Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసెలెబ్రిటీ న్యూస్ వ్యాల్యూ

సెలెబ్రిటీ న్యూస్ వ్యాల్యూ

Drugs-Drinks:
నలుగురు సెలెబ్రిటీలు.
కాస్త పొట్టిబట్టలేసుకునే అమ్మాయిలు
ఓ పబ్..
అందులో డ్రగ్స్ ఆనవాళ్ళు..
వామ్మో.. ఇంత స్టఫ్ వుంటే టీవీలు ఊరుకుంటాయా?
కిక్కు నాషాలానికి ఎక్కేయదూ..
ఏ మాట కామాట
జర్నలిస్టులు ఇంకా అంత ఎదగలేదు.
ఇక్కడొచ్చే జీతాలు భత్యాలు
గట్టిగా రెండు పేకట్ల సిగరెట్లకే సరిపోవు.
పారడైజ్ లో బిర్యాని కూడా నెలమొదటి వారంలోనే ప్లాన్ చేసుకోవాలి.
ఇక పబ్బులు, క్లబ్బులు,
అక్కడ వేలాది రూపాయల ఎంట్రీఫీజులు
కాస్ట్లీ కాస్ట్లీ కాక్ టెయిల్స్..
పక్కన గళ్ ఫ్రెండ్స్..
డాన్సులు, డిజెలు..
అబ్బే ఇంత సీన్ జర్నలిస్టులకి లేదు.

కాస్త లైఫ్ స్టైల్ లో వున్న రిపోర్టర్లు అప్పుడప్పుడూ లోపలికెళ్ళి చూసే అవకాశం వుంది.
ఈ మధ్య పొలిటీషియన్లతో ఫ్రెండ్ షిప్ కూడా వర్కౌట్ అవుతోంది.
ఒకవేళ ఎవరి పుణ్యమాఅని పబ్ లోపలికి వెళ్ళినా.. నోరెళ్ళ బెట్టుకు చూడ్డమే ఎక్కువ.
అలవాటుంటే, కాస్త ఆల్కహాల్ కి కక్కుర్తి పడతారేమో కానీ మరీ డ్రగ్స్ దాకా వెళ్ళేంత సీన్
జర్నలిస్టులకి అస్సలు లేదు.
అందుకే ఇదొక అసూయలాంటి కోపమేమో..
అందుకే ఇదొక భరించలేని బాధ్యత ఏమో..
పబ్స్, డ్రగ్స్ అంటే, చాలు మీడియా చెలరేగిపోతుంది.
ఇటు రిపోర్టర్లు , అటు డెస్క్ చెడుగుడాడేస్తారు.
తెలిసిందీ, తెలియందీ.. కలగలపి కాక్టెయిల్ కొట్టేస్తారు.
పాష్ పాష్‌ డ్రగ్స్ పేర్లతోనే మత్తెక్కించేస్తారు.
పబ్ ల ఇనసైడ్ కహానీలను డైరెక్ట్ గా ప్రేక్షకుల నరాల్లోకే ఇంజెక్ట్ చేస్తారు.
జనం కూడా హవ్వ.. అని ముక్కున వేలేసుకుంటారు
ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ..

“పోలీసులు ఇంకా చాలా మందిని దాచేసారట..
ఫలానా హీరో కొడుకు ఎప్పుడూ అక్కడే వుంటాడట..
ఆ హీరోయిన్ ఏమైనా పెద్ద పతివ్రతా..
అసలు వీళ్ళని మొన్నే లోపలేసేసుంటే.. ఈ పాటికి సెట్ అయిపోయేది”..
ఈ టాపిక్ ఎక్కడా ఆగదు.
సరే..ఇంతా చేసి ఏం జరుగుతుంది?
మహా అయితే, ఆ పబ్ కి ఏ వెయ్యినూట పదహార్లో జరిమాన పడుతుంది.
మైనర్లకి మందమ్ముతున్నారనో,
నాయిస్ పొల్యూషన్ అనో,
టైమ్ అయినా మూసేయలేదనో
ఒకటో రెండో పెట్టీ కేసులు పెడతారు.
మహా అయితే, ఒకరిద్దరు పబ్ ఉద్యోగులు ఓ రెండు రోజులు జైల్లో వుంటారు.


మరి సెలెబ్రిటీల సంగతేంటి?
ఏం కాదు.. పోలీసులు చూసుకుంటారు.
ఇలా టైమ్ అయ్యాక పబ్ లలో వుండకండని సలహా ఇచ్చి ఇంటికి పంపుతారు.
అవసరమైతే మళ్ళీ పిలుస్తామంటారు.
పెద్ద పెద్దోళ్ళు పోలీసుల గ్రిప్ లో వుండేది ఇలాంటప్పుడే కదా..
పొలిటికల్ గా సిటుయేషన్ డిమాండ్ చేసినప్పుడు..
అటెన్షన్ డైవర్షన్ అవసరమైనప్పుడు..మళ్ళీ ఈ డ్రామా కి తెరతీయొచ్చు.
ఇంతకీ అసలు విషయం..
అదే డ్రగ్స్ పరిస్థితేంటి?
అసలవి డ్రగ్సే కాదు..
ఒకవేళ డ్రగ్స్ అయినా.. కేసు పెట్టగలిగేంత పరిమాణంలో లేవు.
ఒక వేళ అదీ వున్నా.. అది ఎవరిదో తెలియకపోవడం వల్ల కేసు నిలబడదు.
ఒక అజ్ఞాత వ్యక్తి మరో అనామకవ్యక్తికి అందజేస్తే,
అనాధలా పడివున్నా ఆ పొడితో పోలీసులు పొడిచేదేమీ వుండదు.
మరి మీడియా ..?
నాల్రోజుల తర్వాత అదసలు వార్తే కాదు..
జనం.. ఈలోపు ఏ పాన్ ఇండియా సినిమానో రాకపోతుందా?
అదెంత దరిద్రంగా వుందో తిట్టుకోడానికే టైమ్ సరిపోదు.
ఏ డ్రగ్స్ కేసైనా ఇంతే సంగతులు.. చిత్తగించవలెను.

-శైలి

Also Read :

భాగ్యవంతుల బాధ

RELATED ARTICLES

Most Popular

న్యూస్