Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంటీకాకు దొరకని టీకా తాత్పర్యం

టీకాకు దొరకని టీకా తాత్పర్యం

పద్యాలను, శ్లోకాలను- టీకా, తాత్పర్యం, ప్రతిపదార్థాలతో అన్వయించుకోవాలి. క్రియా పదం ఎక్కడుందో పసిగట్టాలి. సంబోధన ఎక్కడున్నా మొదటికి తెచ్చుకోవాలి. భాషా భాగాలను గమనించాలి. ఇంకా లోతుగా వెళ్లదలుచుకుంటే ఛందస్సు, యతి ప్రాసలు, అలంకారాల్లోకి వెళ్లాలి. ఇదంతా వ్యాకరణ వ్యవహారం. ఇంత జరిగితేనే పద్యం మనకు అవగాహన అయినట్లు. పద్యంలో ప్రతి పదానికి అదే వరుసలో అర్థం చెబితే- ప్రతిపదార్థం. సంగ్రహంగా పద్యభావం చెబితే- టిప్పణి. కఠినమయిన పదాలకు మాత్రమే అర్థం చెబితే టుప్ టీకా. సంగ్రహంగా అర్థం చెబితే టీకా. సంస్కృత నిఘంటువుల ప్రకారం టీకా, టిప్పణి పర్యాయపదాలు; ఈ మాటలకు వ్యాఖ్యానం అని అర్థం. మొత్తం పద్యభావం చెబితే తాత్పర్యం. పద్యంలో దాగి ఉన్న అంతరార్థంతో సహా విడమరచి చెబితే విశేష వ్యాఖ్యానం. అర్థం- భావం ఒకేలా అనిపించినా ఒకటి కావు. ఇదివరకు పద్య కావ్యాల టైటిల్ కింద “టీక తాత్పర్యసహిత వ్యాఖ్యానంతో” అని ఉండేది. ఆ టీక సంస్కృత పదం. ఇంతకంటే లోతుగా వెళితే వాక్కు-అర్థ-భావాలు భయపెట్టే ప్రమాదముంటుంది.

మాతృ భాషకు బతికి ఉండగానే పాడె కట్టి మృతభాషగా కొరివి పెట్టుకున్నాం కాబట్టి పద్యం టీకల గురించి ఇప్పటి తరానికి తెలిసే అవకాశం లేదు. గూగుల్లో ఉన్నదే జ్ఞానం అన్న గుడ్డి డిజిటల్ టీకా తాత్పర్యం నరనరాన జీర్ణించుకుపోయింది కాబట్టి- గూగుల్లో లేనిది ఎక్కడా లేనట్లే. గూగుల్ చెప్పనిదానికి నమ్మిక కూడా తక్కువ.

ఇప్పుడు టీకా అంటే వ్యాక్సిన్ ఒక్కటే. తెలుగులో టీకాలు వేసుకోవాలి. హిందీలో చక్కగా భావార్థకం చేసి టీకాకరణ్ అని ఒకే మాటను కాయిన్ చేసుకున్నారు. కరోనా ముందు ఏ వ్యాకరణానికి విలువ ఉండదు. సకల భాషల వ్యాకరణాల భావార్థకాలు కరోనాకు ఆరడుగుల భౌతిక దూరంలో భౌతికంగా, భారంగా, సిగ్గుతో తలవంచుకుని కళ్లకు, చెవులకు కూడా మాస్కు పెట్టుకుని మౌనంగా ఉండాల్సిందే.

టీకాలకు టీకా తాత్పర్యం చెప్పే ప్రయత్నం చేస్తే బాల్కనీల్లో కొవ్వొత్తులు ఆరిపోతాయి. చేతులమధ్య చప్పట్లు మౌనంగా జారిపోతాయి. సిలిండర్లలో ఆక్సిజన్ ఆవిరవుతుంది. ఐ సి యూ వెంటిలేటర్ల మీద ఏకాంతం మృత్యువుతో కుమ్మక్కయి రహస్యంగా చేతులు కలుపుతుంది. పరమ పాజిటివ్ భయంకర నెగటివ్ అయి భయపెడుతుంది. ఐసొలేషన్ అంటరానితనం అడ్డుగోడలుగా మొలుస్తాయి.

టీకా/టిప్పణి ఎన్ని రకాలుగా చేయవచ్చో పండితుల వ్యవహారం. కరోనా టీకాలు ప్రయివేటు వ్యవహారం. టీకాలు చేయించడంలో, సరఫరా చేయడంలో, జనానికి ఇవ్వడంలో కేంద్రం కేంద్రీకృత కృతక నిస్సహాయతకు టీకా తాత్పర్యాన్ని సర్వోన్నత న్యాయస్థానమే తీవ్రశ్రుతిలో చెప్పింది కాబట్టి మనం దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు.

మొదటి టీకాకు రెండో టీకాకు నెల తిరక్కుండానే రేటు ఐదింతలు పెరగడానికి టీకా తాత్పర్యం చెప్పగలిగిన మొనగాళ్లు లేరు. స్వదేశీ టీకా పేద విదేశాలకు ఉదారంగా బట్వాడా అయినప్పుడు- విదేశీ టీకాలు స్వదేశంలోకి ఎందుకు దిగుమతి కాకూడదో టీకా తాత్పర్యం చెప్పే విజ్ఞులు లేరు. ఒక టీకా కోటి ప్రశ్నలుగా మ్యుటేషన్ల ఉత్పరివర్తనం చెందుతుంటే రాజకీయ ప్రవర్తనలో రుజువర్తనను ప్రశ్నించే గొంతుకలకు చోటు లేదు.

ప్రయివేటు టీకా కేంద్రీకృత కేంద్రం చేతిలోకి వెళ్లి- ప్రభుత్వ టీకాగా పరివర్తన చెంది, రాష్ట్రాలకు ఉచితంగా వచ్చి, గుచ్చుకోవాల్సిన భుజాలకు గుచ్చుకోవడానికి కాలము- దూరము; ప్రాణము- మానము లెక్కలు వేసుకుని ప్రయోజనం లేదు. ల్యాబ్ లో ఉంటే టీకా పరిశోధన. ల్యాబ్ దాటితే ఉత్పత్తి వేదన. మార్కెట్లోకి వస్తే లాభనష్టాల సంవేదన. రాజకీయం చేతుల్లోకి వెళితే విమర్శ- ప్రతి విమర్శల సుడిగాలుల జడివాన. ఆన్ లైన్లో కోవిన్ గా ఎన్రోల్ సంశోధన. టీకా కోసం కళ్లల్లో వత్తులు వేసుకుంటే నిరీక్షణ. దొరక్కపోతే రోదన. టీకా దానికదిగా ఒక సాధన. తాత్వికంగా సత్యశోధన. వేదాంతంగా నిత్యవేదన.

పోనీలే!
ఇన్నాళ్లకయినా జరగాల్సింది జరిగిందని బతుకు టీకాకు టీకా తాత్పర్యం వెతుక్కుని సర్దుకుపోవడమే సగటు భారతీయుడు చేయాల్సిన పని.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్