Saturday, January 18, 2025

గోశాస్త్రం

Allahabad High Court On Cow Slaughter :

ఆయనదేం తప్పులేదు.
కొన్నాళ్లుగా దేశంలో నడుస్తున్న సైన్స్ ఇదే.
ఎక్కడో స్వాములు, సన్యాసులు చెప్పే వేదాంతం సంగతి సరే..
నేతలు, అధినేతలూ చెప్తున్నది కూడా ఈ సైన్సే.
ఏకంగా సైన్స్ కాంగ్రెస్ లే ఇప్పుడు ఈ తరహా సైన్స్ కి వేదికలవుతున్నాయి.
సైంటిస్టులు, పరిశోధకులు అని చెప్పుకుంటున్నవాళ్ళు కూడా
ఇప్పుడు దీన్నే సైన్స్ అంటున్నారు.
అదే ఆయనా అన్నాడు.
తప్పేముంది?

ఇంతకీ ఆయన ఎవరు?
ఆయనేమన్నాడు?
దానికి  ఇంత వివరణ ఎందుకు?
ఆయనో జడ్జి.
అలహాబాద్  హైకోర్టు లో గౌరవ న్యాయమూర్తి.
గోహత్య  నేరం మీద తీర్పు చెప్పారు.
తీర్పు చెప్పడాన్ని తప్పు పట్టలేం.
పట్టకూడదు కూడా. కోర్టు ధిక్కారమవుతుంది.
తీర్పుని తప్పు పట్టొచ్చు. చట్టప్రకారం వుందో లేదో
చర్చించొచ్చు.
కానీ ఆ చర్చలోకి కూడా ఇప్పుడు పోవద్దు.
ఈ తీర్పు ప్రకటిస్తూ..  ఆయన కొన్ని వ్యాఖ్యలు  చేసారు.

  • ఆవులు(మీకు భక్తి వుంటే గోవులు అని చదువుకోండి)
    ఆక్సిజన్ వదిలి , ఆక్సిజన్ పీల్చుకుంటాయి.
  • ఆవు మూత్రం,పాలు, పెరుగు, నెయ్యి, పేడ కలిపిన
    మిశ్రమం(పంచగవ్య) అనేక దీర్ఘరోగాలని నయం చేస్తుంది.
  • యజ్ఞయాగాలలో నెయ్యివేయడం వల్ల సూర్యకిరణాలకు
    దివ్యశక్తి వస్తుంది. ఆ శక్తి వల్లే వర్షాలు పడతాయి.

ఇవీ ఆయన చెప్పిన కొన్ని ఆణిముత్యాలు,సైంటిఫిక్  రత్నాలు.
ఇంత సైన్స్ ఆయనకి ఎక్కడి నుంచి  వచ్చింది?
ఎవరు చెప్పారు?
ఏ సిద్ధాంత పత్రాల నుంచి,
ఏ శాస్త్రీయ పరిశోధనల నుంచి,
ఏ ప్రయోగాల సారం నుంచి ఆయన గ్రహించారు?

అన్నీ వేదాల్లోయే వున్నాయిష.
కన్యాశుల్కంలోని ఈ పాపులర్ డైలాగ్.
ఇప్పుడు ఇది చాలా సీరియస్ వ్యవహారం.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఆవుల శ్వాసక్రియ గురించి
అల్లాటప్పాగా మాట్లాడలేదు.
ఆధారాలు లేకుండా కామెంట్ చేయలేదు.
2017 జనవరి పేపర్లు తిరగేయండి.
స్వయంగా రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి చేసిన ప్రకటన ఒకసారి చూడండి.
ఆయనే తొలిసారి ఈ దివ్యజ్ఞానాన్ని ప్రసాదించాడు.
ఓ గోశాలకి వెళ్తూ, గోవుల ప్రాశస్త్యాన్ని వివరించాడు.
సృష్టిలో ఆవులు మాత్రమే ఆక్సిజన్ పీల్చి, ఆక్సిజన్
వదుల్తాయి..కాబట్టీ పర్యావరణానికి ఆవులు చాలా అవసరం..
ఇదీ ఆరోజు ఆయన ప్రవచనం.
ఒక విద్యాశాఖ మంత్రి ఇంత విద్య ప్రసాదించిన తర్వాత అది
విశ్వవ్యాప్తం కాకుండా ఎలా వుంటుంది.
అలాగే ఆనోటా.. ఈనోటా..ఈ న్యాయమూర్తి చెవిలో కూడా పడుంటుంది.
పడడం పడడమే నాటుకుని పోయివుంటుంది.
సరే..”ఆవులు ఆక్సిజన్ వదలవు…ఆవుల నిశ్వాస లో
ప్రమాదకరమైన మీథేన్ ఎక్కువ వుంటుంది” అని సైంటిస్టులు
తేల్చారనుకోండి. అది పెద్దగా ప్రచారం పొందలేదు . పొందినా
మన విశ్వాసాలకు అనుగుణంగా లేదు.
ఇదొక్కటేనా.
ఏడేళ్ళుగా మన దేశంలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ లలో
ఇంతకు మించిన అద్భుతాలు ఆవిష్కారమవుతున్నాయి.
2014సైన్స్ కాంగ్రెస్:

  • వినాయకుడికి ఏనుగు తల అతికించారంటే,
    ప్లాస్టిక్  సర్జరీ అప్పట్లోనే వున్నట్టే…
  • కర్ణుడు తల్లి కడుపున పుట్టలేదు కాబట్టీ మనకి అప్పటికే
    జెనెటిక్స్ తెలుసు..

మన యోగులకి దివ్యదృష్టి వుంది కదా..
అదే ఆతర్వాత టెలివిజన్ గా మారింది.
ఆనాటి సైన్స్ కాంగ్రెస్ లో ప్రధాని మోడీ పంచిన వేదశాస్త్రీయ సారమిది.
ప్రధానే ఇన్ని చెప్పాక.. ముఖ్యమంత్రులు ఊరుకుంటారా..?
సమస్యే లేదని త్రిపుర ముఖ్యమంత్రి ముందడుగేసారు.

  • భారతయుద్ధాన్ని సంజయుడు క్షణక్షణం ఎలా తెలుసుకోగలిగాడు?
  • అంటే, అప్పటికే మన దేశంలో ఇంటర్నెట్ అందుబాటులో
    వుందని విప్లవదేవుడు తేల్చేసాడు.

అసలు అణుపరీక్షలు ఇప్పుడు జరపడం ఏంటి.
లక్షల ఏళ్ళ క్రితం కనడ యోగి ఎప్పుడో జరిపాడని
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రమేష్ పోఖరియల్ అన్నాడు.
అవునేమో అని విన్నవాళ్ళంతా అనుకున్నారు.

అంతేనా..
అప్పుడెప్పుడో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడిన సంజీవని మొక్క ఆనవాలు కనిపెట్టమని పాతిక కోట్లు
కేటాయంచింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.

మన ప్రభుత్వాల శాస్త్రదాహానికి ఇదొక మచ్చుతునక.
ప్రధాని, ముఖ్యమంత్రులే కాదు,

కేంద్ర మంత్రులు కూడా తక్కువ తిన్లేదు.
అప్పటి వ్యవసాయమంత్రి రాధామోహన్ సింగ్ వేదాల్లో
వ్యవసయాన్ని పరిశోధించాడు.
ఏకంగా యోగిక్ ఫార్మింగ్ అని కొత్త(ప్రాచీన) వ్యవసాయపద్ధతిని ఆవిష్కరించాడు.
పరమాత్మశక్తితో విత్తనాల పటుత్వాన్ని పెంచొచ్చని ప్రతిపాదించాడువ్యవసాయ మంత్రే ఇంత సైన్స్ ని అవపోశన పడితే, సైన్స్
మంత్రేమైనా తక్కువ తిన్నాడా..
అందుకే హర్షవర్దన్ మరో అడుగు ముందుకేసాడు.
ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతానికి బాబు లాంటి సిద్ధాంతం
వేదాల్లో వుందంట.
ఈ విషయం ఆయనకి ఎవరు చెప్పారని డౌటా.
స్టీఫెన్ హాకింగ్స్ చెప్పాడట.
ఎప్పుడు, ఎక్కడా అని అడక్కండి.
ఆయనకి తెలియదు.
వీళ్ళంతా ఒకెత్తయితే, సాధ్వి ప్రగ్యా ఠాకూర్ మరొక ఎత్తుకి ఎదిగింది.
గోమూత్రం వల్లనే తన కేన్సర్ తగ్గిందని చెప్పుకుంది.
అంటే, గోమూత్రగుణగణాలకి తానే నిలువెత్తు సాక్ష్యమని ప్రకటించుకుంది.
ఇది భరించలేని డాక్టర్లు.. ఆమె కేన్సర్ ఏ మాత్రం తగ్గలేదని తర్వాత చెప్పారు.

ఇవన్నీ చెప్తే మీకు నేరమంతా నేతల మీద మోపినట్టుఅనిపిస్తుంది.
ఈ రేసులో సైంటిస్టులు వెనకబడిపోయారేమో అనిపిస్తుంది.
అలా ఏం లేదు.

2017 సైన్స్ కాంగ్రెస్ :
-భారతదేశంలో విమానాలు ఏడువేల సంవత్సరాల క్రితమేవున్నాయని  కెప్టెన్ ఆనంద్ బోడాస్ ప్రకటించాడు.
గ్రహాంతర విమానాలు కూడా భారత్ లో వుండేవట.

2019 సైన్స్ కాంగ్రెస్ :
-అసలు డైనోసర్లను సృష్టించింది బ్రహ్మే అని  అశుఖోస్లా అనే జియాలజిస్టు సృష్టి రహస్యాన్ని సిద్ధాంత పత్రంగా ప్రకటించాడు..

వందమంది కౌరువులు కుండల్లో పుట్టడం ఎలా సాధ్యం?
అంటే అప్పటికే మనకి స్టెమ్ సెల్ సైన్స్ గురించి తెలుసు అని మరో ఆవిష్కరణ.
ఈ సైన్స్ కాంగ్రెస్ ల వెలుపల కూడా ఎందరో సైంటిస్టులు..
అందరికీ వందనాలు.

గోమూత్రంలో గోల్డ్ వుందని  జునాగఢ్ వ్యవసాయ  విశ్వవిద్యాలయం సైంటిస్టులు ప్రతిపాదించారు.
(ఆ తర్వాత దీని మీద దుమారం రేగింది. సహించలేని సైంటిస్టులు ఈ పరిశోధన చెత్త అని విరుచుకుపడితే, మేం పరీక్షించిన గోమూత్రం కలుషితమైవుండొచ్చని ఈ సిద్ధాంతకర్తలు ఒప్పుకోవల్సి వచ్చింది.)
నాటి విష్ణుచక్రమే ఈనాటి గైడెడ్ మిసైల్స్ అని తేల్చిపారేసారు..
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జి.నాగేశ్వరరావు.
రావణుడికి 24 యుద్ధవిమానాలుండేవట.
ఏడు విమనాశ్రాయాలు కూడా రావణలంకలో వున్నాయని నాగేశ్వరరావు కనిపెట్టారు.

మనం ఈ గోవేదశాస్త్ర పరిశోధనని న్యాయమూర్తితో మొదలుపెట్టా
కనుక, మరో న్యాయమూర్తితోనే ముగించడం న్యాయం.
రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి మహేష్ చంద్ర శర్మని ఈ సందర్భంగా తలచుకోవాల్సిందే..
ఆయన కూడా గోభక్తుడే.
గోవులని జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేసిన వాడే.
అయితే, అల్లాటప్పాగా డిమాండ్ చేయలేదు.
దానికో శాస్త్రీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
ఇప్పుడు జాతీయ పక్షి నెమలి వుంది కదా..
అది ఆజన్మ బ్రహ్మచారి అట.
ఆడనెమలి, మగనెమలితో ఎప్పుడూ కలవదట.
తన కన్నీళ్ళని మింగి కడుపుతెచ్చుకుంటుందట.
అందుకే నెమలి ఈకని మరో అస్ఖలిత బ్రహ్మచారి కృష్ణుడు తన తలలో ధరించాడట.
నెమలి  లాగే గోవు కూడా పవిత్రమైనది కాబట్టీ, దాన్ని జాతీయ జంతువుగా ప్రకటించాలట.
ఇదీ.. ఏడేళ్ళుగా ఏలిన వారి దయవల్ల మనకి కలిగిన శాస్త్రీయ అవగాహన.
ఇది ఇంకెంత పెరుగుతుందో..
ముందుముందు ఇంకెన్ని జ్ఞాననేత్రాలు తెరుచుకుంటాయో..

-శైలి

Also Read : సంప్రదాయ భోజనం నిలిపేస్తాం: వైవి సుబ్బారెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్