మొన్న ఒకరోజు మిట్టమధ్యాహ్నం వేళ హిందూపురంలో భోంచేసి…అనంతపురం బయలుదేరాను. పని ముగించుకుని పక్షులు గూళ్లకు చేరే వేళ హిందూపురం తిరుగుముఖం పట్టాను. ఎప్పుడో ఒంటి గంటప్పుడు ఎంగిలిపడ్డాను. కడుపులో ఆత్మారాముడు అనంతరూపమున వింతలు చేస్తున్నాడు. కారులో పెన్ డ్రైవ్ లో పెట్టుకున్న పాటల్లో-
“మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం”
వినిపిస్తుండగా జాతీయరహదారి ఎడమవైపు “హల్వా అంగడి”; “తాటిబెల్లం కాఫీ” అన్న తాటికాయంత అక్షరాల బోర్డులు కడుపావనంగా కనిపించాయి. కవి వాక్కు సత్యం కావడం అంటే ఇదే కాబోలు అనుకుంటూ…కారును ఆపమని డ్రైవర్ కు చెప్పాను.
అంతకు రెండ్రోజుల ముందే హైదరాబాద్ లో ఒక పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రిలో కొన్ని తెలుగు బోర్డులు చదివి…హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అడగాల్సివచ్చింది. ఆసుపత్రి గోడలనిండా “fire exit” అని ఇంగ్లీషులో; “అగ్ని నిష్క్రమణ” అని తెలుగులో రాసి పెట్టారు. మక్కికి మక్కి అనువాదంలో అగ్ని తనంతట తనే నిష్క్రమిస్తోంది! “మేనేజ్మెంట్ షల్ నాట్ బి రెస్పాన్సిబిల్ ఫార్ లాస్ ఆఫ్ పర్సనల్ బిలాంగింగ్స్” ” అని తెలుగువారికి సులభంగా అర్థమయ్యేలా తేట తెలుగులో అనువధించి…బోర్డును ఏర్పాటు చేసిన మరో అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రి శిలాక్షరాలను ఒక జర్నలిస్ట్ మిత్రుడు పంపాడు. ఇవి చదివిన నేను నా ప్రయత్నం లేకుండానే ఎమర్జెన్సీ వార్డు వైపు వెళుతుంటే…అక్కడున్న సిబ్బంది నేను విజిటర్ నే కానీ…రోగిని కానని దయదలచి గుర్తు చేశారు. భాషాపరమైన ఆకస్మిక ప్రమాదాలకు, ఉద్దేశపూర్వక నిర్లక్యపు తెలుగు తెగుళ్ల రాతల వల్ల పుట్టే మానసిక రోగాలకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని నిర్దయగా చెప్పడంతో నా మనోభావాలు బాగా దెబ్బ తిన్నాయి. అలాంటి నిరాశా నిస్పృహలో ఉన్న నాకు ఈ అంగడి, తాటి బెల్లం కాఫీ బోర్డులు అనంత కరువు ఎడారిలో ఒయాసిస్సులా అనిపించాయి.
అసలే స్వీట్లంటే బలహీనత. “ప్రతిరోజూ తమిళనాడు తిరునల్వేలి నుండి తెప్పించేవి” అని నాలాంటి పెద్దగా చదువుకోనివారికి సులభంగా అర్థమయ్యేలా తెలుగులో రాయించిన ఆ అంగడి యజమానిని అభినందించాను.
పనస హల్వా, జామ హల్వా, మామిడి హల్వా, డ్రై ఫ్రూట్స్ హల్వా…అన్నీ కొద్ది కొద్దిగా రుచి చూశాను. నాలుగు రకాలు పొట్లాలు కట్టించుకున్నాను. ఈలోపు మా డ్రైవర్ తాటి బెల్లం కాఫీ తెచ్చి ఇచ్చాడు. తాగి చీకట్లో రహదారి మీద హిందూపురం బాట పట్టాను. పెన్ డ్రైవ్ లో ఎస్ జానకమ్మ “గోవుల్లు తెల్లన, గోపెమ్మ నల్లన, గోధూళి ఎర్రన…” అని సప్తపది పాట పాడుతోంది.
తిరునల్వేలి పనస హల్వా రుచి నాలుకమీద సుడులు తిరుగుతోంది. వేటూరి అమృతగీతం చెవుల్లో మారుమోగుతోంది. స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లు గాల్లో తేలుతూ…హిందూపురంలో మా చెల్లెలి ఇల్లు చేరాను.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018