Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమైండ్ ట్రీ చెప్పే ఎల్ అండ్ టీ కాఫీ కథ

మైండ్ ట్రీ చెప్పే ఎల్ అండ్ టీ కాఫీ కథ

Business eyes: ఏది ఆశ ? ఏది అత్యాశ ? ఏది దురాశ ? ఏది నిరాశ ? అన్నది సాపేక్షం . ఒకరి ఆశ మరొకరికి అత్యాశ లేక దురాశ కావచ్చు .

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ్ ఒక సంచలనం . ఆయనిప్పుడు నేత్రావతి నది గర్భంలో ఆరిన కాఫీగా అయిపులేకుండా పోయాడో ? ఇంకెక్కడన్నా కాఫీ డికాషన్ పెట్టడానికి నీళ్లు మరిగిస్తున్నాడో చివరిసారి చూసిన నేత్రావతి నేత్రాలే చెప్పాలి . ఈరోజుల్లో సున్నాలకేమి విలువ ఉంది కాబట్టి ? ఆయన మీద 6 వేల 500 కోట్ల అప్పు ఉంటే ఉండవచ్చుగాక . ఎక్కడో పొగలు గక్కే కాఫీ తాగుతూ ఆ అప్పు ఎలా తీర్చాలో ఆలోచించకుండా అంత సున్నితంగా , అంత అవమానంగా , అంత చరమాంకంగా ఫీల్ అయితే ఎలా ? ఎన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టి మంత్రులు , సెలెబ్రిటీలు అయి బ్యాంకులకే హితోపదేశాలు చేస్తూ వారిచేత సలాములు కొట్టించుకోవడం లేదు ? చాలా సార్లు ఇలాంటి హిమవత్పర్వతసమాన నిరవమాన నిస్సిగ్గు విగ్రహాలను చూసి బ్యాంకు వాళ్లే అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు . లేదా వారి దయ వల్ల శాశ్వతంగా బ్యాంకులు మూసుకుంటున్నారు .

అయినా అతడి పేరు సిద్దార్థ్ .ఎక్కడో గుండెకు తగిలింది . డెడ్ ఎండ్ లా తోచింది . కాఫీ డే లో పెట్టిన పెట్టుబడిదారుల ఒత్తిడి , ఇంకేదో మైండ్ ట్రిని ఎల్ అండ్ టీ టేక్ ఓవర్ , ఇతర వ్యాపారాలు తలకిందులు – తడిసి మోపెడై మోయలేని భారమై ఇక ఈ జీవనదిని దాటలేను అని సరిగ్గా నేత్రావతి నది దాటేప్పుడు అనుకున్నాడేమో ?

ఈ రోజు ఇలా ఒక ముగింపు అంచున సిద్ధార్థుడు ఉన్నాడేమో కానీ – బెంగళూరు వ్యాపార దిగ్గజాల నడుమ అతనొక వెలుగు వెలిగినవాడు . మంగళూరు కాఫీ ఘుమఘుమలను అంతర్జాతీయ యవనికపై అమ్మిన తిరుగులేనివాడు .

నష్టమో , లాభమో ? ఇంకో వెంచర్ చేయడానికి సిద్ధార్థుడిని నేత్రావతి తిరిగి ఇవ్వాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేం .

ఇంతకూ – సిద్దార్థ్ ది ఆశా ? అత్యాశా ? దురాశా ? ఇవేమీకాని నిరాశా ?

(ఇక్కడిదాకా ఉన్న వ్యాసం సిద్దార్థ్ చనిపోయాడని నిర్ధారణ కాకముందు రాసినది)

నీ గెలుపే మా గెలుపు!

మాళవికా హెగ్డే కేఫ్ కాఫీ డే సిద్దార్థ్ భార్య. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ ఎం కృష్ణ కూతురు. ఏడు వేల కోట్ల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక సిద్దార్థ్ తిరిగిరాని లోకాలను వెతుక్కుంటూ నీట మునిగాడు. భర్త పోయిన అంతులేని బాధలో, అప్పుల నడిసంద్రంలో మాళవిక కేఫ్ కాఫీ డే సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలో? ఎలా మొదలు పెట్టాలో తెలియని అగమ్యగోచర స్థితిలో మాళవిక ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ మళ్లీ కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడింది. ఒకటిన్నర సంవత్సరం తిరగకుండా ఏడు వేల కోట్ల అప్పును మూడున్నర వేల కోట్లకు తగ్గించగలిగింది. అంటే ఒకటిన్నర సంవత్సరంలో మూడున్నర వేల కోట్లు సంపాదించగలిగింది. ఇదే పనితీరుతో నడిస్తే బహుశా మరో ఒకటిన్నర సంవత్సరంలో మిగిలిన మూడున్నర వేల కోట్ల అప్పు కూడా ఆమె తీర్చేయగలదు. భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తానని, కేఫ్ కాఫీ డే ను లాభాల బాట పట్టించి ఉద్యోగులందరినీ కాపాడుకుంటానని ఆమె స్థిరంగా చెబుతోంది. ఆమె కృషి ఫలించి కేఫ్ కాఫీ డే సగర్వంగా నిలబడాలని మనం కూడా కోరుకుందాం.

Big Companies

పదివేల కోట్లు, అయిదు వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టి హాయిగా లండన్ లో కూర్చోవచ్చు. రాజకీయాల్లో చేరి బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు కేంద్ర ఆర్థిక మంత్రికి అనుభవపూర్వక సలహాలు ఇవ్వవచ్చు. ఇతరేతర వ్యాపారాల్లో పెడితే నష్టం వచ్చింది- గోచీ గుడ్డ మిగిలింది- ఏం చేసుకుంటారో చేసుకోండి- అని బ్యాంకుల మొహం మీద సగౌరవంగా ఆ గోచీ వస్త్రం కప్పవచ్చు. కానీ- సిద్దార్థ్ సగటు భారతీయుడిలా అవమానంగా ఫీలయ్యాడు. బరువుగా ఫీలయ్యాడు. డెడ్ ఎండ్ కు వచ్చినట్లు ఫీలయ్యాడు. కప్పులో ఘుమఘుమల కాఫీ వేడి చల్లారకముందే చల్లగా మెల్లగా వెళ్లిపోయాడు. పుట్టెడు దుఃఖంలో అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నడపాలో తెలియని ఒక అయోమయ వేళ మాళవిక మెల్లగా అడుగులు మొదలు పెట్టింది.

ఇప్పుడు బ్యాంకులు ఆమెను నమ్ముతున్నాయి. ఉద్యోగులు నమ్ముతున్నారు. కేఫ్ కాఫీ డేలో వాటాలు తీసుకోవడానికి టాటా లాంటి విశ్వసనీయమైన  కొత్త పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. గోరుచుట్టుపై రోకటి పోటులా ఈలోపు కరోనా మీద పడింది. అయినా కేఫ్ కాఫీ డే నెమ్మదిగా పరుగు అందుకుంది. అన్ని వర్గాల అభిరుచులకు అనుగుణంగా కాఫీ డే మారుతోంది.

జీవితం లెక్కలు కాదు. జీవితం ప్లాన్ కాదు. దేన్నయినా తట్టుకోవాలి. విధిని ఎదిరించి నిలబడాలి. సిద్దార్థ్ విధికి తల వంచాడు. మాళవిక విధికి విధి విధానాలను రాసి శాసిస్తోంది. బరిలో గిరి గీసి నిలబడితేనే దైవమయినా సహాయం చేస్తుంది.

మాళవిక గెలవాలి. తీసుకున్న అప్పు అణా పైసలతో సహా చెల్లించడం ధర్మంగా భావించే మాళవిక ఓడిపోకూడదు. భవిష్యత్ వ్యాపార ప్రణాళికల మీద మాళవిక వ్యాపార పత్రిక ఎకనమిక్ టైమ్స్ కు సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడింది. ఏవి చెప్పకూడదో అవి చెప్పలేదు. గర్వం లేదు. భయం లేదు. స్పష్టత ఉంది. నమ్మకముంది. పట్టుదల ఉంది.

గెలువు తల్లీ! మా మనసులు గెలిచిన నువ్వు గెలిస్తే మేము కూడా గెలిచినట్లు. నీ గెలుపే మా గెలుపు.

(ఇది సిద్దార్థ్ చనిపోయాక ఆయన భార్య మాళవిక ఆ వ్యాపారసామ్రాజ్యాన్ని నిలబెడుతున్న సందర్భంలో రాసినది)

ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. మైండ్ ట్రీ కంపెనీలో సిద్దార్థ్ 1999లో 300 కోట్లు పెట్టుబడి పెట్టారు. 20.04 శాతం భాగస్వామ్యం దక్కింది. పదిహేను ఏళ్లు గడిచాక ఆ మూడు వందల కోట్ల పెట్టుబడి వేల కోట్లు అయ్యింది. ఈలోపు మైండ్ ట్రీ మీద ఎల్ అండ్ టి కన్నుపడింది. అంతే…సిద్దార్థ్ కు ఇష్టమున్నా లేకున్నా మైండ్ ట్రీలో తన భాగస్వామ్యాన్ని చాలా తక్కువ విలువకు...దాదాపు 3,300 కోట్లకు ఎల్ అండ్ టీ కి అమ్ముకోవాల్సివచ్చింది. సిద్దార్థ్ ఆత్మహత్యకు ప్రధాన కారణాలు రెండే రెండు. ఒకటి- మైండ్ ట్రీ చేజారిపోవడం; రెండు- కేంద్ర ప్రభుత్వ విభాగాలు వెంటపడి వేధించడం. ఇప్పుడు ఆ మైండ్ ట్రీ ఎల్ అండ్ టీ లో విలీనం కాబోతోంది.

వ్యాపారాల్లో, అందాల గాజు మేడల్లో, ఇస్త్రీ నలగని బట్టల మధ్య గొంతులు కోయడానికి తడిగుడ్డల అవసరం కూడా ఉండదు. డబ్బు డబ్బును ప్రేమిస్తుంది. డబ్బు గబ్బును పోగు చేస్తుంది. గబ్బు గబ్బును ప్రోత్సహిస్తుంది. దబ్బు దబ్బున పతనం మొదలవుతుంది.

Big Companies

ఇంగ్లీషులో బాగా ప్రాచుర్యంలో ఉన్న లోకానుభవం ఇది-
“he came,
he saw,
he conquered”

దీన్నే తెలుగులోకి అనువదిస్తే-
“వారు వచ్చారు,
చూశారు,
ఆక్రమించారు.”

“చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరువైన యట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!”

ఈ సుమతీ శతకానికి అర్థ తాత్పర్యాలు అందరికీ బాగా అర్థమయ్యేట్లు చెప్పడానికయినా సిద్దార్థ్ బతికి ఉండాల్సింది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

కాఫీకీ ఓ దినోత్సవం

Also Read :

23 వేల కోట్లు అప్పు! 20 నిముషాల్లో శాంక్షన్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్