Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంభారీ డిమాండ్: జ్యోతిష్యులు చెబుతోన్న ఎన్నికల ఫలితాలు

భారీ డిమాండ్: జ్యోతిష్యులు చెబుతోన్న ఎన్నికల ఫలితాలు

ప్రపంచంలో ఆధునికీకరణ ఎంత వేగంగా పెరుగుతుందో నమ్మకాలు, విశ్వాసాలు,  ప్రాచీన విధానాలపై ఆసక్తి  కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు జాతకాలు చూసుకొని వెళతామా ఏంటి…. అనే పరిస్థితి నుంచి ఫలానా మంచిరోజున తాము వస్తామంటూ హెచ్ ఆర్ లకు కబురు పంపే రోజులు వచ్చేశాయి. ఇటీవలి కాలంలో స్టార్టప్ కంపెనీల యజమానులు, ఐటి కంపెనీల ఉద్యోగులు, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నవారు తమ భవిష్యత్తు ఏమిటో తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు, ఆఫీసులో పని ఒత్తిడి, జీతాల్లో కోతలు, బాస్ లు ఇచ్చే లక్ష్యాలు సమయానికి చేరుకోలేకపోవడం లాంటి వాటి వల్ల చాలామంది ఆందోళనకు గురై జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నారు.

సమయాభావం వల్ల నేరుగా జ్యోతిష్యులను కలవలేని పరిస్థితి ఉండడంతో ఆన్ లైన్ ఆస్ట్రాలజీపై వారు ఆధారపడుతున్నారు. ఈ డిమాండ్ ను పసిగట్టిన కొందరు… రోగి కోరుకున్నదీ, తాను ఇచ్చేదీ ఒకే మందు అన్నట్లుగా వారిని ఇట్టే ఆకట్టుకునేలా రకరకాల పరిష్కారాలతో వస్తున్నారు.

ఉద్యోగంలో పదోన్నతి, కెరీర్ ఎలా ఉండబోతోంది,  ప్రస్తుత జాబ్ నుంచి మారడం, సొంతంగా స్టార్టప్ ఏర్పాటు, విస్తరణ, కంపెనీ భాగస్వాములను వదిలించుకోవడం, కొత్త వారిని చేర్చుకోవడం, నిధుల సేకరణ లాంటి అంశాలపై కూడా అస్ట్రో గురుల సలహాలు, సూచనలతోనే ముందుకు వెళుతున్నారు.

గత రెండేళ్లుగా తమను సంప్రదించినవారి సంఖ్య పదిరెట్లు పెరిగిందని గణేశాస్పీక్స్ డాట్ కామ్ ఎండి అరుణ్ భాయ్ హేమాంగ్ వెల్లడించారు. వీరిలో 23-25 మధ్య వయసున్న వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. లే ఆఫ్స్, ఇంక్రిమెంట్లు, ఉద్యోగం మార్పు లాంటి అంశాలపైనే ఎక్కువగా వారి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారని ఆస్ట్రో టాక్ సిఈవో  పునీత్ గుప్తా తెలిపారు. ఈ ఆన్ లైన్ జ్యోతిష్యం సైట్లకు వస్తోన్న భారీ డిమాండ్ తో ఆయా కంపెనీల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.

ఆస్ట్రో టాక్ ఆదాయం 2021-22 లో 65 కోట్లు ఉండగా 2022-23 నాటికి 282 కోట్లకు చేరింది.  నికర లాభం 2021-22లో 11.2 కోట్లు ఉండగా 2022-23 నాటికి రూ. 27 కోట్లకు పెరిగింది. దీని వినియోగదారుల సంఖ్య 2.5 మిలియన్ల నుండి 9 మిలియన్లకు పెరిగింది. ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంచనా 630 కోట్లు కాగా నికర లాభం వృద్ధి 130 కోట్లుగా ఉంటుందని ఆశిస్తున్నట్లు గుప్తా వివరించారు. ఈ కంపెనీలో ప్రస్తుతం 13 వేలకు పైగా జ్యోతిష్యులు, సంఖ్యా శాస్త్ర నిపుణులు, వాస్తు పండితులు, టారోట్ రీడర్స్ (మనం ఎంచుకునే కార్డుల ఆధారంగా చెప్పే పద్దతి– ఒక రకంగా చిలక జోస్యం వంటిదే) పని చేస్తున్నట్లు చెప్పారు. ఆస్ట్రో గురు చెప్పిన వాటిలో ఏ ఒక్కటి జరిగినా చాలు  చాలామంది దానిపై మరింత నమ్మకం ఏర్పరచుకుని గుడ్డిగా ఫాలో అవుతుంటారు.

జ్యోతిష్యం పక్కా శాస్త్రీయం కాకపోయినా దానివల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. మరోవైపు ఈ గురువులు చెప్పే ప్రత్యేక పూజలు చేయించడం కోసం వివిధ తీర్ధ క్షేత్రాలు వెళుతుంటారు…అక్కడ హోటల్లు, ఇతరత్రా వ్యాపారాలకు కూడా గిరాకీ వస్తోంది. రాబోయే రోజుల్లో దేశ స్థూల జాతీయోత్పత్తిలో జ్యోతిష్యం వాటా కూడా చెప్పుకోదగ్గ స్థాయికి వెళుతుంది.

కొసమెరుపు:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈనెల 13న ముగిసిన వెంటనే ఫలితాల సరళి ఎలా ఉంటుందనే దానిపై ప్రజలు ఆసక్తితో వివిధ వార్తా ఛానళ్ళు వీక్షించారు. జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు కాబట్టి సర్వే సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయనే దానిపై కూడా వారు తెలుసుకున్నారు. ఈ రెండితో పాటు ముఖ్యంగా జ్యోతిష్యులు చెబుతోన్న ఫలితాలను కూడా ఆల్ లైన్ లో విపరీతంగా సెర్చ్ చేశారు. తమ అభిప్రాయాలకు, ఆశలకు దగ్గరగా వున్న అంచనాలను ఒకటికి రెండుసార్లు వీక్షించారు. దీనితో రోజువారీ వార్తా చానల్స్ కంటే ఈ వీడియోలకే ఎక్కువ గిరాకీ (వ్యూస్) వచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్