Saturday, June 29, 2024

ఆడీకి ఆటో లేఖ

Hyderabad Audi Car Accident : 

ఆడీకి ఆటో ఇచ్చిన డైయింగ్ డిక్లరేషన్ ఇది. సాక్ష్యం సీ సీ టీ వి కెమెరాల రికార్డింగ్.

గౌరవనీయ నాలుగు రింగుల లోగో ఆడి గారికి, రాత్రంతా తప్ప తాగి, తైతక్కలాడి, తెల తెలవారుతుండగా ఆ బులుగు రంగు ఆడీని నడిపిన స్పృహలేని డబ్బున్న మారాజు కొడుకుకు నమస్కారం. ఆడీతో బోడి నా ఆటో పోలికకు నిలవదు. నిలవాలని నేను కోరుకోవడం లేదు. డబ్బెక్కువై కన్ను మిన్నుకానక మీ ఆడి వాయువేగంతో రోడ్డు మీద వెళ్లేప్పుడు…నేను అడ్డు ఉండడం నిజంగా నా తప్పే. తాగిన మత్తులో మీ విలువైన ఆడీలు తూలుతూ వెళ్లడానికే భాగ్యనగరం రోడ్లు ఉన్నాయని స్పష్టమయిన ఎరుక ఉన్నా- ఉదయం అయిదున్నర మీ సమయం కాదని నేను పొరబడి, తడబడి, ధైర్యం చేసి రోడ్డు మీదికి వచ్చాను. సాధారణంగా మీరు దయ్యాలు నిద్రలేచినప్పుడు లేచి, దయ్యాలు తిరిగినప్పుడు బలాదూర్ గా తిరిగి, దయ్యాలు పడుకునేవేళకు పడుకుంటారని తెలుసు. ఉదయం అయిదున్నర అంటే సగటు కర్మజీవుల సమయమని అనుకున్నాను. అయినా నా ఖర్మ ఇలా కాలింది.

My Car My Rules : 

అంతటి వేగంతో నన్ను గుద్దేసి, అంతటి మత్తులో కూడా ఆడి నంబర్ ప్లేట్ మార్చేసి, డబ్బెక్కువై కొడుకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియని మీ తండ్రికి మీరు ఫోన్ చేసి సలహా అడిగిన మీ సమయ స్ఫూర్తి, తప్పించుకునే ప్రయత్నం నిజంగా ఊహాతీతం. మీకు తగిన మీ తండ్రి ఆటో ఎక్కి గుట్టు చప్పుడు కాకుండా వచ్చేయమనడం, మీరు వెళ్లి దాక్కోవడం, సినిమాల్లోలా ఇంకో డ్రైవర్ ఆ ఆడిని నడుపుతున్నట్లు నమ్మించబోయి, చివరికి తండ్రి కొడుకు ఇద్దరూ జైలు పాలు కావడం కాకతాళీయం.సీ సీ టీవీల్లో సాక్ష్యం ఉండబట్టి దొరికిపోయారు కానీ – లేకపోతే నా ఆటోనే తప్పతాగి మీ ఘనమయిన ఆడిని గుద్దితే మీకు మత్తెక్కిందని నిరూపించేవారు. నా ఆటో వెనుక సీట్లో కూర్చున్న ఉమేష్ నిండు ప్రాయపు ప్రాణం పోయింది. పొట్టకూటి కోసం రాత్రంతా ఉద్యోగం చేసి పగలు రూముకు వెళ్లి పడుకోవాల్సినవాడు. తాగిన ఆడి దెబ్బకు రోడ్డుమీద ప్రాణం లేక పడి ఉన్నాడు. తెల్లవారక ముందే బతుకు తెల్లవారి విగత జీవిగా పడి ఉన్నవాడు.నీ పేరు ఆడి కావచ్చు. బెంజ్ కావచ్చు. మరొకటి కావచ్చు. ధనమదంతో నువ్ రోడ్డు మీద వెళుతున్నప్పుడే తలదించుకోవాల్సిన వాళ్లం మేం. అలాంటిది మీరు తాగి చక్రాలు నడిపితే ఆ చక్రాల కింద నలిగి నామరూపాల్లేకుండా పోవాల్సిన వాళ్లం మేం. తప్పు తాగి నడుపుతున్న మీది కాదు. రోడ్లమీద తాగకుండా నడుపుతున్న మాది. తాగకుండా నడుస్తున్న మాది. ముమ్మాటికీ తప్పు నంబరు ప్లేట్లు మార్చలేని మాదే. బలాదూర్ గా రోడ్లమీద తిరగడానికి ఆడి కొనిచ్చి, తాగడానికి రాత్రిళ్లు ఊరిమీదికి పోనిచ్చి, జనాన్ని చంపి, నేరాన్ని దాచలేని మా పేదరికానిదే నూటికి నూరు పాళ్లు తప్పు.

-పమిడికాల్వ మధుసూదన్

Read More: పెద్దవారి హై స్పిరిట్! వారి పిల్లల ట్రూ స్పిరిట్!!

RELATED ARTICLES

Most Popular

న్యూస్