‘ముందుమాట’ పదహారణాల తెలుగు మాట. ముందు-నుడి- కలిపి ‘మున్నుడి’ కూడా మంచి తెలుగు మాటే. పీఠిక, అభిప్రాయం, మంగళాశాసనంలాంటివన్నీ సంస్కృతం. తెలుగువారికి తెలుగుమీద గౌరవం ఉండదు కాబట్టి ఇతర భాషల పదాలు తెలుగును పక్కకు తోసి తెలుగువారి నెత్తిమీద కూర్చుంటూ ఉంటాయి. అది వేరే చర్చ. ఇక్కడ అనవసరం.
వేసవి సెలవుల తరువాత బడి తలుపులు తెరవగానే తెలంగాణాలో ‘ముందుమాట’ తెచ్చిన ఉపద్రవం అంతా ఇంతా కాదు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ఏటా లక్షల సంఖ్యలో అచ్చవుతూ ఉంటాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుస్తకాల ముద్రణకు టెండర్లు పిలిచి…పనిని అప్పగించి ఉంటారు. తీరా పుస్తకాలు తయారై చేతికొచ్చేసరికి బి ఆర్ ఎస్ ప్రభుత్వం పోయి…కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. పిల్లల చేతిలో ఆ పుస్తకాలు పెట్టేవేళ ఏ మహానుభావుడో పుస్తకం తెరిచి చూస్తే…అందులో ముందుమాట అప్పటి ముఖ్యమంత్రి కె సి ఆర్ రాసినది ఉంది. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుమాట లేకపోయినా పరవాలేదు కానీ…అప్పటి ముఖ్యమంత్రి ముందుమాటతో పుస్తకాలు పిల్లల చేతికి చేరితే ఇంకేమన్నా ఉందా?
వెంటనే విద్యాశాఖ కళ్లు తెరిచి…ఆ పుస్తకాలు పంపిణీ కాకుండా జాగ్రత్త పడింది. పుస్తకాలను చించి…చెత్త బుట్టలో పడేసి…మళ్లీ కొత్తగా అచ్చేయించడానికి ఆరు నెలల సమయం కావాలి. ఈలోపు 2024-25 విద్యాసంవత్సర పుణ్యకాలం అయిపోతుంది. దాంతో కె సి ఆర్ ముందుమాట పేజీ కనిపించకుండా…రేవంత్ రెడ్డి ముందు మాటను కొత్తగా అచ్చేయించి…అదే స్థానంలో అతికించి…ఇవ్వాలని నిర్ణయించారు. మంచిదే. గుడ్డిలో మెల్ల.
ఈ అతుకుళ్లు అయ్యేదాకా బడి పిల్లలు పాఠ్య పుస్తకాలు చేతిలో లేకుండా గోడలు చూస్తూ కూర్చోవాల్సిందే. ఉంటే ఉండనీ…ఆ ముందుమాటతోనే అలాగే పిల్లలకు ఒక్క క్షణం ఆలస్యం కాకుండా పుస్తకాలు పంచేయండి అని రేవంత్ అనగలిగి ఉంటే ఆయన సహృదయత కొలవడానికి టేపులు సరిపోయేవి కావు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని పిల్లల పాఠ్యపుస్తకాల నిండా రాసి ఉంటుంది. ఆ పేరు గొప్ప ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధినేతలు ముందు మాట మీద ఎంత ముందు చూపుతో ఉంటారో తెలిపే ఈ పాఠాన్ని కూడా పిల్లలకు చరిత్ర పాఠాల్లో కనీసం చివరిమాట పేరుతో అయినా చివరి పేజీలో చేర్చి…బోధించాలి.
ఎందుకంటే చివరికి మిగిలేది పాఠాలు, గుణపాఠాలే!
అన్నట్లు ఆమధ్య తమిళనాడులో ఇలాగే ప్రభుత్వం మారింది. పాతప్రభుత్వం ముద్రించిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, బ్యాగులు ఇతర సామగ్రి మీద జయలలిత ఫోటో ఉంది. ఉండనివ్వండి పరవాలేదు…అలాగే ఇచ్చేయండి అన్నారు కొత్త ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్. దీనితో స్టాలిన్ ఖ్యాతి పెరిగిందే కానీ…ఇసుమంత కూడా తగ్గలేదు. తగ్గదు. ఉత్తరప్రదేశ్ లో యోగీ కూడా అఖిలేష్ ఫోటో ఉన్న స్కూల్ బ్యాగులను ఆపలేదు. అలాగే ఇచ్చేశారు. ఆ ఔదార్యం, విశాల దృక్పథం అందరిలో, అన్ని వేళలా ఉంటే ఎంత బాగుండేదో!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు