మహిళా దినోత్సవం గురించి నేను బాగా తెలుసుకుంది వసుంధరలో పని చేస్తున్నప్పుడే. ప్రతి ఏటా మహిళల సామర్ధ్యాన్ని గుర్తుచేసే అనేక కథనాలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసేవాళ్ళం. ఉద్యోగం మానేశాక ప్రెస్ క్లబ్ ద్వారా పురస్కారం అందుకోవడం ఒక చిత్రమైన అనుభూతి. ఈ మహిళా దినోత్సవానికి నా జీవితంలో అంతో ఇంతో ప్రభావం చూపిన మహిళలను స్మరించుకోవడం సముచితం అనుకుంటున్నాను
భమిడి శాంతమ్మ:
ఈవిడ మా అమ్మమ్మ. దాదాపు పన్నెండుమంది సంతానం. చివరికి నలుగురు మిగిలారు. అమ్మ పుట్టిన కొన్నాళ్లకే చూపు కోల్పోయినా చకచకా వంటలు చేసేది. చిన్నపిల్లలుగా మేమంతా ఆమె ప్రేమానురాగాలు అందుకున్నాం. పేరుకు తగ్గట్టే శాంతమూర్తి. ఎటువంటి పరిస్థితిలోనూ తొణక్కుండా ఉండటం ప్రత్యేకత
కూచి లక్ష్మి:
మా అమ్మ. పన్నెండుమంది సంతానంలో ఆఖరు. దాంతో గారాబంగా పెరిగింది. పధ్నాలుగేళ్లకే పెళ్లి చేయడంతో నేర్చిన విద్యలన్నీ మరచి సంసారసాగరంలో మునిగిపోయింది. వంటే రాని అమ్మ తర్వాత బాగా నేర్చుకుంది. కొన్ని వంటలు అమ్మకే ప్రత్యేకం. ఇల్లు,పిల్లలే లోకం. అయితే మంచి పట్టుదల, ఆత్మాభిమానం కల మహిళ. కొంచెం ముక్కుమీదే కోపం. కానీ వెంటనే కూల్ అయిపోతుంది. కొన్ని లక్షణాలు నాకూ వచ్చే ఉంటాయి.
భమిడి సీతమ్మ:
నా మేనత్త. చదివింది అయిదోతరగతే అయినా ఇంగ్లీష్ పేపర్ కూడా చదివేది. క్రికెట్ ఆట అభిమాని. చుట్టపక్కాల్లో వ్యవహారవేత్తగా చక్కని పేరుండేది.
సురేఖ:
పెద్దక్క. పట్టుదలకు మారుపేరు. అనుకున్నది నెరవేర్చుకుంటుంది. చుట్టాల్లో చదువులసరస్వతిగా పేరు తెచ్చుకుంది. నా మీద చాలా ప్రభావం చూపుతూ ఉంటుంది
సత్యశ్రీ:
రెండో అక్క. మంచి అందగత్తె. కోపం, పట్టుదల ఎక్కువ. కానీ బంధు మిత్రులకు ఎంతో ప్రేమ పంచేది. మేమిద్దరం ఊళ్లు తిరిగి వచ్చేవాళ్ళం. కుటుంబంలో ఆరిందాలాగా అందరికీ సలహాలిచ్చేది. రెండేళ్ల క్రితం కాన్సర్ వ్యాధితో మరణించడం తీరని లోటు.
రమా కాంతమ్మ:
మా అత్తగారు. ఎక్కువ కాలం కలసి ఉండకపోయినా నా మీద ఆవిడ ప్రభావం ఉంది. పూలు, మొక్కలు ఎంతో ఇష్టం ఆవిడకి. స్నేహశీలి. అత్తగారంటే ఇలా ఉండాలి నా స్నేహితులంటారు. అనుకోకుండా ఆవిడనీ కోల్పోడం దురదృష్టం. మా అత్తగారి అత్తగారు చెంచవ్వ కూడా చాలా మంచివారు. ఎంతో ప్రేమగా ఉండేవారు. అత్తగారి లక్షణాలు కోడలికి రావడం ప్రత్యేకత. నాకూ వస్తాయా ?ఏమో!
నా మరదలు జ్యోతి, ఆడపడుచు మాధవి వీళ్లంతా కూడా స్నేహంతో దగ్గరయ్యారనడం నిజం.
గురువులు: చిన్ననాటి గురువులకన్నా ఉద్యోగంలో చేరాక పరిచయమైన సైకాలజిస్ట్ లక్ష్మీకాంతమ్మ మేడమ్, వీణగారు, మ్యూజిక్ మేడం లక్ష్మి గారు, భానుమతి గారు … వీరినుంచి చాలా నేర్చుకున్నాను
స్నేహితులు:
నా జీవితంలో బంధువుల కన్నా స్నేహితులే ఎక్కువ. వారి ప్రభావమూ ఎక్కువే. పాఠాలు నేర్పినవారున్నారు. గుణ పాఠాలు నేర్పినవారూ ఉన్నారు. నచ్చకపోతే దూరం జరగడమే తప్ప ఎవరిపైనా ద్వేషం లేదు. వారినుంచీ నేర్చుకున్నాగా మరి. ఇంటర్ స్నేహితులు రామలక్ష్మి, కళ్యాణి
(ఉషశ్రీ గారి అమ్మాయి). రామలక్ష్మి ఇంటర్ లోనే చాలా పెద్దరికంగా ఉండేది. నాకు చదువుకి సంబంధించి చాలా హెల్ప్ చేసేది. ఇప్పటికీ అదే ధోరణి. డిగ్రీలో పరిచయమైన విజయశ్రీ, సుశీ, నేను ఇప్పటికీ స్నేహబంధం కొనసాగిస్తున్నాం. ఇంకా ఇతర డిగ్రీ మిత్రులు కూడా మాట్లాడుతూ ఉంటారు.
వృత్తిపరంగా:
జర్నలిస్టు వృత్తిలో చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేయడం అప్పటికి నాకు సవాల్. ఆ క్రమంలో హాస్టల్ లో పరిచయమైన రాగిణి, పద్మశ్రీ, సోఫీ ముఖ్యులు. పద్మశ్రీ ఈనాడు లో నా సహోద్యోగి. తను, రాగిణి నన్ను చాలా ప్రేమగా చూసేవాళ్ళు. కేరళ కుట్టి సోఫీ, నేను ప్రాణ మిత్రులుగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ మా మిత్రత్వం కొనసాగుతోంది.
అవినాభావ స్నేహాలు:
అందరూ వ్యాయామం కోసం జిమ్ కి వెళ్తారు. నేనూ అందుకే వెళ్తా. కానీ కొన్ని అపురూపమైన స్నేహాలు అక్కడే మొలకెత్తాయి. నందిని, లావణ్య, నిర్మల అలా నాకు దొరికిన మిత్ర రత్నాలు. ఇంకా చాలామంది మిత్రులు స్నేహ సౌరభాలను పంచుతున్నారు. అలాగే రాజీ, స్వర్ణ అనుకోకుండా పరిచయమై స్నేహంతో పెనవేసుకున్నారు. వీరినుంచి ఎన్నో నేర్చుకున్నాను. ముఖ్యంగా నందిని… స్నేహానికి ఇచ్చే ప్రాముఖ్యం చాలా గొప్పగా ఉంటుంది. ఎవరితో నైనా ఇట్టే కలిసిపోవడం తన ప్రత్యేకత. తన ఆదరాభిమానాలు నేర్చుకోతగ్గవి. అలాగే యోగాని జీవిత విధానంగా రాజీ మలచుకున్న తీరు ప్రశంసనీయం. పెద్ద ఉద్యోగం మానేసి సంగీతం, ఇల్లు, పిల్లలతో గడిపే స్వర్ణ దగ్గర ఏ పని ఎలా చేయాలో నేర్చుకోవచ్చు.
ఇరుగు పొరుగు:
పక్కింటామెగా పరిచయమై ఐదేళ్లలో ఆప్తమిత్రురాలుగా మారింది హేమ. గుజరాతీలపై నా ప్రత్యేక అభిమానానికి కారణం హేమ. ఇంకెవరూ తన స్థానాన్ని అందుకోలేకపోయారు.
ఇన్ని చెప్పి శారద , కవిత గురించి చెప్పకపోతే ఎలా? వీళ్ళు నాకు సహాయకులుగానే కాదు, చాలా విషయాలు పంచుకునే మిత్రులు కూడా. ఇంకా బంధువుల్లో, స్నేహితుల్లో నన్ను అభిమానించేవారు చాలామంది ఉన్నారు.
… ఇలా ఎందరో నా జీవితంలో ప్రభావం చూపినవారు, చూపుతున్న వారు ఉన్నారు. కొందరి పేర్లు చెప్పలేదేమో కానీ వారి ప్రభావం ఉంది… ఉంటూనే ఉంటుంది. ముందు చెప్పినట్టు కొందరు ప్రేమతో, మరికొందరు జీవిత పాఠాలు నేర్పి స్ఫూర్తి దాతలయ్యారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-కె. శోభ