Self Declaration: ఒకానొక పార్లమెంటు సభ్యుడు నియోజక వర్గ అభివృద్ధి నిధులతో తన సొంత ఇల్లు కట్టుకున్నట్లు, కొడుకు పెళ్లి కూడా చేసినట్లు ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈయన నిజాయితీకి, పారదర్శతకు, నిర్మల హృదయానికి, ఒప్పుకోలుకు…అభినందనగా ఈ విభక్తుల పూల మాల!
సకల వ్యాకరణ సూత్రాలు, భాషా నియమాలు, భాషోత్పత్తి సిద్ధాంతాలు, భాషా పరిణామక్రమాలు క్రమంగా ప్రజాస్వామ్యంలో లయిస్తాయి. అంతటి ప్రజాస్వామ్యమే సభక్తికంగా గెలిచిన ప్రతినిధి ముందు చేతులు జోడించి నిలుచున్నప్పుడు…స్వయంప్రతిపత్తి లేని ఆఫ్టరాల్ విభక్తులు గెలిచిచిన ప్రతినిధి కోసం వలన గూర్చి గురించి వెట్టి చాకిరి చేయడంలో ఎలాంటి ఔచిత్య భంగం జరగదు. జరగలేదు. జరగబోదు!
అదెలాగో ఉదాహారణలతో అన్వయించుకుందాం!
డు, ము, వు, లు-ప్రథమా విభక్తి
ఉదాహరణలు:-
రాజకీయ నాయకు”డు”
రాజకీయ”ము”
మధు”వు”
రాజకీయ నాయకు”లు”
నిన్, నున్, లన్, గూర్చి, గురించి- ద్వితీయా విభక్తి
ఉదాహరణలు:-
నాయకు”నిన్”
నాయకు”లన్”
నాయకుల “గూర్చి”
నాయకుల “గురించి”
చేతన్, చేన్, తోడన్, తోన్-తృతీయా విభక్తి
ఉదాహరణలు:-
నాయకుడి “చేతన్”
నాయకుడి “చేన్”
నాయకుడి “తోడన్”
నాయకుడి “తోన్”
కొఱకున్ (కొరకు), కై-చతుర్థీ విభక్తి
ఉదాహరణలు:-
నాయకుడి “కొరకు”
నాయకుడి “కై”
వలనన్, కంటెన్, పట్టి- పంచమీ విభక్తి
ఉదాహరణలు:-
నాయకుడి “వలనన్”
నాయకుడి “కంటెన్”
నాయకుడు “పట్టి”
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్-షష్ఠీ విభక్తి
ఉదాహరణలు:-
నాయకుడి”కిన్”
నాయకుల”కున్”
నాయకుల “యొక్క”
నాయకుల”లోన్”
నాయకుల “లోపలన్”
అందున్, నన్-సప్తమీ విభక్తి
ఉదాహరణలు:-
నాయకు”లందున్”
నాయకుల”నన్”
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ- సంబోధనా ప్రథమా విభక్తి
ఉదాహరణలు:-
నాయకుల పిలుపులు…
ఓ
ఓరీ
ఓయీ
ఓసీ
—————-
ఒకప్పుడు లోక కల్యాణమే నాయకుల కల్యాణం.
ఇప్పుడు నాయకుల కల్యాణమే లోక కల్యాణం!
“ప్రజాస్వామ్య విభక్తులు” అన్న మాటకు సమాస కోణంలో చూస్తే యద్భావం తద్భవతిగా ఎవరి అర్థం వారికి వచ్చినట్లే…
సంధిని విడదీస్తే…
“ప్రజా అస్వామ్య విభక్తులు” అని ప్రజలంటే లెక్కలేని, ప్రజలను స్వామిగా గుర్తించని విభక్తులు అన్న అర్థాలను కూడా సాధించవచ్చు. సాధించాలి కూడా!
ఎన్నికల వేళ మాత్రమే విభక్తులు ప్రజలకు/ఓటర్లకు అనుకూలంగా ఉన్నట్లు భ్రమ కల్పిస్తాయి. ఓట్లు వేయగానే విభక్తులన్నీ కట్టగట్టుకుని గెలిచినవారి కాళ్ళెక్కడున్నాయో వెతుక్కుంటూ వెళతాయి. వెన్నెముకలేని విభక్తులు.
అవి మాత్రం అంతకుమించి ఏమి చేయగలవు? పాపం!
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]