Friday, March 13, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిన్న జ్ఞాపకం- నేడు అనుభవం- రేపు ఆశ

నిన్న జ్ఞాపకం- నేడు అనుభవం- రేపు ఆశ

ఇదివరకు పెద్దబాలశిక్ష చదివే రోజుల్లో ప్రభవ, విభవ, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస . . . అని ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు మన సంప్రదాయ క్యాలెండర్ 60 సంవత్సరాల పేర్లు, రాశులు, నక్షత్రాల పేర్లు నోటికి నేర్పేవారు. నెమ్మదిగా ఇంగ్లీషు క్యాలెండరు ముందుకొచ్చి ఉగాది పంచాంగం వెనక్కు వెళ్ళింది కాబట్టి ప్రభవ ప్రాభవం కోల్పోయింది. విభవ విసిగిపోయింది. ప్రమోదూత ప్రమాదంలో చిక్కుకుంది. అశ్విని భరణి కృత్తిక కుత్తుక తెగింది. మేష వృషభ మిథున రాశుల వాసి తగ్గింది. శాలివాహన శకాలకు ఏ సీ- బీ సీ కరెంటు షాకులు తగిలాయి. చైత్ర వైశాఖ జ్యేష్ఠాలు శ్రేష్ఠం కాకుండా ఎప్పుడో మూలనపడ్డాయి. జనవరి ఫిబ్రవరి అర్థమయినంతగా భాద్రపద ఆశ్వియుజాలు అర్థం కావు. శరదృతువు పలకడమే కష్టం కావడంతో- రుతువులు సమ్మర్ వింటర్ కే కుచించుకుపోయాయి. యుగధర్మం అనుకోవాలి. మార్పు సహజం అనుకుని సర్దుకుపోవడం తప్ప వీటిమీద మరీ గుండెలుబాదుకుని ప్రయోజనంలేదు. పుణ్యక్షేత్రాల్లో కూడా జనవరి ఒకటి ఇసుకవేస్తే రాలనంతగా జనం ఉంటారు. ఇందులో పెద్దగా తప్పు పట్టాల్సింది ఏమీ లేదు.

కొత్త సంవత్సరం కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త సంకల్పాలు సహజం. అయితే ఏడాది అంతా ఆ సంకల్పాలను పొదివిపట్టుకుని నడిచేవారెందరు అన్నదే ప్రశ్న. జనవరి ఒకటిన ఉత్సాహం నింపుకోవడంలో తప్పులేదు. ఆ ఉత్సాహం ఏడాది అంతా కొనసాగేలా చూసుకోవడంలోనే ఉంది సవాలు.

సంస్కృతంలో ఒక వేదాంత ధోరణి శ్లోకం. మనిషి ఆయుష్షు వందేళ్లు సంపూర్ణంగా లెక్కకట్టినా- అందులో సగం నిద్రకే పోతుంది. అంటే మిగిలింది 50 ఏళ్లు. ఈ యాభైలో 25 ఏళ్లు చదువు సంధ్యలు, ఉద్యోగ సద్యోగాలకు పోతుంది. నికరంగా మనిషి తనను తాను నిరూపించుకోవడానికి మిగిలింది 25 ఏళ్ళే.

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెదజన్మకు నూరేళ్లు ఎందుకు?
రోజే చాలులే . . . అంటాడు వేటూరి.
సార్థకమయిన జీవితం గడపాలనుకుంటే క్షణకాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చట.

అంతములేని ఈ భువనమంతయు పురాతన పాంథశాల . . అంటాడు పానశాలలో దువ్వూరి రామిరెడ్డి. ఇంత పెద్ద ప్రపంచం అంతులేని కాలంలో ఒక పాత బాట అట. దీనికి పొద్దున సాయంత్రం రెండు ద్వారాలట. ఎవ్వరయినా పొద్దున ద్వారంద్వారా లోపలికివచ్చి కాసేపు ఉండి; సాయంత్రం ద్వారంలోనుండి బయటికి వెళ్లిపోవాల్సిందే అంటాడు. కాలం ఎకాయెకి దొర్లుతునేయుండు, వెనకకు మరల్పలేము ఒక్క క్షణమయినా . . . అని జాషువా అన్నాడు.

కాలం ఎప్పటికీ మారదు. మారేది మనమే. కాలాన్ని దోషిగా, విలన్ గా చిత్రీకరించి మనమీద నేరం పడకుండా జాగ్రత్తపడ్డామని ఆనందిస్తూ ఉంటాం. మనల్ను చూసి కాలం జాలిగా నవ్వుకుంటూ ఉంటుంది.

సామజవరగమనా . . . కీర్తనలో కాలాతీత విఖ్యాత . . . అని త్యాగరాజు గొప్పమాట వాడాడు. కృష్ణుడిగా అవతరించిన రాముడిని ఆయన కాలాతీత విఖ్యాత! అని సంబోధించాడు. అంటే కాలాలకు అతీతంగా అన్నికాలాల్లో కీర్తి ప్రతిష్ఠలతో నిలబడి ఖ్యాతి పొందుతున్నవాడు అని అర్థం.

మనం కాలాతీత విఖ్యాతులు కాకపోయినా, కాలేకపోయినా- మనకాలంలో అయినా విఖ్యాతులు కావడానికి ప్రయత్నించవచ్చు. లేదా కాలగతిలో నలుగురు మనగురించి చెడ్డగా చెప్పుకోవాల్సిన అవసరంలేకుండా అతిసాధారణంగా, హాయిగా బతకవచ్చు.

“కాలోహి బలవాన్ కర్తా”. కాలమే అన్నిటికంటే బలమైనది.
-వ్యాసుడి దేవీభాగవతం

నిన్నటి కాలం జ్ఞాపకం.
నేటి కాలం అనుభవం.
రేపటి కాలం ఆశ.

కాలం మాయాజాలం .
కాలం ఇంద్రజాలం.
కాలం నిత్యప్రవాహం.

2026 కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో…

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular