DLF Considering Rental Waiver for Retailers :
కరోనా వల్ల ఒక సంవత్సర కాలంలో మన దేశం ఎంత నష్టపోయి ఉంటుంది అని ప్రశ్నించుకుంటే లెక్క పెట్టలేనన్ని సున్నాల సంఖ్యతో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. లేదా ఆత్మ నిర్భర్ అభియాన్ లో దాగిన ఇరవై లక్షల కోట్ల రూపాయల నష్టం అని ఉజ్జాయింపుగా అనుకుంటే సున్నాలేమి పెద్దగా ఫీల్ కావు. ప్రభుత్వం పూడ్చదలుచుకున్న నష్టమది.
ప్రయివేటు నష్టం దానికి మూడింతలు వేసుకుంటే- మొత్తం మీద కరోనా మనకు కలిగించిన నష్టం దాదాపు కోటి కోట్లు. సంఖ్య పెరిగే కొద్దీ సున్నాలు వేసుకుంటూ పోవడమే. సున్నాల్లో శూన్యం ఉంటుంది. సున్నాకు శూన్యం పర్యాయపదం.
గోడకు కొట్టిన సున్నంలా, కొన్ని సున్నాలు అలా పడి ఉంటాయి. చూడ్డానికి తప్ప వాడుకోవడానికి పనికిరావు. ఏయే రంగానికి ఎంత నష్టం? అని విడి విడిగా లెక్కలు వేసుకుంటే విడి విడిగా, కలివిడిగా ఏడవడానికి పనికి వస్తుంది కానీ- నష్టం పూడ్చుకోవడానికి ఏ మాత్రం ఉపయోగపడదు.
గడచిన ఏడు మొదటి లాక్ డౌన్ కొట్టిన దెబ్బ నుండి కోలుకోక ముందే రెండో లాక్ డౌన్ కూడా వచ్చేసింది. సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి.
మహా నగరాల్లో లక్షల చదరపు అడుగుల్లో, బహుళ అంతస్థుల్లో, అద్దాల గదుల్లో, అతి శీతల వాతావరణంలో అతి పెద్ద మాల్స్ వాటికవిగా మరో లోకాలు. అలాంటి అతి పెద్ద మాల్స్ నిర్వహించడంలో డి ఎల్ ఎఫ్ కంపెనీది అందె వేసిన చేయి. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో డి ఎల్ ఎఫ్ కు మాల్స్ ఉన్నాయి. ఆ మాల్స్ లో వేల సంఖ్యలో రీటైల్ వ్యాపారం చేసుకునేవారు దుకాణాలను అద్దెలకు తీసుకుంటూ ఉంటారు.
మొదటి విడత లాక్ డౌన్ అప్పుడు ఎలాంటి వ్యాపారం జరగక ఇబ్బంది పడుతున్న రీటైల్ దుకాణదారులు అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే – డి ఎల్ ఎఫ్ ఉదారంగా ముందుకు వచ్చి లాక్ డౌన్ సమయానికి అద్దె తీసుకోలేదు. ఈసారి లాక్ డౌన్ సమయానికి కూడా అద్దె చెల్లించక్కర్లేకుండా దుకాణదారులకు ఉపశమనం కలిగిస్తోంది. మాల్స్ ను నిర్వహించే మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇలాగే దుకాణదారులకు లాక్ డౌన్ వేళ అద్దె మినహాయింపు ఇస్తే బాగుంటుందని డి ఎల్ ఎఫ్ కోరుతోంది.
లక్షల కోట్ల వ్యాపారం చేసే పెద్ద పెద్ద కంపెనీలు ఈమాత్రం ఔదార్యంగా ఉంటే మంచిదే. మిగతా కంపెనీలు కూడా ఇలాగే ఎంతో కొంత ఊరటను ఇవ్వాలి. కష్టంలో ఉన్నవారికి ఏ చిన్న సాయమయినా కారు చీకట్లో కాంతి రేఖ.
“గోరంత దీపం… కొండంత వెలుగు
చిగురంత ఆశ… జగమంత వెలుగు
కరిమబ్బులు కమ్మే వేళ.. మెరుపు తీగే వెలుగూ
కారు చీకటి ముసిరే వేళ.. వేగు చుక్కే వెలుగు”
-పమిడికాల్వ మధుసూదన్
Must Read : తమిళనాడులో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు