Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపాయె...నిద్ర కూడా పాయె

పాయె…నిద్ర కూడా పాయె

No Soud Sleep:  “సడిసేయకో గాలి… సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడి సేయకే
రత్నపీఠిక లేని… రారాజు నా స్వామి మణికిరీటము లేని…
మారాజు గాకేమిచిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే సడి సేయకే
ఏటి గలగలలకే… ఎగసి లేచేనే ఆకు కదలికలకే… అదరి చూచేనే నిదుర చెదిరిందంటే నేనూరుకోనే సడి సేయకే
పండువెన్నెలనడిగి… పాన్పు తేరాదేఈడ మబ్బుల దాగు… నిదుర తేరాదేవిరుల వీవనపూని… విసిరి పోరాదే…”

Sleeping

… దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన రాజ మకుటం సినిమాలోని ఈ పాట ఎన్నో తరాలుగా అలరిస్తోంది. కళ్ళు మూసి విన్నా తెరచి విన్నా అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది. తూగుటుయ్యాలలో ఉన్న భావననిస్తుంది. ఎందుకంటే ప్రతి పదం, భావం సరిగ్గా అమరాయి కాబట్టి. ప్రకృతిలో అన్ని అంశాలూ సమంగా ఉంటేనే అటువంటి నిద్ర సాధ్యం. ఎప్పుడో పాటగా చెప్పిన సూత్రాలు ఇప్పుడు శాస్త్రవేత్తలు నిజమంటున్నారు.

చెరువులో నీరు ఎక్కువ కదిలినా, చెట్లు ఒకింత విసురుగా ఆకులు కదిల్చినా నిద్రాభంగమవుతుందని కవి హృదయం. నిద్ర అనేది ఎలాచూసినా అత్యంత అవసరమని ఈ పాట ఆనాటి నుంచీ చెప్తూనే ఉంది. ఇక ఇప్పుడైతే ఆరోగ్యనిపుణులను ఎవరిని సలహా అడిగినా నిద్ర గురించే చెప్తారు. దానికి తోడు నిద్రపట్టని నిశాచరులు రోజురోజుకూ పెరుగుతున్నారు. పులిమీద పుట్రలా తాజాగా వెల్లడైన పరిశోధనా ఫలితాలు ఇంకా ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. వాతావరణ మార్పులు నిద్రని ముందుముందు మరింత ప్రభావితం చేస్తాయని సారాంశం. దీనిపై డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ యూనివర్సిటీ నిపుణులు రెండేళ్లపాటు అధ్యయనం చేశారు. భారత్ సహా 68 దేశాలకు చెందిన 48 వేలమందికి స్లీప్ ట్రాకర్స్ అమర్చి పరిశీలించారు.

Sleeping

వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడంతో రానున్న రోజుల్లో ఒక్కొక్కరు రోజుకు పదినిముషాల నిద్ర కోల్పోతారట. ఇలా 2099 నాటికి ఒక్కొక్కరు 50 నుంచి 60 గంటల నిద్రను కోల్పోతారట. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ఇది మరికాస్త ఎక్కువేనట. సహజమే, ఏసీలు, ఫ్యాన్లు పెట్టుకోలేని పేదవారు ఎక్కువగా ఉన్న దేశాల్లో అదేగా పరిస్థితి. పది నిమిషాల నిద్రపోతేనే ఇంత హడావుడా అనకండి. నిద్ర విలువ తెలిసినవాళ్లు అలా అనుకోరు. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఈ విషయం ఎప్పుడో తెలుసుకాబట్టే అంత సున్నితంగా చెప్పగలిగారు. మనవంతుగా భూ తాపం తగ్గించి హాయిగా నిద్రపోయే మార్గాలు వెతుక్కుంటే మేలు.

-కె. శోభ

Also Read :

నిద్రా ముద్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్