Chameleon- Nitish:
“మానూ మాకును కాను…రాయీ రప్పను కానే కాను
మామూలు ఊసరవెల్లిని నేను…బీహారు ఊసరవెల్లిని నేను…
నాకూ ఒక మనసున్నాదీ…నలుగురిలా ఆశున్నాదీ…
కలలు కనే కళ్ళున్నాయి… అవి కలత పడితె నీళ్ళున్నాయి…
మణిసి తోటి యేళాకోళం ఆడుకుంటే బాగుంటాది…
ఊసరవెల్లి మనసు తోటి ఆడకు నితీష్ మావా! ఇరిగి పోతే అతకదు మల్లా!!”
మనుషుల భాషలు వేరు వేరు కావచ్చు. మనసులది మాత్రం మౌన భాష. భాషలన్నీ ఏకమైనా మనసు కాలిగోటి ధూళికి కూడా సమానం కాకపోవచ్చు. అలా బీహార్ పాట్నా చలి మంచు వేళల్లో ఒక ఊసరవెల్లి చిట్టి మనసులో బద్దలైన అగ్నిపర్వతం కని పెంచిన లావాను అనువదిస్తే…ఇలా ఆత్రేయ మూగమనసు భాషకు పేరడీ అయ్యింది.
సృష్టిలో చిరు ప్రాణి చీమ కష్టాన్ని చూసి నారదుడి మనసు కరిగిపోతుంది. “నేను నేరుగా వైకుంఠానికి వెళుతున్నాను. నిన్నక్కడ దించేస్తాను. పునరావృతి రహిత శాశ్వత వైకుంఠ ప్రాప్తి దక్కుతుంది…దా! పోదాం!” అంటాడు నారదుడు చీమతో. “ఊరుకోండి స్వామీ! పట్టపగలు నడివీధిలో ఇలా నా పరువు పంచనామా చేయకండి! నా సంసారం కొన్ని తరాలపాటు నిలదొక్కుకోవడానికి నా పాట్లేవో నేను పడుతున్నాను. ఆ వైకుంఠం నాకెందుకు? నా చిట్టి మట్టి గూడే నాకు వైకుంఠం” అని చీమ రివర్స్ ప్రవచనంతో నారదుడికి ఉచిత జ్ఞానబోధ చేస్తుంది. నారదుడు నవ్వుకుని చీమను వదిలేస్తాడు.
…అలా సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి. ఊసరవెల్లి కష్టాలు ఊసరవెల్లివి. అనాదిగా ఊసరవెల్లి మనోభావాలను మానవజాతి గాయపరుస్తూనే ఉంది. తాజాగా బీహారులో ఊసరవెల్లులు సిగ్గుతో తలలు దించుకున్నాయి.
సృష్టిలో బ్రహ్మ ఎందుకో తమకు ఆటోమేటిగ్గా ఒంటి రంగులు మార్చుకునే శరీర నిర్మాణం ఇచ్చాడు. ఏ చెట్టు ఆకు మీద ఉంటే ఆ రంగు రావడం వల్ల ఇతర జీవులు గుర్తించకుండా…ప్రాణ రక్షణ కలుగుతోందని అనాదిగా ఊసరవెల్లులు రోజూ సూర్యోదయాన్నే బ్రహ్మకు రంగులు మార్చకుండా కృతఙ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాయి.
అలాంటిది…రెండ్రోజులుగా బీహార్లో ఊసరవెల్లులకు మనసు మనసులో లేదు. రంగులు మార్చుకోవడం మానేసి…మొహం వివర్ణమై దిగులు దిగులుగా ఉన్నాయి. అభం శుభం తెలియని ఒక పసి ఊసరవెల్లి అమాయకంగా ఒక పండు ముసలి ఊసరవెల్లిని ఇలా అడుగుతోంది!
“నితీష్ ఇప్పటికి మార్చిన రంగులెన్ని? మనకంటే ప్రాణరక్షణ కోసం మన ప్రమేయం లేకుండానే మన ఒంటి రంగు మారిపోతుంది. ఆయనకు అలా ఆటోమేటిగ్గా రంగులు మారే శరీర నిర్మాణం దేవుడు పెట్టాడా? ఒకవేళ అలా పెట్టి ఉంటే…మనల్ను ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ అని నిందిస్తూ…ఆయనను కీర్తించడం భావ్యమా?
“బావ మనోభావాల్ దెబ్బ తిన్నాయే!” అని ఐటెం సాంగ్ పాడుకునే మానవజాతి ఇప్పుడు మన మనోభావాల్ దెబ్బ తినడం గురించి పట్టించుకోదా? ఏం? మనకు మనసులు ఉండవా? కన్నీళ్లు ఉండవా? ఆత్మాభిమానం అంటూ ఒకటి ఏడ్చి చచ్చింది కదా? కనీసం ఇతర రాష్ట్రాల ఊసరవెల్లుల అస్తిత్వ పోరాట ఐక్య కార్యాచరణ సమితి అయినా ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు నైతిక మద్దతు తెలపవద్దా? ఏ అరుణ్ గోస్వామో “ఊసరవెల్లి వాంట్స్ టు నో” అని జాతీయస్థాయి డిబేట్ పెట్టి ప్యానెల్ డిస్కషన్ కు మనల్ను పిలవద్దా? …
…ఇలా చిట్టి ఊసరవెల్లి గుక్క తిప్పుకోకుండా అడుగుతున్న ప్రశ్నలు పాట్నాలో ప్రతిధ్వనిస్తుండగా…నితీష్ రంగు మార్చి…రాజీనామా చేసి…కొత్త రంగు చల్లుకుని ప్రమాణస్వీకారం చేయడం కూడా పూర్తయిపోయింది. బీహార్లో మేఘాలు రంగులు మార్చుకోలేక బరువెక్కిన గుండెతో వితవుట్ టియర్స్ వెక్కి వెక్కి ఏడ్చాయి…ఊసరవెల్లులకు మద్దతుగా!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018