ఆకాశమంత ఎత్తున.. ధైర్యానికి నిలువుటద్దంలా నిలిచిన ఆ రూపం ఇప్పుడు కుంచించుకుపోతోంది. విజయనగర సామ్రాజ్య వైభవానికి సాక్ష్యంగా, శతాబ్దాల కాలపు దెబ్బలను తట్టుకుని నిలబడిన ఆ ‘ఉగ్ర నరసింహుడు’ ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. కాకపోతే, ఆ కన్నీళ్లు మన కళ్లకు కనిపించడం లేదు.. ఆ శిల్పం రాలిపోతున్న తీరులో, ఆ రంగు వెలిసిపోతున్న వైనంలో వేదన దాగి ఉంది. హంపి శిలలు మాట్లాడతాయని అంటారు.. కానీ ఈ రోజు ఆ శిల మూగబోయి మౌనంగా రోదిస్తోంది.
శతాబ్దాల వైభవం.. ఇప్పుడు శిథిల ఛాయలు
1528లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో రూపుదిద్దుకున్న ఆ ఏకశిలా అద్భుతం, సుమారు 500 ఏళ్లుగా ఎండకు ఎండి, వానకు తడిసి మన చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పింది. యోగ ముద్రలో, లక్ష్మీదేవిని ఒడిలో కూర్చోబెట్టుకున్న ఆ స్వామిని చూడడం దానికదిగా ఒక యోగం. విజయనగరరాజ్య పతనానంతరం హంపీని ధ్వంసం చేసిన శత్రుసైన్యాలు ఈ విగ్రహం ఒడిలో లక్ష్మీదేవిని ధ్వంసం చేసినా, ఆ నరసింహుడి గాంభీర్యం మాత్రం తగ్గలేదు. కానీ, ఇప్పుడు ఆ గాంభీర్యం వెనుక ఒక నిస్సహాయత కనిపిస్తోంది. గాలిలో కలిసిపోతున్న రంగులు, బీటలువారుతున్న విగ్రహం శిల.. మన నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా మారుతున్నాయి.

మూడు దశాబ్దాల క్రితం నాటి గాయం.. మళ్లీ పచ్చిగా!
1992లో భారత పురావస్తు శాఖ (ASI) ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. శిథిలమవుతున్న ఆ విగ్రహాన్ని రక్షించడానికి శాస్త్రీయంగా పునరుద్ధరణ పనులు చేపట్టింది. అప్పట్లో ఈ రంగంలో నిపుణులైన ఎస్.ఎం. జాన్, డి. హుస్సేన్ లాంటివారు తమ రక్తాన్ని ధారబోసి, రాతి పొడిని, రసాయనాలను కలిపి ఆ విగ్రహానికి ప్రాణం పోశారు. అప్పట్లో ఆ రసాయనాల కాలపరిమితి 20 ఏళ్లే అని వారు చెప్పారు. కానీ, ఆ గడువు ముగిసి పద్నాలుగేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు ఆ రసాయనాల ప్రభావం రియాక్షన్ ఇస్తూ, విగ్రహంపై కొత్త పగుళ్లు తెప్పిస్తున్నాయి.
సామాన్యుడి బాధ
హంపికి వెళ్లే ప్రతి పర్యాటకుడు పదేళ్ల క్రితం చూసిన విగ్రహానికి, ఇప్పటి విగ్రహానికి ఉన్న తేడాను గమనిస్తున్నాడు. ఫోటోలలో మెరిసిపోయే ఆ నరసింహుడు, ఇప్పుడు జీవం కోల్పోయినట్టుగా ఎందుకు కనిపిస్తున్నాడనేది ప్రతి భక్తుడి ఆవేదన. సామాన్యుడికి కనిపిస్తున్న ఈ ‘మౌన రోదన’ పురావస్తు శాఖ అధికారులకు, చారిత్రక పరిశోధకులకు ఎందుకు కనిపించడం లేదు? ఇది అధికారుల ఉదాసీనతా? లేక మన వారసత్వం పట్ల మనకున్న నిర్లక్ష్యమా?

ఒక్కరు మాత్రమే మిగిలారు.. ఆ అనుభవాన్ని వాడుకుందామా?
అప్పట్లో ఆ విగ్రహ పునరుద్ధరణలో పాలుపంచుకున్న నిపుణులలో ఇప్పుడు మన మధ్య ఉన్నది ఒక్క డి. హుస్సేన్ మాత్రమే. ఆ విగ్రహంలో ఏ భాగానికి ఏ చికిత్స అవసరమో, ఏ రసాయనం ఏ రంగును పులుముకోవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. “నరసింహుడు మళ్లీ నవ్వాలి.. పగుళ్లు లేని రూపంతో మురిపించాలి” అని ఆయన పడుతున్న తపన చూస్తుంటే బాధగా ఉంటుంది.
హంపి అంటే కేవలం రాళ్లు కావు.. ఒక వైభవోజ్వల గతానికి ఆనవాళ్ళు. ఆ ఉగ్రనరసింహుడు కేవలం ఒక విగ్రహం కాదు.. అది ఒక జాతి ఆధ్యాత్మిక. సాంస్కృతిక ఆత్మగౌరవం. మనం స్పందించకపోతే, రేపటి తరానికి కేవలం ఒక ‘శిథిల గుట్ట’ మాత్రమే మిగులుతుంది. ప్రభుత్వ యంత్రాంగం నిద్ర మేల్కోవాలి. పురావస్తు శాఖ ఆ ‘మౌన రోదన’ను ఆలకించాలి. మన వారసత్వాన్ని గుండెలకు హత్తుకోవాలి.

(ఇందులో ప్రస్తావించిన హుసేన్ ప్రస్తుతం హంపీ యూనివర్సిటీలో టెక్నికల్ అసిస్టెంట్. కొన్ని దశాబ్దాలక్రితం హంపీ పురావస్తుశాఖ తవ్వకాల బృందంలో ఆయన పనిచేశారు. ఐ ధాత్రిలో హంపీ వ్యాసాల ధారావాహిక రాసినప్పుడు నాకు పరిచయమయ్యారు. హంపీ శిలల వైభవాన్ని పరిరక్షించడానికి ఆయన పడే తపనకు ప్రోత్సాహంగా…హంపీ టైమ్స్ కన్నడ పత్రికలో ప్రచురితమైన ఎం ఎం శివప్రకాష్ వ్యాసం ఆధారంగా రాసిన కథనమిది. రచయితకు, హంపీ టైమ్స్ పత్రికకు, హంపీ విశేషాలను నిరంతరం నాకు పంపుతున్న హుసేన్ గారికి కృతఙ్ఞతలు)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

