయేది. మనిషి శరీరంలో మనసు, ఆత్మ, అంతరాత్మ ఎక్కడ ఉంటాయన్నది శాస్త్రీయంగా చర్చించడానికి ఇది సందర్భం కాదు.

నీరవ్ మోడీ జగమెరిగిన పజ్రాల వ్యాపారి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని, ఆ అప్పు తిరిగి కట్టకుండా హాయిగా లండన్ కోర్టు వీధుల్లో వెచ్చగా చలి కాచుకున్న మనిషి. ఆ మనిషికి మనసు ఉండదా? ఆ మనిషికి ఒక ఆత్మ ఉండదా? ఆ ఆత్మ లోలోపల ఒక అంతరాత్మ ఉండదా? ఆ అంతరాత్మ రాసిన బహిరంగ లేఖ ఇది!

Loan

ప్రియమయిన విశ్వ మానవులారా!

వజ్రం వజ్రమే. వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నేను వజ్రాన్ని. వజ్రాలను నమ్మాను. వజ్రాలనే అమ్మాను. వజ్రం ఒకరిని వెతుక్కుంటూ వెళ్ళదు. వజ్రాన్ని వెతుక్కుంటూ లోకమే తిరగాలి. నేను వజ్రాన్ని మించి వెలిగే నిప్పును. అందుకే పది లక్షల విలువచేసే నిప్పుకోడి చర్మంతో చేసిన లెదర్ జాకెట్ వేసుకుని తిరుగుతుంటాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో నేను పద్నాలుగు వేల కోట్ల రుణం తీసుకోలేదు. వారే బలవంతపెట్టి ఇచ్చారు. తీసుకోవడం, ఇవ్వడం పూర్తిగా వేరు వేరు క్రియా పదాలు. పరస్పర వ్యతిరేక పదాలు. రుణం ఇచ్చినవారి నేరాన్ని రుజువు చేసేందుకు నేను అంతర్జాతీయ న్యాయస్థానాలను సంప్రదించాలని లండన్ వస్తే- పారిపోయినట్లు తప్పుగా అర్థం చేసుకుని భారత ప్రభుత్వం అనవసరంగా లండన్ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. చట్టాల మీద నాకు నమ్మకముంది. న్యాయస్థానాలంటే నాకు అపారమయిన గౌరవం. భారతీయ బ్యాంకులంటే నాకు ప్రాణం.

త్వరలోనే కడిగిన వజ్రంలా నేను బయటపడతాను. ఈ సందర్భంగా ప్రపంచంలోని బ్యాంకులకు నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను.

1 . పూచీకత్తు లేకుండా వేల కోట్ల రుణం ఇవ్వకూడదు.

2 . రుణం వెయ్యి కోట్లు దాటితే ఆ కంపెనీలో బ్యాంక్ ప్రతినిధి కూడా కూర్చుని రోజువారీ కార్యకలాపాలను సమీక్షించాలి.

3 . రాజకీయ నాయకులతో తరచుగా కనిపించే బడా సంపన్నులను బ్యాంకులు అనుమానదృష్టితోనే చూసి వ్యవహారాలు నడపాలి.

4 . వెయ్యి కోట్ల పైన రుణం తీసుకున్నవాడు ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతున్నాడంటే వాడు భవిష్యత్తులో రుణం ఎగ్గొట్టి లండన్ లో స్థిరపడతాడని అనుమానించాలి.

5 . సొంత డబ్బుతో వ్యాపారం చేసేవాడు చేతగానివాడు. బ్యాంకులను ముంచి నిలిచినవాడు తెలివయినవాడు- అని లోకంలో అభిప్రాయం స్థిరపడుతోంది. ఇది చాలా ప్రమాదం.

6. అమెరికాలో పాతికేళ్లపాటు బ్యాంకులను మోసం చేసినవాడిని చివరకు పట్టుకుని జైల్లో పెట్టారు. జైలు నుండి బయటికి వచ్చాక బ్యాంకు మోసాలను పసిగట్టి, బ్యాంకులకు సహాయం చేసే అంబుడ్స్ మెన్ సేవల కంపెనీ పెట్టి, అధికారికంగా వేల కోట్లు సంపాదించాడు. ఈ వాస్తవ గాథ ఆధారంగా ఇంగ్లీషులో “catch me if you can“ అని గొప్ప సినిమా కూడా వచ్చింది. అలా భవిష్యత్తులో అన్ని భారతీయ బ్యాంకులు నా సేవలను వినియోగించుకుని జాగ్రత్తపడాలి. బాగుపడాలి. నా మీద కూడా అన్ని భారతీయ భాషల్లో సినిమాలు తీయడానికి అన్ని బ్యాంకులు ఉదారంగా నిర్మాతలకు వడ్డీలేని, ఎగ్గొట్టడానికి వీలయిన రుణాలు ఇవ్వాలి.

ఇట్లు,
మీ వజ్రం

Loan
ఇంతకూ ఈ నీరవ్ మోడీ కథ ఇప్పుడు ఎందుకు అంటే…
కొన్ని కథలు కాలాతీతం. కొందరు వ్యక్తులు కూడా కాలాతీతం. మన సంగారెడ్డి జిల్లా సహకార బ్యాంకులో ఒక సగటు రైతు లక్ష అప్పు తీసుకున్నాడు. 40 వేలు తిరిగి చెల్లించాడు. మిగిలిన 60 వేలకు వడ్డీ తోడయి 70 వేల దాకా అప్పు మిగిలింది. ఉన్న మూడెకరాల్లో రెండేళ్లుగా మిగిలింది శూన్యం. బ్యాంకు వాళ్లేమో ఫలానా రైతు అప్పు ఉన్నాడహో అని పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక ఊళ్ళో అప్పు పుట్టదు. పైగా అవమానం. పండని పొలాన్ని గాలికి వదిలేసి…కుటుంబంతో పొరుగూరు ఫ్యాక్టరీలో కూలీగా పని చేయడానికి వెళ్లిపోయాడు.

బ్యాంక్ నిబంధనలు ఎలా ఉన్నాయో కానీ…
ఇది పొమ్మని పొగ పెట్టడం.
గుండెల్లోకి గుచ్చడం.
ఆత్మాభిమానాన్ని పరిహసించడం.
ప్రకృతిని ఎదిరించి నిలిచే రైతును రద్దు చేయడం.
ఆశను సమాధి చేయడం.
బతుకును బొగ్గు చేయడం.
మానవత్వాన్ని మంటగలపడం.

ఒకడు వేల కోట్ల అప్పు ఎగ్గొట్టి న్యాయాన్యాయాల సమీక్ష చేస్తాడు.
ఒకడు అరవై వేల అప్పుకు అనామకుడవుతాడు.

చూస్తున్నావా…దేశమా!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

23 వేల కోట్లు అప్పు! 20 నిముషాల్లో శాంక్షన్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్