Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅస్త్రాయ ఫట్ ఫట్ ఫట్ - వస్త్రాయ ఝట్ ఝట్ ఝట్

అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్ – వస్త్రాయ ఝట్ ఝట్ ఝట్

ఇప్పుడంటే మణిరత్నం ఇలా అయిపోయాడు కానీ, ఒక తరాన్ని ఉర్రూతలూపిన దర్శకుడు. గీతాంజలి సినిమాలో రేపోమాపో చావాల్సిన హీరో హీరోయిన్ ల మధ్య ఊటీ కొండల సాక్షిగా ప్రేమను పుట్టించి ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకెళ్లాడు. అందులో వేటూరి పాటలే పాటలు.

శ్మశానంలో సరదాగా అందరినీ భయపెట్టే హీరో ఇన్ కు అదే శ్మశానంలో హీరో చుక్కలు చూపిస్తాడు. ఆ సన్నివేశంలో వల్లకాట్లో పాట. క్షుద్ర పూజలు, క్షుద్ర దేవతల ఆవాహన, అభిచారీ హోమాల మంత్రాలు, వామాచార మంత్రాలన్నీ తెలిసిన వేటూరి ఈ పాటలో దయ్యాలను, వాటి పరిభాషను దించేశాడు.

నంది కొండ వాగుల్లోన
నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లో
సందెపొద్దు సీకట్లో
నీడల్లే వచ్చే…
ఊరేదో పేరేదో తెలియని దయ్యాలను, క్షుద్రదేవతలను మనం సహృదయంతో అర్థం చేసుకోవచ్చు.

కానీ,
ఏనాడో ఆరింది నావెలుగు
నీదరికే నా పరుగు
మోహినీ పిశాచి నా చెలిలే
శాకినీ విషూచి నా సఖిలే
భూతప్రేత పిశాచ భేతాళ ఢాకినీ తాటకి నా చుట్టాలు
అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్
వస్త్రాయ ఝట్ ఝట్ ఝట్
మసజసతతగ శార్దూలా. . .
అంటూ కేరళలో మాపై “శత్రు భైరవీ యాగం”(నేను తొలిసారి ఈ యాగం గురించి వింటున్నాను. పేరు భలే ముద్దుగా ఉంది. కొంచెం అగ్గువకు అయ్యేలా ఉంటే నేను కూడా చేయించాలి. నాకూ కొందరు శత్రువులున్నారు) చేయించారని బాధ్యతగల కర్ణాటక హోం మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డి కె శివకుమార్ ప్రకటించారు.

ఎవరి చెడు కోరి, ఏ వామాచార పద్ధతిలో ఎవరెవరు కేరళ ఆలయంలో పూజలు చేశారో డి కె శివకుమార్ కు తెలుసట. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాశనంతోపాటు సీ ఎం, తన చెడు కోరి ఈ తాంత్రిక పూజలు చేసినట్లు అన్ని ఆధారాలూ ఉన్నాయని ఆయన బహిరంగంగా మీడియాకు చెప్పారు. దేవుడిని నమ్మేవారున్నట్లే దయ్యాలను నమ్మేవారు కూడా ఉంటారన్నారు. తమను కాపాడే దేవుళ్లున్నారన్నారు. సంతోషం.

శత్రు భైరవీ యాగం గురించి వివరాలు గూగుల్లో లేవు. నాకు తెలిసిన క్షుద్ర పూజల నిపుణులను సంప్రదిస్తే- ఇలాంటి వివరాలు ఊరికే అడిగినా క్షుద్రదేవతలు యాక్టివేట్ అవుతారు కాబట్టి…అకెడెమిక్ డిబేట్ కూడా కుదరదన్నారు. రోజూ ఎన్నెన్నో క్షుద్రశక్తులతో వ్యవహారాలు నడుపుతున్నానని రుజువులు, ఆధారాలతో చెప్పడంతో పైపైన కొన్ని విషయాలు చెప్పారు.

“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం”

“తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!”
అన్న నవవిధ భక్తి మార్గాలు తెలిసినవే.

అలాగే క్షుద్రపూజల్లో తాంత్రిక వ్యవహారాలుంటాయి. చేతబడి, బాణామతి, చిల్లంగి లాంటి ఎన్నెన్నో ప్రాంతీయ పేర్లతో చేసే పూజల్లో నిజంగా ఆ విద్య లోతులు తెలిసి చేసేవారెందరో క్షద్రశక్తులకే తెలియాలి.

రాక్షసుల్లో విభీషణుడు, త్రిజట, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తిలాంటి గొప్పవారున్నట్లే…క్షద్రశక్తులనగానే అన్నీ చెడ్డవని ఒకేగాటన కట్టేయాల్సినపనిలేదు. క్షుద్రదేవతలు వారికి వారుగా మనమీద పడరు. మనవైపు చూడను కూడా చూడరు. సాధారణంగా జనజీవనస్రవంతికి దూరంగా వారి మానాన వారు అదృశ్య రూపాల్లో సంచరిస్తూ ఉంటారు. దేవుడు ప్రత్యక్షమైతే తప్పనిసరిగా వరమివ్వాలని నిబంధన ఉంది. అలాగే క్షుద్రదేవతలను ఆహ్వానించినా…యంత్రాలు వేసి…అప్రదక్షిణంగా ముగ్గు పోసి…పిండి బొమ్మ చేసి…మిరపకాయలు, నిమ్మకాయలు, బొగ్గు ముక్కలు పెట్టి...జంతు బలులు ఇచ్చి…ఆభిచారిక హోమాలు చేసి…ఆవాహన చేశాక…ఆ క్షుద్రదేవతలు తప్పనిసరిగా చెడు చేసి పెట్టాలనే నిబంధన ఉంది.

ఉదాహరణకు ఒక శత్రువు కాలు విరగాలి అని క్షుద్రదేవతను కోరాలంటే హోమంలో పిండి బొమ్మ కాలు విరిచి వేయాలి. ఆ కాలిని తిన్న దేవత శత్రువు కాలును తీసేస్తుంది.

ఎక్కువగా క్షుద్రదేవతలే ఉంటారెందుకో! ఇది మహిళను అవమానించడమో! గౌరవించడమో! క్షుద్రారాధన చేసేది పురుషులే అయినా అనాదిగా క్షుద్రదేవుళ్ళలో పురుషులు మాత్రం దుర్భిణీ వేసి వెతికినా ఒకరు ఇద్దరు తప్ప దొరకడం లేదు.

మనం చాలాసార్లు మనుషులతో మాట్లాడుతున్నామనుకుని హాయిగా దయ్యలతో మాట్లాడుతూ ఉంటాం. దయ్యాలంటే భయం నటిస్తాము కానీ…మనలో దయాన్ని తట్టి నిద్రలేపుతూనే ఉంటాం. దేవుళ్లను పుజిస్తున్నామనుకుంటూ దేవుళ్లేకాని ఎందరో క్షుద్రదేవతలను పూజిస్తూ ఉంటాం. వీధికొక క్షుద్రదేవుడు పుట్టుకొస్తుంటే విసుగు విరామం లేకుండా వారి చుట్టూ పొర్లు దండాలు పెడుతూ ఉంటాం.

ఫలాపశ్రుతి/ ఫలశ్రుతి:
ప్రత్యర్థుల మీద దాడులు, బాంబులు, కర్రలు, తుపాకులు; కిడ్నాపులు, మర్డర్లు, కేసులు, కోర్టులు, కండ బలం, అంగబలం, అర్థబలంలాంటి అనేక వ్యయప్రయాసలతో పోలిస్తే…ఎక్కడో ఒక మూలన శత్రు భైరవీ యాగంలో పిండి బొమ్మ మెడ విరిచేయడం ఏ రకంగా చూసినా చాలా మెరుగైన, ప్రశాంతమైన, సులువైన, ఖర్చు తక్కువ ప్రత్యామ్నాయం!

డిస్ క్లైమర్:
తమపై కేరళలో శత్రు భైరవీ యాగం చేయించారని డి కె శివకుమార్ చెప్పిన విషయం తప్ప ఇందులో పేర్కొన్న ఏ క్షుద్ర విషయమూ నిజం కాదు! నేనెవరినీ అడగనూ లేదు. నాకేమీ తెలియనూ తెలియదు. క్షుద్రజ్ఞానం మీద నాకణుమాత్రం ఆసక్తి కూడా లేదు.

మనలో భయమే- దయ్యం.
మనలో ధైర్యమే- దైవం.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్