Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆధునిక తీర్థ ప్రసాదాలు

ఆధునిక తీర్థ ప్రసాదాలు

Bhakti with Burger: ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు వాలుతాయి. ఎక్కడ జనం ఎక్కువ ఉంటే అక్కడ హోటళ్లు వెలుస్తాయి. ఫుడ్ కోర్టులు పుట్టుకొస్తాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి.

నలభై, యాభై ఏళ్ల కిందటివరకు భారతదేశంలో ఆహారపుటలవాట్లు వేరు. ఇప్పుడు వేరు. ఊరు దాటి ప్రయాణించేవారు రొట్టెలు, పులిహోర, పెరుగన్నం, మరమరాలు, కారప్పూసలాంటివి వెంట తీసుకెళ్లేవారు. మర చెంబులో మంచి నీళ్లు తప్పనిసరి. ప్రాణం పోయినా పరవాలేదు కానీ…బయట ఎక్కడపడితే అక్కడ తినేవారు కాదు. ఇప్పుడు ప్రాణం పోయినా పరవాలేదు కానీ…బయటవే తింటున్నారు. ఇందులో మంచి-చెడ్డల చర్చకు ఇది సందర్భం కాదు.

దేశంలో తిరుపతి, షిర్డీ, వైష్ణో దేవి, అమృత్ సర్ స్వర్ణ దేవాలయం, కామాఖ్యాదేవి ఆలయం, అయోధ్యలకు రోజు భక్తులు వేల, లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఇలాంటి చోట్ల టిఫిన్లు, అన్నం, కాఫీ, టీ లకు విపరీతమయిన డిమాండు. సహజంగా పుణ్యక్షేత్రాల్లో కొంత సంప్రదాయ ఆహారం తీసుకోవడానికే భారతీయులు ఇష్టపడేవారు. ఇప్పుడు అభిరుచులు మారిపోయాయి. స్విగ్గి, జొమాటో, పిజ్జాల కొత్త తరం పుట్టి పెరుగుతోంది. పుణ్యక్షేత్రాల్లో కూడా పిల్లలు పెరుగన్నానికి బదులు పిజ్జా బర్గర్లు తినడానికే ఇష్టపడుతున్నారు. పిల్లలకు ఏది ఆరోగ్యకరమో అది పెట్టడం మరచిపోయిన తల్లిదండ్రులు, వారికి ఏది ఇష్టమో అదే పెడుతున్నారు. దాంతో నెమ్మదిగా పుణ్యక్షేత్రాల్లో కూడా పిజ్జా కార్నర్లు, బర్గర్ బంకులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి.

ఫాస్ట్ ఫుడ్ లో కూడా మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్, డొమినోస్, సబ్ వే, చాయ్ పాయింట్, కేఫ్ కాఫీ డే లాంటి బహుళజాతి కంపెనీలు, దేశీయంగా పెద్ద కంపెనీలదే పెద్ద వాటా. ఇన్ని దశాబ్దాలుగా పుణ్యక్షేత్రాలను పట్టించుకోకపోవడంతో తాము ఎంత నష్టపోయామో ఇప్పుడిప్పుడే ఈ కంపెనీలకు తెలిసి వస్తోంది. పరీక్షించి చూద్దామని పుణ్యక్షేత్రాల్లో అవుట్ లెట్లు పెడితే భక్తులు ఎగబడుతున్నారట. దాంతో మిగతా విస్తరణ ప్రణాళికలు పక్కన పెట్టి అర్జంటుగా పుణ్యక్షేత్రాల్లో తమ తమ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టేక్ అవే అవుట్ లెట్లు పెట్టడానికి ఈ కంపెనీలన్నీ వేల కోట్ల పెట్టుబడులతో క్యూ కడుతున్నాయి.

“రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు”

“చేసిన పాపము- చెడని పదార్థము”

“అధ్వాన్నం”

“దేవుడే ఇచ్చాడు ఫాస్ట్ ఫుడ్ వీధి ఒకటి”

లాంటి వేదాంత, వైరాగ్య, తాత్విక సామెతలు, పాటలు పాడుకుంటూ భక్తులు ఇకపై పుణ్యక్షేత్రాల్లో పిజ్జా ప్రసాదాలు, బర్గర్ తీర్థాలతో దర్శనమిస్తారు.

(ఇంగ్లీషు వ్యాపార దినపత్రిక ఎకనమిక్ టైమ్స్ వార్త ఆధారం)

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

కొవ్వుతో పెరిగే కోపం

Also Read :

ఆహారం – ఆరోగ్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్