Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపొలిటికల్ రియాలిటీ షో

పొలిటికల్ రియాలిటీ షో

Task-Bigg Boss: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్ బాస్ హౌస్లోకి ఒక పోటీదారుగా వెళ్లడం మీద అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా జనం రెండుగా చీలి దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

తప్పేముంది?
ఎమ్మెల్యే అయినంతమాత్రాన ఆయనకూ ఏవో కలలు, కళలు ఉంటాయి కదా? వాటిని ప్రదర్శించుకునే వేదికలు వెతుక్కుంటే తప్పేముంది? అని ఆయన్ను సమర్థించేవారు అంటున్నారు.

నియోజకవర్గం గతేమికాను?
అసలే చిక్కబళ్లాపూర్ లో కరువు తాండవిస్తోంది. మంచి నీళ్లకు కూడా జనం ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే వెళ్లి బిగ్ బాస్ హౌస్లో ఫోనుక్కూడా దొరక్కుండా కూర్చుంటే ప్రజలకు దిక్కెవరు? అన్నది విమర్శించేవారి వాదన.

జనమేమనుకుంటే ఏమి?
ఈ ఎమ్మెల్యే ఇలాగే బిగ్ బాస్ సీజన్లలో కంటెస్టెంట్ గా ఉంటూ బెంగళూరు విధానసౌధ భవనంలో కాకుండా బిగ్ బాస్ కెమెరా డేగ కళ్ల దుర్భేద్య కోటలో ఉండడం ద్వారా ఏదో విశాల ప్రజా ప్రయోజనం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఉండవచ్చు. కొన్ని నెలలు నియోజకవర్గ ప్రజలతో పాటు ఎవరికీ దొరక్కపోవచ్చు. కానీ…బిగ్ బాస్ అంతిమ విజేతగా కోటో రెండు కోట్లో గెలిచి…ఆ నిధులతో నియోజకవర్గంలో జనానికి తలా లోటాడు మంచి నీళ్లు అందివ్వవచ్చు. ఈ స్ఫూర్తిని అందుకుని అనేక రాష్ట్రాల్లో ఇంకా అనేకమంది ఎమ్మెల్యేలు శాసనసభలకు, నియోజకవర్గాలకు వెళ్లకుండా…ఆయా భాషల బిగ్ బాస్ భవనాల్లో తమకు తాము బందీ కావచ్చు.

పురాణాలు, వేదాంతాలను మనం సరిగ్గా అన్వయించుకోలేక తికమకపడుతుంటాం. రాముడు అడవికి వెళ్లి కష్టాలు పడింది ఎందుకు? రాక్షస సంహారానికి. ధర్మపాలనకు. అలా మన ఎమ్మెల్యే బిగ్ బాస్ కు వెళ్లి అష్ట కష్టాలు పడుతున్నది ఎందుకు? ధర్మపాలనకు అని అనుకుని…మన ఇంట్లో టీ వీ లో…మన ఎమ్మెల్యే…మనకోసం పడుతున్న కష్టాలకు కన్నీళ్లు కార్చడమే ఓట్లేసి గెలిపించినవారిగా మన తక్షణ కర్తవ్యం!

దీనికి భిన్నంగా నాకు తెలిసిన ఒక స్ఫూర్తిదాయకమయిన విషయమిది. ప్రఖ్యాత స్వాతంత్య్రసమర యోధుడు, మహాత్మా గాంధీ చేత “జైలు విద్యార్థి” అన్న బిరుదుపొందిన కల్లూరు సుబ్బారావు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. భారత ఉపరాష్ట్రపతి వి వి గిరి, ప్రఖ్యాత సంగీత సాహితీ విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ కల్లూరువారికి ఆత్మీయ మిత్రులు. వి వి గిరికి సంస్కృతంలో, ప్రాకృతంలో, కర్ణాటక సంగీతంలో కొన్ని తీర్చుకోవాల్సిన సందేహాలున్నాయి. అందుకు రాళ్లపల్లివారిని కలవాడానికి వీలవుతుందా? అని కల్లూరువారిని అడిగారు. ఈ సంగీత సాహిత్య సందేహ నివృత్తి ప్రత్యేక భేటీకి కల్లూరివారి హిందూపురం సొంత ఇల్లు వేదిక అయ్యింది. బెంగళూరుకు విమానంలో వచ్చిన వి వి గిరి హిందూపురానికి వచ్చారు. రాళ్ళపల్లివారూ వచ్చారు.

అనంతపురం కలెక్టర్ వచ్చి ప్రోటోకాల్ ప్రకారం బస, భద్రత, వంటావార్పు ఏర్పాట్లు చేశామని ఉపరాష్ట్రపతికి గౌరవంగా విన్నవించుకున్నారు. ఆయన నవ్వి… “నేనిక్కడ కల్లూరివారి ప్రేమాభిమానాల మధ్య బందీ అయి ఉన్నాను. నా వ్యక్తిగత పర్యటన ఇది. కల్లూరివారి ఇంట్లోనే బస. వారేమి పెడితే అదే తింటాను. నేనొక విద్యార్థిగా ప్రత్యేకంగా వచ్చాను. నన్ను మీరు డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే చాలు. పైగా రెండ్రోజులు ఎమ్మెల్యే తన పనులు మాని…ఇలా సంగీత సాహిత్యాల్లో మునిగితేలుతున్నారు అన్న చెడ్డపేరు వారికి రావడం నాకిష్టం లేదు. వారిని కలవాల్సినవారు కలుస్తూనే ఉంటారు. మా చర్చలు జరుగుతూనే ఉంటాయి. మీరిక్కడ గన్ మెన్లను పెడితే చుట్టూ ఉన్నవారికి ఇబ్బంది. మాకు నామోషీగా ఉంటుంది” అన్నారు. కలెక్టర్ వెనుతిరిగి అనంతపూర్ వెళ్లిపోయారు. రెండ్రోజుల పాటు ఆ ముగ్గురినీ ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. సంగీత, సాహిత్యాల్లో మునిగి తేలారు.

ఆ చర్చను కళ్లారా చూసిన, విన్న లేపాక్షి ఓరియంటల్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ నారాయణరావుగారు ఈ విషయాన్ని ప్రపంచానికి చెబుతూ వారి చర్చను ఎవరయినా అక్షరం పొల్లుపోకుండా రికార్డ్ చేసి ఉంటే కనీసం మూడు నాలుగు ప్రామాణికమయిన గ్రంథాలు అయి ఉండేవి అన్నారు.

చెక్క కుర్చీల్లో, సిమెంటు అరుగుల మీద, కింద చాపల మీద కూర్చుని వారు మాట్లాడుకుంటుండగా విన్నవారిది, చూసినవారిది భాగ్యం అని మా హిందూపురం కొన్ని దశాబ్దాలపాటు పొంగిపోయి చెప్పుకుంది.

ఒక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని, జనాన్ని గాలికొదిలి ఇలా బిగ్ బాస్ హౌస్ లో బందీ అయ్యాడు అని తెలిస్తే వీ వీ గిరులు ఏమనుకునేవారో! పాపం! అలాంటి సంస్కారులు, చదువుకున్నవారు, సున్నితహృదయులు పోయి బతికిపోయారు. లేకుంటే…ఇలాంటివి చూడలేక పోయేవారు!

ఇప్పుడు –
బతుకొక రియాలిటీ షో.
రాజకీయాలు ఇంకా పెద్ద రియాలిటీ షో.
ప్రజాస్వామ్యం ముందు చిత్ర విచిత్ర టాస్క్ లు.
ఎమ్మెల్యేలు కంటెస్టెంట్లు.
ఓటర్లు మౌన ప్రేక్షకులు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్