Drought-Diamonds:
“కండలేక ఎండిపోయి
బెండు వారినా సరే!
తిండిలేక, తుండులేక,
పండవారినా సరే!
నిండు మనసు, నిజాయితీ,
పండు వయసు, పట్టుదలా,
దండిచేయి, ధర్మదీక్ష
పండించును గుండెలలో…
రండు రండు! చేతు లెత్తి
దండము తల్లీ యని, కై
దండల దండలతో, నీ
రెండ నిలిచి కొలుచి పొండు
ఇంత మంచి పెన్నతల్లి
ఎందు కెండి పోయెనో?
ఇంతమంది కన్న తల్లి
ఎందు కిట్లు మారెనో?
వంతలతో, చింతలతో
కంతలువడి పోయెనో!
సంతుకోస మేడ్చి ఏడ్చి,
గొంతు కారిపోయెనో!
అదే పెన్న! అదే పెన్న!
నిదానించి నడు!
విదారించు నెదన్, వట్టి
ఎడారి తమ్ముడు!”
-విద్వాన్ విశ్వం, పెన్నేటి పాట
“భాగ్యములకు చీడ పట్టిన రాయలసీమ మాది”
-పుట్టపర్తి నారాయణాచార్యులు
“క్షామము దాపురించి పలుమారులు చచ్చెను జంతుసంతతుల్
వేమరు జచ్చినారు ప్రజ వేనకువేలు చరిత్ర లోపలన్
క్షామములెన్ని వచ్చిన రసజ్ఞత మాత్రము చావలేదు జ్ఞానామృత పుష్టికిన్ కొరత నందని రాయలసీమ లోపలన్”
-నండూరి రామకృష్ణమాచార్యులు
“అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట…”
-ఆత్రేయ
“నీళ్లొక్కటి ఉంటే ఈ సీమ నిజంగానే రత్నాలసీమ అయి ఉండేది”
-ఎడారి కోయిల కథలో మధురాంతకం రాజారామ్
“ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ…
తనువెల్ల తరగని గనులున్న సీమ గిరులున్న సీమ…
వాన గాలికి సీమ తానమాడినపుడు వజ్రాలు ఈ నేల వొంటిపై తేలాడు…
పొరలో నిమిరితే పుష్య రాగాలు దొర్లు…
బంగారు గనులున్న పొంగదీ తల్లీ…పొంగిపోదమ్మా!
ఎత్తు బండరాళ్ళు, ఎర్రని దుప్పులు, పలుగు రాళ్ళ గట్లు, పరిగి కంపపొదలు
నెర్రెల్లు వారిన నల్లరేగళ్ళు…ఆరు తడుపుకు పెరిగే వేరుశెనగమ్మో..”
-గోరటి వెంకన్న
రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు? అన్నట్లు రోజూ చూసే కరువుకు రాయలసీమ ఏడవదు. మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందాలను వెతుక్కుంటుంది. కన్నీళ్లతో కరువు పాటలు పాడుకుంటూ ఉంటుంది. కరువుపైన కరువుదీరా కథలు అల్లుతుంది. కవిత్వానికి కరువు లేకుండా పొంగిపోతుంది. నెర్రెలు చీలిన నేలల్లో మాటలకందని పదచిత్రాలకు వివర్ణమయిన వర్ణాలను పులుముతూ ఉంటుంది.
రాయలసీమలో పద్యం రాయని పల్లె పల్లే కాదు. అవధానాలు జరగని ఊరు ఊరే కాదు. నాలుగు, అయిదు…పది భాషల్లో సమాన ప్రావీణ్యం ఉండి…జీవితకాలంలో వందకు పైగా కావ్యాలు రాసిన ఎందరో అనామకులుగా కాలగర్భంలో కలిసిపోయినవారు రాయలసీమలో లెక్కలేనంతమంది. ఒకే మనిషిలో తెలుగు, కన్నడ, సంస్కృతం, హిందీ, ప్రాకృతం, ఇంగ్లీషు ప్రతిభలు పురివిప్పి నాట్యమాడిన ఎందరో తేజోమూర్తులు రాయలసీమ రాళ్లలో రాళ్లుగా కలిసిపోయారు. రాళ్ళపల్లి, విద్వాన్ విశ్వంల సాహిత్య సేవ సముద్రమంత. పుట్టపర్తి నారాయణాచార్యుల పద్నాలుగు భాషల ప్రావీణ్యం ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం. శ్రీకాకుళం వంశధార నాగావళుల నుండి వచ్చి అనంతపురంలో స్థిరపడి సీమ పెన్నకు వెన్న తినిపించి…దత్తమండలాలు- సీడెడ్ ఏరియా అన్న అవమానకరమయిన పేరును పట్టుబట్టి తొలగించి…”రాయలసీమ” అని తలెత్తుకోదగ్గ నామకరణం చేసిన అనన్యసామాన్యమయిన చిలుకూరు నారాయణరావు పాండిత్యం ఆకాశమంత.
రాయలసీమ- రత్నాలు రాశులు పోసి వీధుల్లో అమ్మిన రోజులను చూసిన కంటితోనే
వరుస కరువులను నెత్తిన పెట్టుకుని వలసలు వెళ్లిన రోజులను కూడా చూసింది.
రాయలసీమ- నెలకు ముమ్మారు వర్షాలు పలకరించి…పులకరించినప్పుడు చూసిన కంటితోనే ఏళ్లకేళ్ల వరుస కరువుల కన్నీళ్లను కూడా చూసింది.
కన్నీళ్ళకే కన్నీళ్లు పొంగుకొచ్చేలా రాయలసీమ తన కరువు గాథలను గానం చేస్తూనే ఉంది. చీకటి తొలగి రేపటి వెలుగులు వస్తాయన్న ఆశతో చీకటికే గజ్జె కట్టి, చీకటి గుండె కంజీర కొట్టుకుంటూ…ఎడారి దారిలో…ఎవరు విన్నా…వినకపోయినా…తడారిన గొంతుతో తన బాధల గాథలో, పాటలో, పద్యాలో పాడుకుంటూ ఉంది.
కాలక్రమంలో ఆ విషాదగాథలే అపురూపమయిన సాహిత్య సృజనలు అయ్యాయి. ఆ కరువు కన్నీళ్ల ప్రవాహంలో ఈదిన వారు సృష్టించిన సృజనాత్మక ప్రక్రియలే రాయలసీమకు మణిహారాలయ్యాయి. హాలుడి ప్రాకృత గాథా సప్తశతి సప్తశతికి రాళ్ళపల్లి తెలుగు అనువాద పద్యం ఒక వజ్రం. బతుకును పీల్చి పిప్పి చేసిన…నీరింకిన పెన్న గట్ల శోకాన్ని శ్లోకం చేసి…లోకానికి ఇచ్చిన విద్వాన్ విశ్వం ఒక వజ్రం. తెలుగు సాహిత్య విమర్శకు చుక్కాని అయిన రాచమల్లు రామచంద్రా రెడ్డి, వల్లంపాటి వెంకటసుబ్బయ్యలు రెండు వజ్రాలు.
ఇంకా వెనక్కు వెళితే-
కాలజ్ఞానం చెప్పిన పోతులూరి, కాలానికి ఎదురీది లోకానికి కాలాతీతమయిన నీతి చెప్పిన వేమన, తెలుగు పదానికి వెలుగు పథం చూపిన అన్నమయ్యలు ఎన్నెన్ని వజ్రాలో? ఆ వజ్రాల విలువెంతో వందల ఏళ్ల రాయలసీమకు సాక్షిగా ఉన్న ఏ తిమ్మమ్మ మర్రిమాను చెప్పాలి?
ఇప్పుడు రాయలసీమ నీటిచుక్కలేక లేక పిడచకట్టుకుపోయి…ఎండమావుల వెంట దిక్కుతోచక తిరిగే కరువుకు బ్రాండ్ అంబాసడర్ అయి ఉండవచ్చు. “ఇనుపగజ్జెల కరువు
కరువు తాండవం;
కరువు కరాళ నృత్యం,
రాబందుల రెక్కల చప్పుడు
రెక్కల కరువు
డొక్కల కరువు
గంజి కరువు…”
అని కరువు పారిభాషికపదాలకు కరువు లేకుండా సృష్టించి చెబుతూ ఉండవచ్చు.
కానీ…
చరిత్రలో రెండు వందల ఏళ్లు వెనక్కు వెళితే- రాయలసీమలో కరువు లేదు. ఉన్నదంతా నీటి పొంగులే. పండినవన్నీ పాడిపంటల పచ్చని పందిళ్ళే. కురిసినవన్నీ కావ్యాల జల్లులే. విరిసినవన్నీ వేవేల వర్ణాల ఇంద్రధనస్సులే.
గోరటి వెంకన్న ఏ అలౌకిక సమాధి స్థితిలో ఉండి అన్నాడో కానీ… నిజంగానే వాన గాలికి సీమ స్నానమాడినప్పుడు నేలపై వజ్రాలు పొంగుతాయి. “వజ్రకరూరు”ను నిజంగానే కడుపులో దాచుకుంది రాయలసీమ.
బండలు పగిలే ఎండలు పోయి అదనెరిగి పదునుగా వర్షాలు కురిస్తే…రాయలసీమ నాగలి పోటుకు అపుడో…ఇపుడో…ఎప్పుడో ఒకప్పుడు నేల చాళ్లల్లో వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి.
తాజాగా కర్నూలు జిల్లా మద్దెకర మండలం బసినేపల్లిలో ఒక రైతు తొలకరికి తన పొలం దున్నుతుంటే…నాగలికి ఒక వజ్రం తగిలి…దొరికినట్లు…దాని విలువ దాదాపు రెండు కోట్లు ఉన్నట్లు…మీడియాలో ఒక వార్త తెగ తిరుగుతోంది. తీరా ఆరా తీస్తే అది నిజంగానే రాయి తప్ప…వజ్రం కాదని తేలింది. మొదట సంచలనం కోసం వేగంలో సరిచూసుకోని మీడియా…కనీసం విషయం తెలిశాక…అది నిజం కాదన్న వివరణ మాత్రం ఇవ్వలేకపోయాయి కొన్ని టీ వీ, డిజిటల్ మీడియా సంస్థలు. ప్రింట్ మీడియా కొంతలో కొంత నయం. నిజం కాదని తెలిసి…రెండ్రోజుల తరువాతయినా సవరణ ఇచ్చింది.
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో నాలుగయిదు దశాబ్దాల్లో రైతులకు నిజంగా వజ్రాలు దొరికినా…చివరకు ఆ రైతు చేతికి దక్కే సొమ్ము ఆ వజ్రం విలువలో పది శాతం కూడా ఉండని సందర్భాలు అనేకం నేను చూశాను. విన్నాను. 1994 లో అనంతపురంలో ఆంధ్రప్రభ విలేఖరిగా పనిచేస్తున్న యదాటి కాశీపతి వెంట జూనియర్ విలేఖరిగా ఇలాంటి వజ్రం దొరికిన కేసు వార్తలు రాయడానికి నేను చాలా రోజులు తిరిగాను. అప్పుడు నాకు అర్థమయ్యిందేమిటంటే-
1. ఫలానా ఊళ్లో, ఫలానా రైతు పొలంలో వజ్రం దొరికింది. దాని బరువింత. దాని విలువ ఇన్ని కోట్లు అని మీడియాలో వార్తలు చదవడానికే బాగుంటాయి కానీ…ఆ వజ్రం దొరికిన రైతుకు ఆ క్షణం నుండే ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడతాయి.
2. మొదట రెవిన్యూ వారు, తరువాత పోలీసులు ప్రవేశిస్తారు. వజ్రం విలువ కట్టి…భద్రంగా ప్రభుత్వ ఖజానాకు తరలిస్తారు.
3. ఆ రైతును పోలీసులు దొంగలా చూస్తారు. రెవెన్యూ వారు దోషిలా చూస్తారు. సమాజం అసూయతో చూస్తుంది.
4. వారం, నెల, సంవత్సరాలు వజ్రం విలువను ఊహించుకుంటూ పొలం పనులు మానేసి…రైతు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ…పిచ్చివాడై…రోడ్డున పడతాడు.
5. ఒక తరం గడిచేలోపు అనేక దశల్లో ఫైలు కదిలి…ఆ వజ్రాన్ని బహిరంగ వేలం వేసి…మార్కెట్లో అమ్ముడుబోయిన విలువలో పది శాతానికి మించకుండా…రైతు చేతికి దక్కాలంటే…ఆ రైతు పెట్టి పుట్టాలి. లేదా…ఈలోపు వజ్రం కలలతో ఆ రైతు శాశ్వతంగా పోయినా…పోవచ్చు. దానికి రెవిన్యూ, పోలీసు వారిది పూచీ కాదు.
6. ఏమప్పా మధూ! చూస్తివా ఈ బాధ? నా పొలంలో గనక వజ్రం దొరికితే…మళ్లీ అట్లే మట్టిలోకి తొక్కేస్తాను కానీ…బయటికి తీసెల్లె! అని సిగరెట్టు పొగ వదులుతూ వేదాంత పాఠం చెప్పాడు యదాటి కాశీపతి. ఆయన అలాగే ఏదీ పట్టించుకోకుండా బతికాడు. అనంతపురం ఊరిని ఆనుకుని ఉన్న ఆయన పొలాలు ఎవరో ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేసుకున్నారు. ఆయన భూముల విలువ ఇప్పటి మార్కెట్ ధర ప్రకారం అక్షరాలా వంద కోట్ల రూపాయలు. ఆయన భార్య ఇప్పటికీ ఆ విషయం నాకు చెప్పి బాధపడుతూ ఉంటారు.
7. నేను ప్రత్యక్షంగా చూసిన వజ్రం కేసు దాదాపు ముప్పయ్ ఏళ్ల కిందటి మాట. మన సొంత నేలల్లో నిధి నిక్షేపాలు బయటపడినప్పుడు ప్రభుత్వ విధి విధానాల వల్ల…అది దొరక్కపోయి ఉంటే బాగుండేదిరా! భగవంతుడా! అని అనుకునేలానే పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉందని కర్నూలు ఎన్ టీ వీ రిపోర్టర్ చంద్రశేఖర్ తాజాగా నాకు చెప్పాడు.
“సానబెట్టకుంటుంటే వజ్రమయినా-
అది ఒట్టి రాయి…
పట్టించుకోకుంటే వజ్రంలాంటి మనుషులయినా-
రక్తమాంసాల మామూలు మనుషులు”
రాయలసీమలో బయటపడని వజ్రాలు ఎన్ని ఉన్నాయో?
బయటపడినా ప్రయోజనం దక్కని వజ్రాలు ఎంతగా బాధపడుతున్నాయో?
“వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది”.
రాయలసీమ గర్భంలో నిజంగా వజ్రాలు నిలిచి ఉన్నాయి.
మన నిర్లక్ష్యం వల్ల కాలగర్భంలో వజ్రాల్లాంటి రాయలసీమ మనుషులు కూడా రాళ్లలా కనిపిస్తున్నారు.
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.
వజ్రం మనకోసం వెతకదు- మనమే వజ్రసంకల్పంతో వజ్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]