Saturday, November 23, 2024

రామాయణం-9

సంపాతి- జటాయువు
సంపాతి- జటాయువు పెద్ద డేగజాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆకాలంలో ఉండేవి కావు. చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఆ చెట్టుదాకా పరుగెత్తి వెళ్లి మళ్లీ వేగంగా వెనక్కు రావాలి- ముందు ఎవరొస్తారో చూద్దామా? అన్నట్లు ఒకరోజు జటాయువు అన్న సంపాతితో సరదాగా పందెం వేశాడు. సూర్యుడిదాకా వేగంగా వెళ్లి మళ్లీ భూమికి తిరిగి రావాలి- అని. సంపాతి సై అన్నాడు. అంతే ఒకరికంటే ఒకరు వేగంగా పైపైకి వెళ్లి సూర్య మండలం దాకా ఎగిరిపోయారు. జటాయువు చిన్నవాడు కాబట్టి కొంచెం చురుకుగా ఉన్నాడు. దాదాపు సూర్యుడికి దగ్గరవుతున్నాడు. ఈలోపు సంపాతికి జరగబోయే ప్రమాదం కళ్లముందు కనిపించింది. వెంటనే వేగం పెంచి తమ్ముడు జటాయువును తన రెక్కలకింద దాచుకుని- పైకి వెళ్లే వేగం తగ్గించాడు. అప్పటికే సంపాతి రెక్కలు మాడి మసి అయిపోయాయి. స్పృహదప్పినా… తమ్ముడిని రక్షించగలిగాడు. లేకపోతే జటాయువు బూడిద అయిపోయేవాడు. రెక్కలు లేక ఎగరలేక సంపాతి అంతెత్తు నుండి కింద తమిళనాడు గడ్డమీద మహేంద్రగిరి పర్వతసానువుల్లో పడిపోయాడు. జటాయువు గోదావరి తీరంలో దండకారణ్యంలో పడ్డాడు. ఆ తరువాత అన్నదమ్ములు ఒకరినొకరు కలవలేదు. కలుసుకునే అవకాశం రాలేదు.

రెక్కల్లేని సంపాతిని ఒక రుషి చేరదీసి వేళకింత ఆహారం పెట్టేవాడు. స్వామీ! పక్షికి రెక్కలే ప్రాణం. ఇంతకంటే చావు నయం- నాకెప్పటికి విముక్తి? అని అడిగితే…బాధపడకు- సీతాన్వేషణలో హనుమ బృందం ఇక్కడికి వస్తుంది. అప్పుడు నీ అనితరసాధ్యమయిన చూపుతో రామకార్యానికి మాటసాయం చేయి. దాంతో కాలిపోయిన నీ రెక్కలు మళ్లీ వస్తాయి– అని అభయమిచ్చాడు. అలాగే హనుమ బృందం వస్తుంది. సీతమ్మ జాడ చెప్పగానే పోయిన రెక్కలు వస్తాయి. అయితే తన తమ్ముడు జటాయువు రావణుడితో పోరాడి మరణించాడన్న వార్త హనుమ, జాంబవంతులద్వారానే సంపాతికి తెలుస్తుంది. రావణుడి కత్తికి రెక్కలు తెగిన జటాయువు రాముడికి సీతాపహరణ వార్త చెప్పడం కోసమే ప్రాణాలు ఉగ్గబట్టుకుని- రాముడి ఒడిలోనే కన్నుమూశాడు. రాముడే స్వయంగా జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.

లే… పక్షీ! లేపాక్షి
కొన ఊపిరితో ఉన్న జటాయువును రాముడు లే! పక్షి! అంటే అదే ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో లేపాక్షి అయి…పుణ్యక్షేత్రమయ్యింది. రాముడు తెలుగులో లే పక్షి ! అన్నాడా? అని ఒక వితండవాదం లేవదీశారు. “లేపాక్షి స్వప్న దర్శనం” పేరిట బాడాల రామయ్య రాసిన ఒక పద్యకావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ ముందుమాట రాస్తూ ఈ వితండవాదానికి సమాధానంగా చక్కటి వివరణ ఇచ్చారు. రామదాసు, త్యాగయ్యలు తెలుగులో మాట్లాడితే సమాధానమిచ్చిన రాముడు- రక్తపుమడుగులో పడి ఉన్న జటాయువును లే పక్షి! అని అనకుండా ఎందుకుంటాడు? అని. జటాయువును రాముడు కలిసిన చోటు ఇప్పటికీ లేపాక్షి పక్కన రెండుకిలోమీటర్ల దూరంలో దర్శనీయ స్థలం. పూజనీయ స్థలం. లేపాక్షి నంది పక్కన కొండమీద పెద్ద జటాయువు ప్రతిమను కూడా ఆమధ్య ఏర్పాటు చేయించారు.

దండకారణ్యంలోకి ప్రవేశించిన సీతారామలక్ష్మణుల దగ్గరికి వెళ్లి జటాయువు తనను తాను పరిచయం చేసుకున్న సందర్భం అత్యంత ఆత్మీయంగా ఉంటుంది. “నా పేరు జటాయువు. మీ నాన్న దశరథుడి స్నేహితుడిని. ఇది భయంకరమైన రాక్షసులు, క్రూరమృగాలు సంచరించే అడవి. నువ్వు, లక్ష్మణుడు ఏదైనా పనులమీద బయటికి వెళ్లినప్పుడు నేను సీతమ్మకు కాపలా కాస్తాను” అని రాముడు అడక్కుండానే బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. ఇచ్చినమాట కోసం నిజంగానే సీతమ్మను రక్షించడానికి రావణుడితో భీకరమైన యుద్ధం చేశాడు. రావణుడి వివరాలు రాముడికి చెప్పి…రాముడి ఒడిలోనే కన్ను మూశాడు.

రాముడి కోసం పరితపించి…గుండె ఆగిన దశరథుడు ఆ రాముడి చేతిలో అంత్యక్రియలకు నోచుకోలేదు. జటాయువు అంత్యక్రియలను రాముడే స్వయంగా నిర్వహించి…గోదావరిలో పిండప్రదానాలు చేశాడు. జలతర్పణలు ఇచ్చాడు.

భూమికి నాలుగు కోట్ల డెబ్బయ్ లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిదాకా వెళ్లగలిగిన సంపాతి- జటాయువుల బలం ఇప్పుడు మన ఊహకు అందకపోవచ్చు.

కారడవిలో తన మానాన తను ఉండి ఉంటే జటాయువు బతికిపోయేవాడు. తన మిత్రుడి కొడుకు- కోడలు కష్టాల్లో ఉంటే…తను కొమ్మ మీద పట్టనట్లు ఉండలేకపోయాడు. ఒక పక్షి మిత్రధర్మానికి ఎంతటి ఉపకారం చేసింది? ఎంతటి త్యాగం చేసింది? ఇక మనుషులుగా మనం ఎంత చేయాలో ఆలోచించుకొమ్మని వాల్మీకి జటాయువు గాథకు అంతటి ప్రాధాన్యమిచ్చాడు.

రేపు- రామాయణం-10
“రాముడి తమ్ముళ్లు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్