Srivahi Vahana Sevas: తిరుమల ఉత్సవాల్లో రకరకాల వాహనాల మీద స్వామివారు ఊరేగడాన్ని మనం చూడగలుగుతాం. ఆయా వాహనాల ప్రత్యేకతలు తెలిస్తే మరింత భక్తితో నమస్కారం పెట్టుకుంటాం. అన్నమయ్య మనలా ఎందుకు చూస్తాడు? ఒక ఉత్సవంలో వెంకన్న అందమయిన అవస్థను, అంతకంటే అందమయిన తడబాటును దర్శించి…కీర్తనలో బంధించాడు అన్నమయ్య.
పల్లవి:-
అదె వాడె యిదె వీడె అందు నిందు నేగీని
వెదకి వెదకి తిరువీధులందు దేవుడు
చరణం-1
అల సూర్యవీధి నేగీ నాదిత్యుని తేరిమీద
కలికికమలానందకరుడుగాన
తలపోసి అదియును దవ్వు చుట్టరికమని
యిల దేరిమీద నేగీ నిందిరావిభుడు
చరణం-2
చక్క సోమవీధి నేగీ జందురుని తేరిమీద
యెక్కువైన కువలయహితుడుగాన
చుక్కలుమోచిన దవ్వుచుట్టరిక మిదియని
యిక్కువతో వీధి నేగీ నెన్నికైనదేవుడు
చరణం-3
యింతుల మనోవీధి నేగీ మరుతేరిమీద
నంతటా రతిప్రియు డటుగాన
రంతుల నదియు గానరాని చుట్టరికమని
వింతరీతి నేగీ శ్రీవేంకటాద్రిదేవుడు
అదిగో వాడే…ఇదిగిదిగో వీడే! వెంకన్న ఆలయం బయట మాడ వీధుల్లో తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా ఏవేవో విధులన్నీ వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. ఒకసారి అటు వెళతాడు. ఒకసారి ఇటు వస్తాడు. కమలాలు విచ్చుకునేలా చేసే కమలానందకరుడిగా సూర్యప్రభ వాహనం ఎక్కాడు. తీరా తేరు ఎక్కిన తరువాత…ఎక్కడో సూర్యుడికి- కమలానికి ఉన్న దూరపు చుట్టరికం దేనికని అనుకుంటూ అంతలోనే నేలమీద నడిచే మామూలు రథమెక్కాడు.
వెనువెంటనే చంద్రప్రభ వాహనం కనిపిస్తే…దానిమీద ఎక్కి కూర్చున్నాడు కువలయహితుడిని (కలువలను వికసింపచేసే చంద్రుడు) కదా అనుకుంటూ. కూర్చున్నాడో లేదో…ఎక్కడో చుక్కల ఆవల చంద్రుడితో చుట్టరికం కూడా చాలా దూరానిదే కదా! అని వెంటనే దిగి…మళ్లీ వీధులు వీధులు వెతుక్కుంటూ…దేనికోసమో తిరుగున్నాడు.
ఈలోపు మన్మథ పూలరథం కనిపిస్తే దానిమీద ఎక్కాడు. అలా కూర్చున్నాడో లేదో...మన్మధుడితో కానీ…అతడివల్ల ఏర్పడే ప్రేమబంధాలతో నాకేమి చుట్టరికం? అనుకుంటూ…దిగి మళ్లీ వీధుల్లోపడి తిరుగుతున్నాడు.
మొదటిది సూర్యవీధి; రెండోది చంద్రవీధి అని నామకరణం చేశాడు అన్నమయ్య. విష్ణువు రెండు కళ్లు సూర్య చంద్రులు అంటుంది విష్ణుసహస్రనామం. దానికి ఈ వీధులు, ఆ రథాలు ప్రతీకలు. అంతదూరపు చుట్టరికం అనుకుంటూ దగ్గర బంధుత్వం కలిపాడు. చివర కానరాని చుట్టరికాలు అంటూ…దేవుడితో కనపడని చుట్టరికాన్ని పెట్టుకోవాలని చెప్పకుండానే చెబుతున్నాడు.
ఈ కీర్తనలో రథాల మధ్య పరుగులు పెడుతున్న, వీధుల్లో దేనికోసమో వెతుక్కుంటున్న వెంకన్న వెంట మనల్ను తిప్పుతున్నాడు అన్నమయ్య. నిజానికి- దేనికోసమో వెతుకుతున్నది వెంకన్న కాదు. తిరుమల వీధుల వీధుల వెంట తిరుగుతూ ఆయన్ను వెతికి పట్టుకోవడానికి ఈ కీర్తన ఒక ఆధారం.
మనం రథోత్సవాలనే చూస్తాం. రథాల మధ్య పరుగులు పెట్టే స్వామివారి వెంట పరుగులు పెట్టాడు అన్నమయ్య.
పల్లవి:-
అదె శ్రీవేంకటపతి అలమేలుమంగయును
కదిసి యున్నారు తమకమున పెండ్లికిని
చరణం-1
బాసికములు కట్టరో పైపై దంపతులకు
శేసపాలందియ్యరో చేతులకును
సూసకాల పేరంటాండ్లు సోబనాలు పాడరో
మోసపోక యిట్టే ముహూర్తమడుగరో
చరణం-2
గక్కునను మంగలాష్టకములు చదువురో
తక్కట జేగట (జేగంట?) వేసి తప్పకుండాను
నిక్కినిక్కి చూచేరదె నెరిదెర తీయరో
వొక్కటైరి కొంగుముళ్ళు వొనరగ వేయరో
చరణం-3
కంకణ దారములను కట్టరో యిద్దరికిని
సుంకుల పెండ్లిపీట కూర్చుండబెట్టరో
లంకె శ్రీవేంకటేశు నలమేల్ మంగను దీవించి
అంకెల పానుపుమీద అమరించరో
వేంకటేశ్వరుడు- అలమేలుమంగ పెండ్లి పీటల మీద కూర్చోగానే అన్నమయ్య మనల్ను తీసుకుని ఆ పెండ్లి పందిట్లోకి వచ్చాడు. అన్నమయ్య రాగానే దేవాదిదేవుళ్లందరూ పక్కకు జరిగారు.
అంతే…ఏమిటలా వెర్రి మొహాలేసుకుని నిలుచున్నారు? ఇదో పులకింతలతో పెండ్లి పీటల మీద కూర్చున్న వీరికి బాసికాలు కట్టండి అని అన్నమయ్య మనందరి చేతులకు బాసికాలు అందిస్తున్నాడు. వాళ్ల దోసిళ్లలో తలంబ్రాలు పోయండి అని పళ్లెం మన చేతిలో పెడుతున్నాడు. ముందువరుస ముత్తయిదువుల్లారా! పాటలు పాడండి అని పురమాయిస్తున్నాడు. సెల్ఫీలు అవీ తీసుకుంటూ… ముహూర్తం టైమ్ మరచిపోయేరు…మోసపోకుండా ముహూర్తం టైమ్ ఒకటికి పదిసార్లు చూసుకోండని మైకులో పదే పదే చెప్తున్నాడు.
సమయం దగ్గర పడింది…కానియ్యండి మంగళాష్టకాలు చదవండి…అని పురోహితులకు చెబుతున్నాడు. గంటానాదం చేయమంటున్నాడు. నిక్కి నిక్కి చూసింది చాలు…ఇక ఇద్దరి మధ్య తెర తీసి కొంగు ముళ్లు వెయ్యమంటున్నాడు.
ముంజేతికి కంకణ దారాలు ఇవిగో! కట్టండి అంటున్నాడు. మాంగల్యధారణ అయ్యింది. దీవించండయ్యా స్వామీ అని దేవతలను పిలుస్తున్నాడు.
దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. వెంకన్న పెళ్లికి మనల్ను స్వయంగా తీసుకెళ్లి…దేవతలను వెనుక వరుసలో ఉండమని…మనల్ను పందిట్లో నిలుచోబెట్టి…మనచేతే దేవుడి పెళ్లి చేయించిన అన్నమయ్య పదవిన్యాసమిది. పదకవితా శక్తి ఇది. కీర్తన మహిమ ఇది.
రేపు:- అన్నమయ్య పదబ్రహ్మోత్సవం-4
“నాలుగు యుగాలుగా వెలుగుతున్న వేంకటాద్రి”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018