Power Crises in India, lack of coal availability .. రావణాసురుడి కొలువులో విద్యుజ్జిహ్వుడు అని అసాధారణమయిన మాయలు చేసే ఒక రాక్షసుడు ఉంటాడు. రాముడితో యుద్ధంలో గెలవలేమని తెలిసిన రావణుడు విద్యుజ్జిహ్వుడిని పిలిచి…యుద్ధంలో మనం రాముడిని సంహరించినట్లుగా సీతను ఎలాగయినా నమ్మించు అని చెప్తాడు. వాడు వెంటనే మాయతో మొండెం నుండి వేరు చేసిన రాముడి తలను, మహిమాన్వితమయిన ఆయన కోదండాన్ని సృష్టించి…సీతకు చూపి…యుద్ధంలో రావణుడు గెలిచాడని చెబుతాడు. అవి చూసి హతవిధీ! అని మొదట సీతమ్మ మూర్ఛ పోతుంది. తేరుకున్నాక పక్కనున్న రావణుడి రాక్షసులే ఇదంతా రావణుడి మాయోపాయాలు…నమ్మకు తల్లీ! రాముడు క్షేమంగానే ఉన్నాడు అని చెబుతారు. యానిమేషన్లు, గ్రాఫిక్కులతో అవతారపురుషులనే బురిడీ కొట్టించే అవతార్ లు, బాహుబలులు అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు.
తాటకి మనవరాలు శూర్పణఖ. మారీచ సుబాహువులు శూర్పణఖకు మేనమామలు. శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడు. బహుశా రాముడు శూర్పణఖ ముక్కు చెవులు కోయించినందుకు…ప్రతిగా మాయగా అయినా విద్యుజ్జిహ్వుడి చేత రాముడిని సంహరించినట్లు చెప్పించాడేమో వాల్మీకి. యుగయుగాల పాత్రల మధ్య ఔచిత్యం, కార్యకారణ సంబంధాలు, సమస్త రాక్షసజాతి నామరూపాల్లేకుండా మట్టికొట్టుకుపోవడానికి తగిన కారణాలు…ఇలా వాల్మీకి రామాయణం బిగువు, కథనం, స్క్రీన్ ప్లే, పాత్రల చిత్రణ, కావ్య సౌందర్యం దేనికదే గొప్పది. మిగతా కథ ఇక్కడ అనవసరం.
నాలుక మీద విద్యుత్తు ఉన్నవాడు లేదా విద్యుత్తునే నాలుకగా కలిగినవాడు విద్యుజ్జిహ్వుడు అని అర్థం. అంటే వాడు నోరు తెరిస్తే ఎదుటివారు మాడి మసై పోతారు. నాలుక బయటపెట్టి ఉఫ్ అని ఊదాడంటే ఒక్కసారిగా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్, వేడి, వెలుగులతో నిప్పులు చిమ్ముకుంటూ వస్తుంది. వాడి నాలుకే కొన్ని వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం. కానీ- అనర్థానికి తప్ప మంచిపనికి విద్యుజ్జిహ్వుడు నోరు తెరవడు. అందువల్లే నలుగురు కూర్చుని నవ్వే వేళల్లో తలచుకోవడానికి అర్హతలేనివాడిగా తెరమరుగయ్యాడు.
ఇలాంటి విద్యుజ్జిహ్వులు మళ్లీ పుట్టాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. లేకపోతే ఉన్న బొగ్గు నిల్వలు అయిపోయి ప్రపంచానికి కరెంటు లేని కారు చీకటి తప్పేలా లేదు.
మన దేశం వాడుతున్న కరెంటులో 66 శాతం థర్మల్ విద్యుత్తే. అంటే బొగ్గును మండించి ఆ వేడిని విద్యుత్తుగా మార్చుకోవడం. విద్యుదుత్పత్తిలో పెద్ద చిక్కు ఉత్పత్తి కేంద్రంలో పుట్టించే ప్రతి యూనిట్ ప్రవహించి చివర మన ఇళ్లల్లో బల్బు వెలుగుగానో, ఫ్యాన్ గాలిగానో, గీజర్ వేడిగానో బర్న్ అయిపోవాల్సిందే. ఒక్క యూనిట్ కూడా ఎక్కడా నిలువ ఉంచుకోవడానికి వీల్లేదు. అందువల్లే దానికి కరెంట్- ప్రవహించేది అని పేరు.
దేశంలో బొగ్గు గనుల్లో తవ్వకాలు మందగించాయి. కరోనా ఒక సమస్య. అంతర్జాతీయంగా తక్కువ ధరకు దొరుకుతోంది కదా అని…దేశంలో తవ్వకాలను గాలికొదిలేశారు. చేతులు కాలాక బొగ్గు పట్టుకుందామనుకుంటే బొగ్గు ఎక్కడా దొరకడం లేదు. బూడిదే మిగిలింది.
ప్రయివేటు బొగ్గుగనుల్లో నిల్వలు పుష్కలంగా ఉండడం; ప్రభుత్వ కోల్ ఇండియా గనుల్లో నిల్వలు నిండుకోవడంలో ఏదో సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇది ఉద్దేశపూర్వకమయితే మన ఖర్మ బొగ్గుగా కూడా మిగల్లేదా? అని ఆత్మ నిర్భర్ అని మనకు మనమే అభిమంత్రించుకుని చింతించడం తప్ప చేయగలిగింది లేదు. బొగ్గు చూపు లేని దృష్టి దోషమయితే…దానికి బాధ్యులెవరో తెలియాలి.
అయినా-
స్లోగన్లు, పంచ్ డైలాగ్ ల కాలంలో…
పాడు బొగ్గు
మసి బొగ్గు
నుసి బొగ్గు
రాక్షసి బొగ్గు లాంటి కాలి బూడిదయ్యే తొక్కలో బొగ్గుల గురించి పట్టించుకునేదెవరు?
ఏదయినా కాలితే బొగ్గే కావాలి
కానీ- బొగ్గు కాలితే మాత్రం జగతికి కోటి వెలుగుల విద్యుత్ అవుతోంది.
తెలతెల్లటి ఫాల్కన్ బల్బు వెలుగులో నల్లటి బొగ్గు ఉంది.
చల చల్లటి ఏ సీ చలువలో నల నల్లటి బొగ్గు ఉంది.
వెచ్చటి గీజర్ వేడిలో నల్లటి బొగ్గు ఉంది.
పట్టాలపై కదిలిన రైలును కదిలించిన విద్యుత్ తీగలో బొగ్గు ఉంది.
ఆసుపత్రిలో ఐ సి యు ఏకాంతంలో అందరూ వదిలేసినా పలికే తోడుగా మిగిలిన విద్యుత్ లో బొగ్గు ఉంది.
చివరకు దేహంలో ప్రాణం పొతే…కట్టెల మీద కట్టెగా మిగిలిన పార్థివ శరీరాన్ని బూడిద చేసి అనంతవాయువుల్లో కలపడంలో బొగ్గు ఉంది.
బొగ్గుకు మరో రూపమే వజ్రం.
బొగ్గు వజ్రం కాగలదు.
కానీ- వజ్రం ఎప్పటికీ బొగ్గు కాలేదు.
వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
ఎప్పటికీ నిలిచి ఉండే వజ్రంలో తనను తాను నామరూపాల్లేకుండా చేసుకున్న బొగ్గే ఉంది.
బొగ్గు నిస్వార్థ సేవలకు ఏముంది ప్రతిఫలం?
బూడిద తప్ప!
చివరకు మిగిలేది- బూడిదే!
-పమిడికాల్వ మధుసూదన్