Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఫలితాలపై పందేలు

ఫలితాలపై పందేలు

విజయవాడలో పదిమంది జర్నలిస్టుల మధ్య కూర్చున్నప్పుడు ఎన్నికల ఫలితాల బెట్టింగుల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఒకటికి- రెండు, మూడు; కోసు పందెం లాంటి పందెం పరిభాష నేనెప్పుడూ వినకపోవడంవల్ల…నిరక్షరకుక్షులకు అర్థమయ్యేలా సావధానంగా, స్పష్టంగా విడమరచి చెప్పాలని నేనడిగితే ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పడం ప్రారంభించాడు. నైమిశారణ్యంలో రావి చెట్టు కింద రాతి అరుగుమీద కూర్చుని సూతమహాముని చెబుతుండగా చుట్టూ నీడలో చేరి శౌనికాదిమునులు శ్రద్ధగా వింటున్నట్లు అందరూ వింటున్నారు.

అసలు మా ఊరంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వెళ్లి చూడండి. లాడ్జుల్లో ఒక్క రూము దొరకదు మీకు. ఎన్నికల పందెంరాయుళ్లతో అన్ని రూములు నిండిపోయి ఉంటాయి. మాదంతా ప్రొఫెషనల్ గా ఉంటుంది వ్యవహారం.

సంక్రాంతి వేళ కోళ్ల పందేలు. క్రికెట్ వేళ ఆన్ లైన్ బెట్టింగులు. ఎన్నికలవేళ గెలుపోటములు, మెజారిటీల మీద బెట్టింగులు. ఇప్పుడంతా ఆర్గనైజ్డ్ గా, పారదర్శకంగా జరుగుతూ ఉంటుంది. అందులో వాట్సాప్ లు, టెలిగ్రామ్ యాప్ లు వచ్చాక చాలా ఈజీ అయిపోయింది.

ఆమధ్య క్రికెట్ వరల్డ్ కప్ లాస్ట్ ఓవర్ లో ఆరు బాల్స్ కు బెట్టింగ్ పెట్టాడు ఒక పెద్దాయన. మొత్తం పోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని…అజ్ఞాతంలోకి జారుకున్నాడు. బాంబే బుకీల రౌడీలు ఊళ్లోకి వచ్చారు. పెద్దాయన్ను వెతికి పట్టుకున్నారు. కారులో ఎక్కించి బాంబే తీసుకెళ్లబోయారు. ఈలోపు విషయం పెద్దాయన అన్నకు తెలిసి…కులం పరువు, వంశం పరువు పోతుందని భయపడి…బెట్టింగులో కట్టాల్సిన మొత్తం సొమ్మును ఒక్కరోజులో సర్దుబాటు చేశాడు. ఆ కట్టిన సొమ్ముకు ఈ తమ్ముడు అంతే బాధ్యతగా ఆ అన్నకు రాసిచ్చిన ఆస్తి ఆరొందల ఎకరాలు- అంతే.

ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీద బెట్టింగుల్లో లెక్కలేనన్ని ఆప్షన్స్ వచ్చాయి.
1 . ఫలానా పార్టీ రూలింగ్ లోకి వస్తుంది/రాదు.
2 . ఫలానా అభ్యర్థి గెలుస్తాడు/ఓడిపోతాడు.
3 . ఫలానా అభ్యర్థి మెజారిటీ ఇంత దాటుతుంది/దాటదు.
4 . ఫలానా జిల్లాలో ఆ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి/రావు.

ఉదాహరణకు ఎక్స్ అనే నియోజకవర్గంలో వై అనే అభ్యర్థి గెలుస్తాడని ఒకరు- ఓడిపోతారని మరొకరు కోటి రూపాయలు బెట్టింగ్ కాస్తే…ఇద్దరిదీ కలిపి రెండు కోట్ల రూపాయల మూటలను ఒక మధ్యవర్తి దగ్గర పెట్టాలి. ఫలితాల తరువాత బెట్టింగ్ గెలిచినవాడు రెండు కోట్ల మూట తీసుకెళతాడు. రెండు, మూడు వారాలు ఆ నగదు మూటలను భద్రంగా దాచి…బాధ్యతగా తిరిగి ఇచ్చినందుకు మధ్యవర్తి వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాడు. రెండు కోట్ల మీద రెండు లక్షలు. కొందరు కమిషన్ తీసుకోకుండా స్నేహంకొద్దీ ఫ్రీగా మధ్యవర్తిత్వం చేసే ధర్మాత్ములు కూడా ఉంటారు.

జూదం సప్తమహా వ్యసనాల్లో ఒకటి అని తెలిసినా…వ్యసనాన్ని వదిలించుకోలేని ఎందరో పెద్దవారు వందల కోట్లు పోగొట్టుకుంటూ ఉంటారు.

జూదం ఒక శాస్త్రం అవునో కాదో తెలియదు కానీ…మార్కెట్లో ఎక్కువ మంది ఎవరిమీద పందెం కాశారో అధ్యయనం చేసి…వారి మీదే పందెం కాస్తూ ఉంటారు కొందరు.

కొందరు విదేశాలనుండి వచ్చి తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఉన్నదంతా పందెం కాసి…గోచీ గుడ్డతో తిరుగు విమానమెక్కుతూ…వచ్చే ఎన్నికల్లో మళ్లీ పందెం ఎలా కాయలోనని బాధ్యతగా దిగులుపడుతూ ఉంటారు.

పందేల్లో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ…ఓడిన కథలు మాత్రం అనంతంగా వినిపిస్తూ ఉంటాయి.

బతుకే ఒక పందెం. ఆశ ఒక జూదం. అందులో మనం పాచికలం. ఎన్నికల భారతంలో జూదపర్వం ఒక భాగం. క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ లెక్కలేనన్ని. బెట్టింగ్ ను అధికారికంగా అనుమతించాలని ఒక సామాజిక అంగీకారమే వచ్చేసింది.

“తానోడి నన్నోడెనా?
నన్నోడి తానోడెనా?” అని ధర్మరాజును అడిగిరాపో! అని ద్రౌపది అడిగిన ప్రశ్న ప్రశ్నగానే ఉంది.

ప్రజాస్వామ్యం తాను గెలిచి-మనల్ను ఓడిస్తోందా?
లేక తానోడి మనల్ను కూడా ఓడిస్తోందా?
ఓటమిలో గెలుపును వెతుక్కుంటున్నామా?
గెలుపులో ఓటమి తొంగి చూస్తోందా?
అన్న ప్రశ్నలు కూడా సమాధానంలేని ప్రశ్నలుగానే మిగిలి ఉంటాయి!

(ఇందులో ఒక ఊరు, ఆరొందల ఎకరాలు పోగొట్టుకున్న తమ్ముడి పేర్లు చెప్పడం భావ్యం కాదు. ఒక ఊరి మనోభావాలను, తమ్ముడి ప్రాణాన్ని రక్షించుకున్న ఆ అన్న హృదయ వైశాల్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం? మన ఊళ్లో జరగవా బెట్టింగులు? మన ఊళ్లో లేరా సర్వం పోగొట్టుకున్నవాళ్లు?)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్