Common-Corporate: చట్టం, న్యాయం, ధర్మం, సంప్రదాయం, ఆచారం, ఆదర్శం, నైతికత…దేనికవిగా విడి విడి అంశాలు. ఆ లోతుల్లోకి వెళ్లకుండా కేవలం నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఈ చదువుల భవసాగరాన్ని ఈదేద్దాం.
నారాయణ ఒక పేరు కాదు.
ఒక బ్రాండ్.
ఒక చదువుల విప్లవం.
ఒక విద్యా తపస్సు.
ఒక ర్యాంకుల కర్మాగారం.
ఒక మార్కుల పరిశ్రమ.
ఒక బృహస్పతి నిలయం.
ఒక అది.
ఒక ఇది.
ఒక మాటలకందని ఏదేదో…అది.
సగటు తల్లిదండ్రులు వద్దు వద్దు అనుకుంటూనే వెళ్లి తీరాల్సిన ఒక గమ్యం నారాయణ.
సగటు విద్యార్థులు ఇష్టం లేదంటూనే కష్టంగా చేరి తీరాల్సిన చోటు చైతన్య.
మార్కులు, ర్యాంకులు తప్ప ఇంకేమీ అక్కర్లేని ఒకానొక అలౌకిక విద్యాపారమార్థిక పరవశం నారాయణ; చైతన్య.
రుబ్బుడు రోలు బట్టీ చదువులకు ఒక సామాజిక అంగీకారం సాధించిన వినూత్న విద్యా వ్యవస్థ నారాయణ; చైతన్య.
ప్రభుత్వ బడులు, కాలేజీలు అంటరానివిగా మనకు మనమే ముద్ర వేసి బూడిద చేసుకున్న వ్యామోహం నారాయణ; చైతన్య.
వేల, లక్షల కోట్ల ప్రయివేటు విద్యా వ్యాపార విజయ దుందుభి నారాయణ; చైతన్య.
ప్రభుత్వ విద్యావ్యవస్థలను కూకటివేళ్లతో పెకలించి బలపడ్డ మహా వట వృక్షాలు నారాయణ; చైతన్య.
కోళ్ల ఫారాల్లో బ్రాయిలర్ కోళ్లకు…నాలుగ్గోడల మధ్య చదివే పిల్లలకు అభేదం సాధించిన విద్యా అద్వైతం నారాయణ; చైతన్య.
ఇంటర్మీడియెట్ వరకు పిల్లలు నిత్యం చైతన్యంతో జపించాల్సిన విద్యా మంత్రం నారాయణ.
ఏటేటా…ఒకటి ఒకటి ఒకటి…అని రెండో మాటకు తావు లేకుండా వంద లోపు ర్యాంకులన్నీ గంపగుత్తగా దక్కించుకునే అవక్ర విక్రమ పరాక్రమ ఫలితాల గనులు నారాయణ; చైతన్య.
దేశమంతా విస్తరించి…ఇక అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికల్లో ఉన్న తెలుగింటి చదువుల ఫ్యాక్టరీలు నారాయణ; చైతన్య.
చిన్నా, చితకా ప్రయివేటు విద్యాసంస్థలకు ప్రాతః స్మరణీయమైనవి నారాయణ; చైతన్య.
మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ప్రకటనలు గుప్పించి నెగటివ్ వార్తలు రాకుండా మేనేజ్ చేసే విద్యలను ప్రయోగించే ఒడుపులకు పెట్టింది పేరు నారాయణ; చైతన్య.
అక్కడ నారాయణ.
ఇక్కడ నారాయణ.
అంతా నారాయణ.
అది నారాయణ.
ఇది నారాయణ.
సర్వం నారాయణ.
పడిపోయిన విద్యాప్రమాణాలను సమున్నతంగా నిలబెట్టిన ఒకానొక కారణజన్ముడు నారాయణ.
ఏది లీకు?
ఏది మాల్ ప్రాక్టీస్?
ఏది చిత్తూరు టాకీస్ వాట్సాప్ గ్రూపు?
ఏది హైటెక్ మాస్ కాపీయింగ్?
ఏది నీతి?
ఏది రీతి?
ఓ సరస్వతీ!
ఓ బృహస్పతీ!
ఏయ్!
ఎవర్రా అక్కడ?
నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు ఏమి సంబంధం?
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :