Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆంధ్రాంగ్ల అనుబంధాలు -1

ఆంధ్రాంగ్ల అనుబంధాలు -1

ముందు మాట:  తొలి తెలుగు పాలకులుగా చరిత్ర శాతవాహనులను పేర్కొన్నప్పటికీ, వారి అధికార భాష నిజానికి ప్రాకృతం. అందుకే నా వరకూ నేను తెలుగుకు పట్టం కట్టిన మొదటి పాలకులుగా కాకతీయులను గుర్తిస్తాను. కాకతీయుల తర్వాత విజయనగర రాయల వంశపాలనలో తెలుగు ఇంకా ఉన్నత స్థితిని చూసింది. విజయనగర రాజవంశాలైన సంగమ, సాళువ వంశాల మధ్యలో కొద్దికాలం పాటు గజపతులు హంపి రాజధానిని చేజిక్కించుకొన్నప్పుడు, వారి మాతృ భాష అయిన ఒరియాని గజపతులు అధికార భాషగా ప్రకటించారు. ప్రజలకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒరియా భాషని మాట్లాడవలసి వచ్చింది.

“నొగి నొడ్డెభాష లాడి వొడ్డెవాడనైతి
తెగి తెలుగాడ నేర్చి తెలుగువాడనైతి
ఆగడై శ్రీవేంకటేశ అన్నియు విడిచి నేను
తగు నీ దాసుడనై దాసరి నేనైతి “

అవసరార్థమై ఒడ్డె (ఒడియా) భాష నేర్చుకుంటూ ఒడ్డె వాడనయ్యాను. తెలుగు అవపోశన బట్టి తెలుగు వాడినయ్యాను అంటూ తనకిష్టంలేని పని చెయ్యవలసి వచ్చిందని వాపోయాడు, రాయల గజపతుల వంశపాలనా కాలానికే చెందిన అన్నమయ్య.  అన్నమయ్య బాధలు వెంకన్న నిజంగానే విన్నాడో లేదా విని నవ్వుకొన్నాడో గాని, ఒడియా భాష ప్రభావం తెలుగు మీద లేదనే చెప్పాలి. సాళువ వంశం తర్వాత తుళు వంశానికి చెందిన, శ్రీక్రిష్ణదేవరాయలువారి పాలనా కాలం తెలుగునుడికి ఒక బంగారుకారు. నిజానికి శ్రీక్రిష్ణదేవరాయలువారి మాతృభాష తుళు, వారి అధికార భాష కన్నడ, కానీ తెలుగుకు మాత్రం రాజభాష కన్నా ఎక్కువ గౌరవమే దక్కింది.

విజయనగర రాజుల తర్వాత బహమనీ సుల్తానులు, మొఘలుల పాలనలో, భారతదేశానికి  అన్యభాషలైన ఉర్దూ, పార్శి భాషలను తెలుగు ప్రజలు బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చింది. అసలు తెలుగు వాడుక నుడినే తీసుకొంటే, రోజువారి మాటల్లో మామూలుగా కలిసిపోయి ఆఖరుకు తెలుగు కాదంటే నమ్మనంతగా మారిన పదాలెన్నో. (ముందటి వాక్యంలో ‘అసలు’, ‘ఆఖరు ‘ ‘రోజు’, ‘మామూలు’ ఇవన్నీ తెలుగు కావు, ఉర్డూ పదాలు !!)

రాయలకాలం తర్వాత అధికార ప్రాపకానికి మాత్రం తెలుగు ఇవ్వాళ్టికీ నోచుకోలేదు. అప్పటి నుంచి 300 ఏళ్ళపాటు అధోముఖంగానే సాగిన తెలుగు ప్రయాణానికి, 1820వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్ర పాలనాధికారిగా (Governor) పనిచేసిన థామస్ మన్రో ఇచ్చిన ఒక ఉత్తరువు అడ్డుకట్ట వేసింది. మనకు ఈనాడు నమ్మడం కష్టం కానీ ఆ ఉత్తరువు ఏంటంటే “పౌర పరిపాలన (civil services) లో ఉన్న అధికారులందరూ అక్కడి ప్రాంతీయ భాష విధిగా నేర్చుకోవాలి. ప్రజాభాషలొనే సంభాషణలు సాగాలి.” ఈ ఉత్తరువే అక్కడే మద్రాసు నగరంలో ఉంటూ పరిపాలనలో చేరాలని ఆశ పడుతున్న ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే 20 ఏళ్ళ ఆంగ్లయువకుడిని తెలుగు వైపుకు తోసింది.

తొలి అడుగులు:
బ్రౌన్‌కి తెలుగు పరిచయం చేసింది థామస్ మన్రో అయితే, తెలుగుకి దగ్గర చేసింది మాత్రం అప్పటి కడప జిల్లాధికారి హన్బరి (Collector Hanbury). బ్రౌన్ మొదటి ఉద్యోగ నియామకం 1820లో జిల్లాధికారి సహాయకుడిగా మా కడప జిల్లాలొనే. అంతకుముందు కేవలం ఉద్యోగార్హతల నిమిత్తం అది కూడా అంతంత మాత్రంగానే మద్రాసు కళాశాలలో తెలుగు నేర్చుకొన్నాడు. కానీ జిల్లాధికారిగా హన్బరి తెలుగులో అనర్గళంగా మాట్లాడడంతో, బ్రౌన్‌కి కూడా వృత్తిపరంగా తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి అయ్యింది. ఇదొక్కటే కారణం కాదు, బ్రౌన్‌కి అప్పటికే మాతృభాష ఇంగ్లీష్ తో పాటుగా లాటిన్, గ్రీకు, పార్సి, సంస్కృతం కూడా వచ్చు. సహజంగానే భాషలంటే ఆసక్తి ఉన్న బ్రౌన్‌కి వ్యక్తిగతంగా కూడా తెలుగు నేర్చుకోవాలనే పట్టుదల పెరగడం మరో కారణం. ఆ పట్టుదలే ఆయనకు రెండేళ్ళలో తెలుగు చక్కగా మాట్లాడడం, వ్రాయడం వచ్చేలా చేసింది. ఆయనలోని భాషాభిమాని చూపు, అటు తర్వాత తెలుగు సాహిత్యం వైపుకు మరలింది.

ఇక్కడ మనం 1823వ సంవత్సరం అంటే 200 ఏళ్ళ క్రితం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ కాలంలో కావ్యాల ప్రతులను తాళపత్రాల మీద రాసేవారు. అలా రాయలంటే చంధస్సు తెలిసిన లేఖరులు ఉండాలి. పైగా తాళపత్రాల మన్నిక కూడా తక్కువ కాలం. తెలుగు సాహిత్యం చదవాలన్న బ్రౌన్ ఆసక్తికైతే లోటు లేదు కాని తాళపత్రాలు దొరకడమే గగనం మరి. మనది కాని భాషలో సాహిత్యం దొరకకపొతే మనం అయితే అక్కడితోనే వదిలేస్తాం, ఒకవేళ బాగా కోరిక ప్రబలితే ఏదో ఒక రకంగా పలుకుబడి వాడి ఒక పుస్తకాన్ని సంపాదించి చదువుతాం. కాని మిగిలిన వారికి బ్రౌన్ దొరకీ ఇక్కడే తేడా. ఆ సందర్భంలో బ్రౌన్ తీసుకొన్న సంకల్పం ఏంటంటే తెలుగు వాఙ్మయాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి అని. మనసుల్లోకి ఎక్కడానికి ముందు వాక్యం ఇంకో సారి మళ్ళీ చెబుతాను – “బ్రౌన్ సంకల్పం తనకోసం ఒకటో రెండో కావ్యాలు సేకరించడం కాదు, మొత్తం తెలుగు వాఙ్మయాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని.” ఆయన నిబద్దతకు ఒక చిన్న ఉదాహరణ – దేశంలోనే మొదటి తెలుగు ముద్రణా యంత్రాన్ని మచిలీపట్నంలో మొదలుపెట్టాలని 1832లోనే ఒక విఫలయత్నం చేసి ఇంకో ఆంగ్లేయుడి చేతిలో మోసపోయి కొంత చేతి చమురు కూడా వదుల్చుకొన్నారు.

బ్రౌన్ భగీరథుడు:
బ్రౌన్ సంకల్పం గోరంత అయితే ఎదురైన ఆటంకాలు కొండంత. మన సమాజంలో గ్రంథాలను సాక్షాత్తూ సరస్వతీదేవి స్వరూపంగా చూస్తారు. కావ్యాల విషయంలో ఏలినవారినే లెక్క చేయలేదు మనవాళ్ళు. సాక్షాత్తూ శ్రీహరిని స్తుతించిన నోటితో నీ గురించి కీర్తన చెప్పడమేంటి పోపోవోయ్ అని విజయనగర రాజు సాళువ నరసింహరాయలని ఛీత్కరిస్తాడు అన్నమయ్య.

“కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల! యో మదంబ! యో
హాటక గర్భురాణి! నిను నాఁకటికిం గొని పోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ”

విష్ణువుకి ప్రియమైన కోడలా!! అమ్మా,శారదా దేవీ !! నిన్ను ఆ కీచక పాలకుల చెంతకే తీసుకెళ్ళను, నమ్ము తల్లీ అని ప్రార్థిస్తాడు పోతన.

అలాంటి సాంప్రదాయాలు పాటించే సమాజంలో, బయట దేశానికి, అందులోనూ అన్యమతానికి చెందిన బ్రౌన్‌కి దేవతా స్వరూపమైన గ్రంథాన్ని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా ఈయన నేను ముద్రణాయంత్రంతో అచ్చు వేయిస్తాను అని అంటాడు. మన వాళ్ళ దృష్టిలో అది పాపకార్యమాయె. ఆ తాళపత్రాలు పాడైపోయినా పర్లేదనుకొంటారు కానీ కోరికోరి ఎవరైనా పాపం కొని తెచ్చుకొంటారా?

బ్రౌన్ ప్రయత్నాలు కూడా అంతకంటే గట్టిగానే సాగాయి. కేవలం తెలుగు సాహితీ సేవ కోసమే బ్రౌన్ కడపలొ విశాలమైన పదెకరాల ఒక బంగ్లాని కొన్నాడు. కొంతమంది పండితులను తన సొంతఖర్చులతో వేతనానికి కొలువులోకి తీసుకొన్నాడు. ఆ బంగళాలో కొంత భాగం ఈ పండితులకు నివాసం కూడా. వాళ్ళ మొదటిపని, ఎక్కడెక్కడి మారుమూల గ్రామాలకో వెళ్ళడం, గ్రంథయజమానులను ముద్రణ పాపకార్యం కాదని ఒప్పించడం, తాళపత్రాలను వీలైతే అరువుకు తీసుకోవడం లేదా కొనుగోలు చెయ్యడం.

భూమిమీదకు రావడానికి గంగాదేవి అంగీకరించిన వెంటనే భగీరథుడి కష్టాలు తీరలేదు సరికదా, ఇంకా ఎక్కువయ్యాయి. తాళపత్రాలు సమకూరడం మొదలు పెట్టిన తర్వాత బ్రౌన్‌కి కూడానూ సమస్యలు ఎక్కువయ్యాయి. దొరికిన తాళపత్రాల్లో కొన్ని సంపూర్ణంగా ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా అందులోని గజిబిజి చేతిరాత అర్థమవడం ఇంకో సమస్య. రాత అర్థమైనా ఒకే కావ్యానికి చెందిన రెండు తాళపత్రాల్లో వేరువేరు వాక్యాలు ఉండేవి. ఏది తప్పో, ఏది సరో తెలియదు.

ఈ అరకొరగా లభ్యమైన తాళపత్రగ్రంథాలను కొడిగడుతున్న దీపాలతో పోలుస్తాడు, బ్రౌన్ జీవితం మీద పరిశోధన చేసిన మా కడపకే చెందిన జానుమద్ది హనుమశాస్త్రి గారు. జానుమద్ది హనుమశాస్త్రి గారి మాటల్లొ – “మిణుకుమిణుకు మంటున్న తెలుగు వాఙ్మయ దీపాన్ని చమురు నింపి ప్రజ్వలింపజేసిన ఆంధ్రభాషోద్ధారకుడు సి.పి. బ్రౌన్”.  (ఇంకా ఉంది)

–  నూచర్ల మహేశ్

(రచయిత ఆంధ్ర దేశం నుండి ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ వృత్తి నిపుణుడు. తెలుగు సాహితీ పిపాసి. ఎక్కడున్నా తెలుగు వెలుగులను వెతుక్కునే అన్వేషి)

RELATED ARTICLES

Most Popular

న్యూస్