Tuesday, April 15, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరాయని భాస్కరులు

రాయని భాస్కరులు

ఆధ్యాత్మికం, భాష, సాహిత్యం, జర్నలిజం చదువులకు, వృత్తులకు సంబంధంలేని ఇతర వృత్తుల్లో ఉంటూ పండితులకంటే లోతైన అవగాహన, అన్వయ జ్ఞానం ఉన్నవారెందరో ఉంటారు. అలాంటివారి ప్రస్తావన ఇది. పాఠకులుగా తమను తాము పరిచయం చేసుకుని వారు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు పాఠాలు నేర్పుతున్నట్లు ఉంటుంది. ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి.

మెదక్ శ్రీను (94913 29737) ఇన్సూరెన్స్ ఏజెంట్. వయసులో చాలా చిన్నవాడు. రెక్కల కష్టంతో సంసార సాగరాన్ని ఈదుతున్నవాడు. కొన్నేళ్ళక్రితం పరిచయమయ్యాడు. ఆధ్యాత్మిక, వేదాంత విషయాలు అతను తనకు తెలిసిన భాషలో అద్భుతంగా చెబుతూ ఉంటాడు. ప్రతి విషయం మీద అతడికి స్పష్టమైన అభిప్రాయం ఉంటుంది. నేను మీలా చదువుకోలేదు సార్! అంటూ అతను నా రాతలమీద సమీక్ష చేస్తున్నప్పుడు నాకు భయంగా కూడా ఉంటుంది. అంత లోతైన అవగాహన అతడిది. నాకు మీలెక్క చెప్పొస్త లేదు…అంటూనే చాలా చక్కగా చెప్తాడు. ఒక్కో విషయం మీద అతడి మాటలు రాస్తే ఒక్కో సంపాదకీయమవుతుంది.

సదాశివపేట మున్నూరు నాగరాజుది (99489 35484) అసాధారణమైన విజయగాథ. శిథిలాలనుండి శిఖరాలకు ఎదిగినవాడు. ప్రతిరోజూ నా రాతలమీద నిష్పాక్షికమైన సమీక్ష రాసి నాకు వ్యక్తిగతంగా పంపుతూ ఉంటాడు.

హైదరాబాద్ మొయినాబాద్ దగ్గర కనకమామిడి చిన్న పల్లె. ఫైబర్ కేబుల్ ఇంటర్నెట్ పనుల్లో ఉన్న శ్రీను (97012 41994) చిరుద్యోగి. ముప్పయ్ దాటని యువకుడు. ప్రాపంచిక విషయాలు ప్రత్యేకించి ఆధ్యాత్మిక విషయాలమీద అతడి జ్ఞానం నాకు పులకింతలా ఉంటుంది.

హైదరాబాద్ శివారు శంకర్ పల్లి వాసి కరుణాకర్ రెడ్డి (99126 64114) తనను తాను టాక్సీ డ్రయివర్ గా ఒకరోజు పరిచయం చేసుకున్నాడు. ఆరునెలలకొకసారి ఫోన్ చేస్తుంటాడు. ఆ ఆరునెలల్లో నేను రాసిన వ్యాసాల్లో గుణదోషాల గురించి మాట్లాడతాడు. అంత జ్ఞాపకశక్తి, ఒక్కో విషయం మీద అంతటి అవగాహన నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పురాణాల్లో మూసీ నది ప్రాశస్త్యం గురించి నేను రాసినప్పుడు మా ఊరిపక్క నది సార్! అంటూ పొంగిపోయాడు. మూసీని రియలెస్టేట్ ఎలా ముంచేసిందో కళ్ళకు కట్టినట్లు వివరించాడు.

శోభారాణి అని ఒక పెద్దావిడ. సంగీత, సాహిత్యాల్లో చాలా లోతైన అవగాహన ఉన్నట్లుంది. నేను రాయలేకపోయిన విషయాలను ఎలా రాస్తే బాగుంటుందో ఆమె రాసి నాకు పంపుతుంటారు. అత్యంత తేలికైన పదాలతో, చిన్న చిన్న వాక్యాలతో ఆమె రచనా శైలికి నేను ఉక్కిరిబిక్కిరి అవుతుంటాను. నేను పది పేరాల్లో చెప్పినదాన్ని ఆమె ఒక్క పేరాలో అద్భుతంగా చెప్తారు. ఇలా రాయలేకపోయానే అని ప్రతిసారీ నన్ను నేను తిట్టుకుంటూ ఉంటాను.

ప్రొద్దుటూరు ఇంద్రాణి తెలుగు, ఇంగ్లీషుకు నేను పెద్ద ఫ్యాన్. ఆమె సాధారణ గృహిణి. కానీ ఆమెకు తెలియని విషయం లేదు. రాసే ప్రతిమాటలో ముత్యాలు, పగడాలు కూర్చినట్లు రాస్తారామె. వేదాంత ధోరణిలో ఆమె రాసే మాటల్లో దొర్లే పంచ్ డైలాగులను నేను తరువాత ఎప్పుడైనా, ఎక్కడైనా వాడుకుంటూ ఉంటాను.

బెంగళూరు చార్టెడ్ అకౌంటెంట్ నాగేంద్ర (98800 29927) తెలుగు భాషాభిమానం, భావ వ్యక్తీకరణ ముందు నేను పిపీలికం.

కాగజ్ నగర్ శ్రీనివాస్ (94403 81220) తనకేమీ తెలియదంటూ…రోజూ నాకు ఎన్నెన్నో తెలుగు సాహిత్యం సంగతులు పంపుతూ ఉంటాడు.

ఐ టీ ఉద్యోగుల హెడ్ గా నిత్యం బిజీగా ఉండే హైదరాబాద్ తిరుమల్ పాటిల్ (99890 83323) విషయపరిజ్ఞానం ముందు నేను నిత్యవిద్యార్థిని. ఆఫ్రికా మైనింగ్ ఉద్యోగి సురేంద్ర నుండి సందేశం వస్తే తెలుగు వెలుగే. మాంచెస్టర్లో స్థిరపడ్డ మహేష్ తెలుగు సంగతులు అన్నీ ఇన్నీ కావు. లండన్లో స్థిరపడ్డ సురేంద్ర నాతో ప్రేమగా గొడవపడుతూ ఉంటాడు- మీ తెలుగును ఇంకా బాగా డైల్యూట్ చేయాలి సార్ అని. సైనికుడిగా పనిచేసి…ప్రస్తుతం విశాఖలో బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న విజయనగరవాసి కిలపర్తి త్రినాథ్ (94408 86844) నా ప్రతిరాతలో గుణదోషాల సమీక్ష చేస్తుంటారు. దుబాయ్ లో స్థిరపడ్డ కడపవాసి ప్రతాప్ రెడ్డి అన్నమయ్య సాహిత్యం మీద తన అభిప్రాయాలను ఆడియో రికార్డ్ చేసి నాకు పంపుతూ ఉంటాడు. నేను చదువుకున్నవాడిని కాను సార్…తప్పులుంటే సరిచేయగలరు…అంటాడు. అతడి భాషకు, భావానికి, కడప మాండలికంలో వేదాంత విషయాలను అలవోకగా చెప్పే పద్ధతికి నేను దాసోహం.

కొస మెరుపు:-
తాడిపత్రి జె సి ప్రభాకర్ రెడ్డి జగమెరిగినవాడు. నేను రాసే ఆధ్యాత్మిక, భాషా విషయాలమీద జె సి నాకు ఫోన్ చేస్తే…కనీసం గంట చర్చ ఉంటుంది. బయట ప్రపంచానికి ఆయన ఏమైనా కావచ్చు. నావరకు ఉత్తమ పాఠకుడు. విమర్శకుడు. “దీనిమీద ఇట్లా రాయి స్వామీ!” అని నాకు ఇన్ పుట్స్ ఇస్తుంటాడు.

ఇలా ఎందరో మహానుభావులు. ఇందులో ఒకరిద్దరిని తప్ప మిగతావారిని ఎప్పుడూ కలవలేదు. ఫోన్ పరిచయమే. కొందరి ఫోన్ నంబర్లు ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదు. ఈ పద్దులో ప్రస్తావించాల్సినవారు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ అందరి పేర్లూ బయటపెట్టడం భావ్యం కాదు.

ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతూ ఉంటుంది.
నిండు కుండ తొణకదు.
ముఖే ముఖే సరస్వతి.
ఏ చిన్ని విత్తనంలో ఏ మాహావటవృక్షపు వేళ్ళున్నాయో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్