Jai Bolo Ganesh Maharaj ki:
“దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా!దయుంచయ్యా దేవా!
నీ అండాదండా ఉండాలయ్యా!
చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా!
తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా!
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా?లంబోదరా!
పాపం కొండంత నీ పెనుభారం!
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
ఓ.. హో హో జన్మ ధన్యం
అంబారిగా ఉండగల ఇంతటి వరం.. అయ్యోర అయ్య
అంబాసుతా ఎందరికి లభించురా?
అయ్యోర అయ్య!
ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా!
శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
ఎక్కిన మదం దిగిందిగా! తగిన ఫలం దక్కిందిగా!
ఏమైపోయింది గర్వం?
త్రిమూర్తులే నిను గని తలొంచరా!
అయ్యోర అయ్య
నిరంతరం మహిమను కీర్తించరా!
అయ్యోర అయ్యా
నువ్వెంత అనే అహం నువ్వే దండించరా”
రచన- సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం- ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
సంగీతం – ఇళయరాజా
సినిమా – కూలీ నంబర్ వన్ (1991)
రొటీన్ సినిమాలో రొటీన్ కథ. డబ్బున్న హీరో యిన్. డబ్బు లేని కూలీ నంబర్ వన్ హీరో. ఆ హీరో యిన్ ను ఆట పట్టించే సందర్భంలో ఒక రొటీన్ ఫార్ములా పాట ఉండాలి. కానీ సిరివెన్నెల దాన్ని రొటీన్ కాకుండా అసాధారణ సన్నివేశం చేశారు. సినిమా సందర్భం దాటి గణపతి ముందు తెలుగు జనం ఎగిరి గంతులు వేయడానికి వీలుగా పదాలను అల్లారు.
హీరో యిన్ ను వేళాకోళం చేసే హీరో చేత వినాయకుడి తత్వాన్ని విడమరిచి చెప్పారు. చిన్నారి చిట్టెలుక అంతటి గణపతి భారాన్ని ఎలా మోస్తోందోనని మనం ఆశ్చర్యపోయి…ఆపై ఆలోచించేలా చేశారు. అలా మోయడం జన్మ ధన్యం అన్నారు. అంబారిగా ఉండగల అంతటి వరం ఎందరికి లభిస్తుందని ప్రశ్నిస్తూ ఎలుకనెక్కిన ఏనుగు కథా చిత్రాలను వర్ణించారు.
శివుడి తలపై చేరిన చంద్రుడికి వచ్చిన అహంకారం; బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు భక్తిగా గణపతికి మొక్కడం..లాంటి పురాణ కథలను బంధించారు. “నా అంతటి వాడు లేడు” “నువ్వెంత?” అని మేము అహంకరిస్తే నువ్వే దండించు స్వామీ! అని మనం వేడుకోవడానికి ఒక పాట ఇచ్చారు.
ఇలాంటివి రాయడానికి మళ్లీ సిరివెన్నెలే పుట్టాలి. ఇంకా ఇందులో లోతయిన గణపతి ఆరాధన రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది చాలు.
అలా మనం కూడా వినాయక చవితి పూట ఉండ్రాళ్లయ్యకు దండాలు పెడుతూ మనకు ఎక్కిన మదం దించి…కరుణించమని వేడుకుందాం.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018