Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆయన తాగింది మందు కాదు

ఆయన తాగింది మందు కాదు

యావత్ సోషల్ మీడియా ట్రోలర్లకు మీ అభిమాన కథానాయిక వ్రాయు బహిరంగ లేఖార్థములు:-

మొన్న ఆ వేదిక మీద ఆ కథానాయకుడు వాటర్ బాటిల్లో మందు పోసుకుని…తప్ప తాగి వేదికమీదికి వచ్చి…స్పృహలేని మైకంలో నన్ను తోస్తే…నేను దబ్బున పడబోయి…నిభాయించుకుని… నిలబడి… ఏడవలేక… నవ్వానని… మీరు వైన వైనాలుగా, చిత్రవిచిత్రాలుగా, దృశ్య విదృశ్యాలుగా, రకరకాల కామెంట్లతో ఆ వీడియోను వైరల్ చేయడం నాకు నచ్చలేదు. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలను మీ ముందుంచదలచుకున్నాను.

1. అక్కడ వాటర్ బాటిల్లో మందును వీ ఎఫ్ ఎక్స్ గ్రాఫిక్స్ తో లేనిది ఉన్నట్లు సృష్టించారని ఆ నిర్మాత చక్కటి గ్రాఫిక్ వివరణ ఏదో ఇచ్చినట్లున్నారు కాబట్టి…ఆ బాటిల్లో మినరల్ వాటర్ ఆ కథానాయకుడికి కిక్కు ఎక్కువ ఇచ్చి ఉండవచ్చు. కొన్ని మినరల్స్ ఆట్టే మంచివి కావు. మద్యం కంటే మహా కిక్కిస్తాయి. కాబట్టి ఆ కథానాయకుడు విడిగా మందు పోసుకుని ఉంటారని నేనుకోవడం లేదు. మీరు కూడా అనుకోకండి. కొందరికి మంచి నీళ్లు పడవు- అంతే.

2. గతంలో ఆ కథానాయకుడు నన్ను బహిరంగంగా గిల్లాడు. గిచ్చాడు. రక్కాడు. తొక్కాడు. అప్పుడు నేనేమనలేదు కాబట్టి…ఇప్పుడు దాని కొనసాగింపుగా తోశాడు. ఇదొక అభిమానపూర్వక చనువుతో తోసిన అసంకల్పిత తోపుడే కానీ…అగౌరవం, అమర్యాద, హేళన కానే కాదు. ఇందులో అభ్యంతరం చెప్పాల్సింది ఏమీ లేదు.

3. ఆ తోపుడు నా పూర్వజన్మల పుణ్యఫలం. జన్మ జన్మల సుకృతం. ఎన్నేళ్లో వేచిన తోపుడు అది. కోటికొక్కరికి మాత్రమే దక్కే తోపుడు భాగ్యమది.

4. ఫొటోకు సరిగ్గా ఫోజు ఇవ్వనందుకు నా మీద గౌరవాభిమానాలతో ఏర్పడ్డ అసహనంతో పొంగిన ప్రేమవల్ల తోసిన తోపుడులో నిజంగా ఒకవేళ వేదికమీద ప్రత్యక్షప్రసార కెమెరాల సాక్షిగా నేను కింద పడ్డా…ఒకవేళ పుసుక్కున నా కాలో చెయ్యో విరిగినా…అది ఆయన హృదయ వైశాల్యానికి నిలువెత్తు నిదర్శనమే అవుతుంది తప్ప…అమానుషత్వం అవ్వదు. పుటుక్కున విరిగిన ఎముకలను చిటికెలో అతుకుపెట్టే గురవారెడ్లు ఈరోజుల్లో వీధికొకరుండగా దిగులెందుకు దండగ!

5. ఆ ఊళ్లో ఆయనచేత చెంపదెబ్బలు తినడానికి తమ చెంపలను వాటంగా ఆయన చేతికి అందించి…దెబ్బలు తిని…మళ్లీ మళ్లీ చెంపలను ఆయన చేతికి పోటీలు పడి అందించి…పరవశిస్తున్న పురుషులనేమో వదిలేస్తారా? ఒక మహిళను ప్రేమగా, గట్టిగా తోస్తే నానాయాగీ చేస్తారా? ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం? ఇదేనా భారతీయ స్త్రీకి మీరిచ్చే మర్యాద? ఇలా అయితే పట్టపగలు ఒక ఆడది ఇక బహిరంగవేదికమీదికి ఎలా వెళుతుంది? ఇది కాదా వివక్ష?

6. కాబట్టి- ఆయన తాగింది మందు కాదు; నన్ను తోసింది తోపుడు కాదు! ఇలాగే ప్రతి వేదికమీదా ఆయన నన్ను దబ్బు దబ్బున తోస్తూ ఉండాలని మనసా వాచా కర్మణా కోరుకుంటూ…

ఇట్లు,
-మీ పునః పునః తోపుడు పులకితాంజలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్