Sunday, January 19, 2025

90 ఎమ్మెల్ బాధ

Discrimination:  ఇది చూడడానికి చిన్న వార్తే కావచ్చు. కానీ…విషయం చాలా తీవ్రమయినది. పురోగామి సమాజంలో తిరోగామి చర్యలను ముక్త కంఠంతో ఖండించడానికి ఉద్యుక్తులం కావాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించే వార్త. రాకెట్లు వేసుకుని అంతరిక్షంలో పర్యాటకులుగా తిరిగి వస్తున్న ఆధునిక నవనవోన్మేష కాలంలో…ఒకానొక మందుబాబు మందు షాపుకు వెళ్లి…డబ్బులిచ్చి 90 ఎమ్మెల్ పోయమంటే పోయనంటాడా? పైగా కులం పేరుతో మందును నిరాకరిస్తాడా? వేర్ వుయ్ ఆర్ గోయింగ్? వాట్ వుయ్ ఆర్ డూయింగ్? ఈజ్ ఇట్ నాట్ ఎ క్రిమినల్ అఫెన్స్ టు బి పనిష్డ్ ఇమిడియెట్లీ?

తెలంగాణ జగిత్యాల జిల్లాలో ఒక మందుబాబు మనోభావాలు దెబ్బ తిన్నాయి. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం- రెండు వాదనలు.
1. 90 ఎమ్మెల్ మందు పోయమంటే షాపతను పోయలేదు.
2. కులం పేరుతో దూషిస్తూ మందు పోయలేదు.
90 ఎమ్మెల్ పోయమంటే పోయకపోవడం తప్పే. కులం పేరుతో మందు పోయకపోయి ఉంటే…ఇంకా పెద్ద తప్పు. రెండూ కలిసి ఉంటే ఇక ఈ మహాపరాధం గురించి చెప్పడానికి భారత శిక్షా స్మృతి భాష చాలదు.

దాంతో అతను బాధ్యతగల భారతీయుడిగా దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్ కు వెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేశాడు. విచారించి పోలీసులు షాపతడికి శిక్ష పడేలా చూస్తారని నమ్ముతున్నాడు. ఎంత తాగుడు అలవాటయినా…చాలా మంది మందు బాబుల్లా అతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకపోవడం సభ్య సమాజానికి చాలా ముద్దొస్తోంది.

డబ్బు తీసుకుని 90 ఎమ్మెల్ పొయ్యి అంటే…కులం పేరుతో దూషించడం ఎంత తలదించుకోవాల్సిన విషయం? ఒక్కో రాష్ట్రంలో 15 , 20, 30 వేల కోట్ల రూపాయల మద్యం ఏటా అమ్ముడుపోతుండబట్టి… ఎన్నో ప్రభుత్వ బడులు నడుస్తున్నాయి. ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం మీద ఆధారపడ్డ కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఇలా షాపుల వారి దురహంకారం, సామాజిక అంటరానితనాలతో, వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో మందు బాబుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిని వారు శాశ్వతంగా ముందుకు దూరమయితే.. ముందు ముందు సమాజం రెండు కాళ్ల మీద నడవగలదా?

మందుబాబులు తాగే ప్రతి చుక్కలో సమాజగతి సూత్రాల లెక్కలు ఎన్నెన్ని దాగి ఉంటాయి?
వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి లోకం ప్రాణాలను కాపాడుతున్నా…వారికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వకపోతే ఎలా?

లోకాన్ని మేల్కొల్పడానికి వారు నిద్రపోతుంటే…ఆ నిద్రకు మనం ద్రవ ముద్రలు వేయకుంటే…మనలో నిజంగా మానవత్వం ఉన్నట్లా? లేనట్లా?
మందుబాబులకు ఇలాంటి అవమానకర, అమానవీయ సంఘటనలు జరగకుండా… సామూహికంగా ఒక సమాజంగా మనకు మనం అందరం సంకల్పం చెప్పుకోవాల్సిన అవసరం లేదా?

ఒకసారి పెద్ద మనసుతో ఆలోచించండి!

కొస చుక్క:-
ఇంతా చేస్తే మందును నిరాకరించింది మెయిన్ షాపు కాదు. ఊళ్లో బెల్ట్ షాపు. అంటే అన్నారంటారు కానీ…ఆఫ్టరాల్ బెల్ట్ షాపుకు కూడా మందు బాబులు లోకువైపోయారా? ప్రజాస్వామ్య దేశంలో!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్