Thursday, September 19, 2024

అటజని కాంచె…

పద్యం:-
“అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్”

భావం:-
మంచుకొండ కొమ్ములు నింగిని తాకుతున్నాయి. వాటి నుండి సెలయేళ్ళు జారుతున్నాయి. వాటిలో లేచిపడే అలల సవ్వడి మద్దెలమోతల్లాగా ఉన్నాయి. వాటికి పరవశించిన నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి.

నీరాజనం పాట:-
“శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం – కెంపైన నీరాజనం-
భక్తి పెంపైన నీరాజనం”

భావం:-
హిమవంతుడి కూతురు పార్వతి. హిమవత్ పర్వతం ఆమె పుట్టినిల్లు. ఆ శీతాద్రి శిఖరం మీద ఆమె కూర్చుని ఉంది. తెల్లటి మంచు కొండలమీద సూర్యుడి వెలుగు కిరణాలు పడి మరింతగా వెలుగుతున్నాయి. పార్వతిదేవి కాళ్లకు పూసుకున్న ఎర్రటి లత్తుక తెల్లటి మంచు కొండలమీద ప్రతిఫలిస్తోంది. ఆ తల్లి లత్తుకకు కెంపయిన నీరాజనం. భక్తి పెంపైన నీరాజనం.

మొదటి పద్యం అల్లసాని పెద్దన మనుచరిత్ర ప్రబంధ కావ్యంలోనిది. ప్రవరాఖ్యుడితోపాటు సమస్త ప్రపంచానికి పెద్దన హిమాలయం అందాలను శాబ్దిక ప్రత్యక్ష ప్రసారంగా చూపించాడు. ఏమాత్రం పద్యసాహిత్యం మీద ప్రేమ ఉన్నా ఇదివరకు ఈ పద్యాన్ని నోటికి నేర్చుకునేవారు. అర్థమైనా కాకపోయినా తెలుగు పద్యం జిగి బిగికి; చెప్పే వస్తువుకు తగిన పదాలను ఎంచుకునే పద యోగ్యతా సంబంధానికి; నోరు తిరగడానికి ఈ పద్యం అప్పట్లో ఒక కొలమానం. ఒక అద్భుతం.

రెండోది ప్రఖ్యాత సంస్కృతాంధ్ర పండితుడు, అష్టావధాని, అనేక వ్యాఖ్యాన గ్రంథాల రచయిత బేతవోలు రామబ్రహ్మం గారు రాయగా, మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు పాడిన అద్భుతమైన నీరాజనం పాట.

కుమార సంభవం కావ్యంలో కాళిదాసు హిమవంతుడిని, హిమాలయాలను తనివి తీరా వర్ణించాడు. “ఉపమా కాళిదాసస్య”. పోలిక చెప్పడంలో కాళిదాసును మించినవాడు లేడు. ఇకపై పుడతాడన్న నమ్మకమూ లేదు. మంచు కొండలమీద సూర్యుడు పడితే…తలదాచుకోవడానికి చీకటికి హిమవంతుడు ఆశ్రయమిచ్చాడట. దేవుళ్లకు వింజామరలతో వీస్తాము. అందులో కుచ్చు చామరీ మృగాల తోకలో వెంట్రుకలతోనే కూరుస్తారు. హిమాలయం కొండ కోనల్లో తమను తిరగనిచ్చినందుకు కృతజ్ఞతగా చామరీ మృగాలు తోకలు ఊపుతూ హిమవంతుడికి వింజామరలు వీస్తున్నాయట.

అంతగొప్ప కాళిదాసు, అల్లసాని పెద్దన, బేతవోలు రామబ్రహ్మల కళ్లతో చూస్తూ ప్రస్తుతం లేహ్ మంచు కొండల్లో తిరుగుతున్నాను. కాళిదాసు శీతనగ శ్లోకాలు, పెద్దన అభంగ తరంగ మృదంగ నిస్వన పద్యాలు, బేతవోలు శీతాద్రులు మదిలో మెదులుతుండగా…నాలుకమీద దొర్లుతుండగా…ఈ మంచు కొండలను చూడ్డానికి నాకు రెండు కళ్లు చాలడం లేదు .

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్