Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపేరుగొప్ప ప్రజాస్వామ్యం

పేరుగొప్ప ప్రజాస్వామ్యం

విలేఖరి:-
సార్! కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్లో అధికారికంగా ప్రకటించిన లిస్ట్ లో మీ కంపెనీ అన్ని పార్టీలకు వేల కోట్ల విరాళాలిచ్చినట్లు ఈరోజు పేపర్లలో మొదటి పేజీ వార్తలొచ్చాయి. టీ వీ ల నిండా ఇవే చర్చలు. దీనిమీద మీ స్పందన ఏమిటి?

బడా పారిశ్రామికవేత్త:-
జర్నలిజం ప్రమాణాలు బాగా పడిపోయినందుకు నేను విచారం వ్యక్తం చేస్తూ…రెండు నిముషాలు మౌనంగా ఉండి…తరువాత నా సమాధానం చెప్తాను.

వి:-
అలాగే అఘోరించండి(స్వగతంలో)

బ. పా:-
(రెండు నిముషాల మౌనం)
నేను ఏ పార్టీకి విరాళం ఇవ్వలేదు. అవి ఎన్నికల బాండ్లు. ఆయా పార్టీలతో మా కంపెనీకున్న బాండింగ్ వల్ల ప్రతీకాత్మకంగా ఉంటుందని ఎలెక్టోరల్ బాండ్లు కొన్నాము.

వి:-
పేరేదైనా ఇచ్చింది మీ డబ్బే. తీసుకున్నది వారే. అప్పుడది విరాళమే కదా అవుతుంది?

బ. పా:-
మీరు రాజ్యాంగంలోని మౌలికమైన విషయాల్లో ఉన్న సున్నితమైన వైరుధ్యాలను సరిగ్గా పట్టుకున్నట్లు లేరు. అందుకే నేను త్వరలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జర్నలిజం కాలేజీ పెట్టాలనుకుంటున్నాను.

నేను విరాళమివ్వలేదు. ఇవ్వను. ఇవ్వబోను. ఎలెక్టోరల్ బాండ్లు కొన్నాను. అంతే. ఇవ్వడం; కొనడం రెండూ పరస్పర వైరుధ్యమైన క్రియాపదాలు. మీకు జర్నలిజం తెలుగులో చిన్నయసూరి వ్యాకరణం క్రియా పరిచ్చేదం చెప్పలేదా? ఇస్తే తీసుకోవడం ఉంటుంది. కొంటే అమ్మకం ఉంటుంది. వ్యాపారంలో కొనుగోలు- అమ్మకాలే కీలకం.

వి:-
మాకు జర్నలిజంలో చిన్నయసూరి బాలవ్యాకరణం తరువాత, బహుజనపల్లి సీతారామాచార్యులవారి ప్రౌఢవ్యాకరణం కూడా చెప్పారు. అందులో మాటలమధ్య మడతపెట్టి మీలాంటివారు అసలు విషయం దాచినప్పుడు…ధ్వనిని ఎలా పట్టుకోవాలో? అంతరార్థాన్ని ఎలా పిండుకోవాలో? కూడా చెప్పారు. నేనడిగినదానికి సమాధానం చెప్పండి చాలు.

బ. పా:-
మీ ఓనర్ నాకు కాబోయే వియ్యంకుడు. నీ గట్స్ టెస్ట్ చేశా అంతే. జర్నలిస్టులంటే నాకు చిన్నప్పటినుండి అపారమైన గౌరవం.

నిజానికి- ఇది మాకే కాదు…తెలుగువారందరికీ గర్వకారణం. దేశంలో ఇన్నిన్ని బడా కంపెనీలుండగా ఒక తెలుగు కంపెనీ ఇన్నిన్ని పార్టీలకు అత్యధికంగా విరాళాలిచ్చి వరుసగా అయిదేళ్లు అగ్రస్థానంలో నిలవడం…ఆ కంపెనీ నాది కావడం…నా పూర్వజన్మల పుణ్యఫలం. ఇది తెలుగు వారందరికీ దక్కిన అరుదైన గౌరవం. అపురూపమైన మర్యాద. సమున్నత ప్రతిష్ఠ.

వచ్చే ఐదేళ్లు కూడా దేశంలో అన్ని పార్టీలకు అత్యధికంగా విరాళాలివ్వబోయే కంపెనీల లిస్ట్ లో మా కంపెనీనే మొదటి స్థానంలో ఉండాలని భగవంతుడిని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను.

మా పెద్ద కోడలు “ప్రజాస్వామ్యంలో పేదరికం” అన్న అంశంపై అప్పుడప్పుడు రాసిన వ్యాసాలను ఇంగ్లీషులోకి అనువదించి...”poorness in the democracy” అన్న పేరుతో మొదటి విడతగా లక్ష కాపీలు ముద్రించాము. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మా ఇంటికొచ్చిన రోజున ఆ పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది.

నువ్ తెలుగు మీడియం కదా! ఇదిగో తెలుగు బుక్. చదువుకో!

ఇంకేమన్నా ప్రశ్నలున్నాయా?

వి:-
…లేనే లేవు సార్. మా ఓనర్ మీ కాబోయే వియ్యంకుడన్నాక ప్రశ్నలన్నీ సమాధానాలే. సమాధానాలన్నీ నాకు అడగకూడని ప్రశ్నలే. మీ ఇంటి గడప దాటాక నాకు నేనే సమాధానం లేని ఒక ప్రశ్నను. పూర్నెస్ ఇన్ ది డెమోక్రసిలో నా ఉనికిని నేనే రద్దు చేసుకునే ఒకానొక బాధ్యతగల పౌరుడిని!

బ. పా:-
ఏయ్! సెగట్రీ!
కత్తిలాంటి జర్నలిస్ట్ ఇతను. వెంటనే సారం గ్రహించాడు. అంతులేని ఆత్మజ్ఞానం ఉన్నవాడు. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడన్న అనితరసాధ్యమైన సూత్రాన్ని నమ్ముకుని తలవంచుకుని వెళ్లిపోయేవాడు. మన మీడియా బిజినెస్ కు ఇలాంటివారే కావాలి. గుర్తు పెట్టుకో!

సెగట్రీ:-
సార్! మీరు దేవుడు సార్. లోకం పట్ల మీ అపార కృపా పారావార కరుణా రస ధారల మీద నవీన కరుణధారా స్తోత్రం రాయిస్తాను సార్. వెంటనే రాయిస్తాను సార్!

బ. పా:-
అలాగే. మంచి ఐడియా. అన్ని భాషల్లో డబ్ చేసుకోవడానికి వీలుగా రాయించు. ప్రొఫెషనల్ గా మన స్థాయికి తగినట్లు ఉండాలి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్