Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసినిమా మెరుపు బంగారం కానే కాదు

సినిమా మెరుపు బంగారం కానే కాదు

ఎన్నికల ప్రచారానికి సంబంధించి నేను తయారు చేసిన కొన్ని ఆడియో, వీడియో ప్రకటనలను ఒక మండే ఎన్నికల మిట్ట మధ్యాహ్నం వేళ ఒక సినిమా హీరోకు చూపాల్సి వచ్చింది. ల్యాప్ టాప్ లో ఆ ఫైళ్లను ఒకటికి రెండు సార్లు ప్లే చేసి చూసుకుని…ఆయన సిబ్బంది అధికారికంగా నాకు చెప్పిన మధ్యాహ్నం రెండు గంటల వేళకు వెళ్లాను. రెండు మూడు అంచెల్లో ఆపే గేట్లు ఉంటాయన్న ఎరుక ఉంది కాబట్టి…కారు నంబర్, ఆధార్ నంబరు, చొక్కా రంగులు, పుట్టు మచ్చలు…ఇలా వారడిగినవన్నీ ముందే ఇచ్చాను.

తీరా అక్కడికి వెళితే…మొదటి గేట్లోనే ఆపి…అనుమతి కోసం ఆగాలన్నారు. సార్ పెద్దవారితో భోంచేస్తూ…మీటింగ్ చేస్తున్నారు…పేరు చెబితే…అడిగి అనుమతి తీసుకుంటామన్నారు. చెప్పాను. ముందు రోజు నా పుట్టు మచ్చల వివరాలు నమోదు చేసుకున్న ఆయన సిబ్బంది కూడా మీటింగ్ చేస్తుండడంతో…ఎన్నిసార్లు ఫోన్ చేసినా పలకలేదు. సరిగ్గా గంటసేపు నిరీక్షించి…మొదటి గేటు సెక్యూరిటీ వాడికి విజిటింగ్ కార్డ్ ఇచ్చి…నన్ను రమ్మన్నారు. వచ్చాను. గంటసేపు గేటు దగ్గర ఉన్నాను. ఎవరూ పిలవలేదు. వెళుతున్నాను…అని అవమాన భారంతో వెనక్కు వచ్చేశాను.

మీటింగ్ చేయడం పూర్తి చేసుకుని సాయంత్రం అయిదు గంటలకు ఆయన సిబ్బంది ఫోన్ చేశారు. అర్జెంట్ గా రావాలని. చెయ్ ఖాళీ లేదు…నేను కూడా మీటింగ్ చేస్తున్నాను. అయ్యాక వస్తానన్నాను. అయిదు నిముషాలకొకసారి ఫోన్ చేస్తూనే ఉన్నారు. నెమ్మదిగా చేతులూపుకుంటూ ఏడింటికి వెళ్లా. ఇప్పుడు అన్ని గేట్లు తెరుచుకున్నాయి.

నన్ను చూడగానే హీరోగారి కోపం కట్టలు తెంచుకుంది. ఎన్ని పనులుంటాయి నాకు? ఎప్పుడు రమ్మంటే ఎప్పుడొచ్చావు? అని నిలదీశాడు. జరిగిందంతా చెప్పి…నేను అవమానంగా ఫీల్ అయి వెళ్లిపోయాను…తప్పు నాదో…మీ సిబ్బందిదో…మీదో…మీరే తేల్చుకోండి…అన్నాను. మొహం ఎర్రబారింది. అంతదాకా కూర్చోమని కూడా చెప్పని హీరోగారు ఆ రూములో నుండి బయటికి వచ్చి కార్లు పార్క్ చేసే ఏరియాలో ఒక కారు మీద ల్యాప్ టాప్ పెట్టి చూపించాలని సైగ చేశారు.

పెన్ డ్రైవ్ ఇచ్చి వెళతాను…చూసి కరెక్షన్స్ చెప్పండి…అని చెబుతూ ఇంటికి పిలిచి ఇలా అవమానించడం మర్యాద కాదని వారి సిబ్బంది ముందు మర్యాదగా చెప్పాను. మరుసటి రోజు పార్టీ కార్యాలయంలో అయితేనే వస్తానని షరతు పెట్టాను. అలాగే ఎన్నికల కమిషన్ కు అత్యవసరంగా అప్లై చేయాల్సిన ఆ యాడ్స్ ఆ హీరోకు పార్టీ ఆఫీస్ లోనే చూపించాను.

మరుసటి రోజు పొద్దున్నే పార్టీ కార్యాలయంలో ఆ హీరో కుర్చీ లోంచి లేచి వచ్చి, నన్ను కుర్చీలో సాదరంగా కూర్చోమని చెప్పి…ఎంతో మర్యాద ఇచ్చారు. నిన్నటి నా ప్రవర్తనకు అపరాధభావంతో నాలో నేనే కుమిలిపోయాను. నిన్నటి సంగతి ప్రస్తావనే లేకుండా…పాతికేళ్లుగా ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినట్లు ఆయన ప్రవర్తన నాకు ఎన్నెన్నో పాఠాలు నేర్పింది.

సిగ్గు – ఎగ్గూ, మానావమానాలు ఎక్కడికక్కడే వదిలేయాలి. ఎక్కడ నెగ్గాలో కాదు…ఎప్పుడు తగ్గాలో బాగా తెలుసుకుని మసలుకోవాలి.

కావ్యేషు నాటకం రమ్యం- అన్నది ప్రమాణం. సకల కావ్యాల్లోకి నాటకమే గొప్పది. అలాంటి నాటక శాస్త్ర గ్రంథాలు దశ రూపకం లాంటివి చదివిన నాకు ఈ నటన ముందు ఆ శాస్త్రాలన్నీ ఎందుకూ కొరగానివని అర్థమయ్యింది.

సంస్కారం పోతపోసిన అంతటి నటుడితో పరుషంగా మాట్లాడానే అనే బాధ ఇన్నేళ్లయినా వెంటాడుతూనే ఉంది. ఏమీ జరగనట్లు వెంటనే అంతటి ఆప్యాయత కురిపించి, మహోన్నత సంస్కారంతో నన్ను పునీతం చేసిన ఆయనది నటన అయినా నమస్కరించాల్సిందే. నిజమయినా నమస్కరించాల్సిందే.

అవమానమే కొలమానమయితే పనిచేసిన నాలుగు నెలల జీతం చివర ఎగ్గొట్టిన యజమాని…దిక్కున్నచోట చెప్పుకో పో! అన్నప్పుడు జరిగింది ఇంతకంటే పెద్ద అవమానం. రోజుకొక డెస్కులో కూర్చో బెట్టిన సందర్భంలో జరిగింది ఇంత కంటే పెద్ద అవమానం. చెప్పుకుంటే గుండె తరుక్కుపోయే ఇంకా ఎన్నో అవమానాల ముందు ఇదసలు అవమానం కాదుగాక కాదు.

ఇంకెప్పుడూ ఆ హీరోను కలిసే అవకాశం నాకు కలగలేదు. కలగకూడదు కూడా. ఒకవేళ కలిగితే ఆయన సంస్కారవంతమయిన హృదయగత ఆత్మీయత నాకు మరికొన్ని కొత్త పాఠాలు నేర్పుతుందేమో! ఏమో?
నాకిలా జరిగింది. లోకానికి కూడా ఇలాగే జరిగి ఉంటుందని నేను అనుకోవడం లేదు.

ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం.

లవ్ స్టోరీ సినిమా వేడుకలో చిరంజీవి సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అభ్యర్థనలు చేశారు. ఆశగా కాదు…అవసరంగా అడుగుతున్నామని దీనంగా విన్నవించుకున్నారు. మెరిసేదంతా సినిమా బంగారం కాదన్నారు.

నిజమే. మెరుపు లేనిది మెరిసినట్లు కనిపింపజేసేదే సినిమా. ఆ మెరుపుల్లో నిజం మెరుపులు కూడా నకిలీ మెరుపుల విలువనే పులుముకోవాల్సి ఉంటుంది.

అక్కడ జగన్, ఇక్కడ కె సి ఆర్ ఉంటేగానీ…సినిమా ఇండస్ట్రీకి మెరిసేదంతా బంగారం కాదని క్లారిటీ రాలేదు.

అక్షరాలా జగన్, కె సి ఆర్ లు చెప్పదలుచుకున్నది, చెప్పినది, చెప్తున్నది అదే:-
సినిమా మెరుపు బంగారం కానే కాదు.

బంగారం మెరుపు సామెత చిరంజీవి చెబితే…
అందితే జుట్టు- అందకపోతే కాళ్ళు
సామెత లోకం చెబుతుంది.
ప్రతి సామెత వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది.

“చర్యకు ప్రతి చర్య సమానంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయును.”
అని ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త న్యూటన్ గమన సూత్రాల్లో మూడో సూత్రం ఎప్పుడో చెప్పింది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: ఇమేజ్ చట్రంలో

Also Read: నష్టాలకు ప్రేక్షకులే ఇవ్వాలి పరిహారం!

RELATED ARTICLES

Most Popular

న్యూస్