Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవిశ్వకవి ఠాగూర్

విశ్వకవి ఠాగూర్

Remembering: Rabindranath Tagore – poet, writer, playright, composer, philosopher, social reformer and painter

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే నాకు అభిమానం కలగడానికి ముఖ్యకారణాలు రెండు.
ఒకటి – ఠాగూర్ గీతాంజలిని అనువదించిన చలంగారి పుస్తకం చదవడం.
రెండు – తల్లావజ్జల లలితా ప్రసాద్ తెలుగులో రాసిన ఠాగూర్ కవితలను అప్పుడప్పుడూ చదువుతుండేవాడిని. నాకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడంవల్ల అనువాదాలు చదవడంతో తృప్తిపడుతుండేవాడిని.

అంతేకాదు, బుజ్జాయి అనే పిల్లల మాసపత్రికకు గీతాంజలిని నాకర్థమైన మేరకు తెలుగులో అనుసృజించి ఇవ్వగా ప్రచురించిన అప్పారావుగారికి కృతజ్ఞతలు. కానీ ఇక్కడో విషయం చెప్పుకోవలసి ఉంది. రాసింది నేనైనా అది మారుపేరుతో అచ్చవడం. అదలా ఉండనిస్తే ఠాగూర్ గురించి అప్పుడప్పుడూ అక్కడక్కడా చదివిన కొన్ని ముఖ్యాంశాలనుకున్నవి ఇక్కడ ఇస్తున్నాను.

1861 మే 7వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు. బెంగాలీ క్యాలండర్ ప్రకారమైతే ఇది బైశాక్ మాసంలో ఇరవై అయిదో రోజు, రవీంద్రనాథ్ ఠాగూరుని గురుదేవ్, కబిగురు, బిశ్వకబి వంటి పేర్లతోనూ పిలిచేవారు, ఆయనను చనువుగా పిలిచేది రబీ అని, ఠాగూర్ తల్లిదండ్రులు దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవి. పద్నాలుగు మంది పిల్లల్లో ఆఖరి వాడు ఠాగూర్, ఆయన తండ్రి దేవేంద్రనాథ్ బ్రహ్మ సమాజ వ్యవస్థాపకులలో ఒకరు.

ఠాగూర్ సోదరి పేరు స్వర్ణకుమారి దేవి.ఆమె కవయిత్రి. నవలా రచయిత్రి. బెంగాల్లో ఆమె ప్రప్రథమ మహిళగా రచనలు ఖ్యాతి పొందారు. ఆమెకు సంగీతంలోనూ మంచి ప్రవేశముంది. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.

తన ఆరవ ఏట ఠాగూర్ మొదటి కవిత రాశారు. 1877లో ఆయన కవితల పుస్తకం మొదటిసారిగా అచ్చయింది. పదహారో ఏట ఆయన కథలు, నాటకాలు రాశారు.పదిహేడో ఏట వరకు ఆయన ఇంటి దగ్గరే చదంవుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లండులో చదువుకున్నారు. తమ కుమారుడిని బారిస్టర్ గా చూడాలన్నది తండ్రి దేవేంద్రనాథ్ గారి కోరిక. ఈ క్రమంలోనే ఠాగూర్ ఇంగ్లండులోని బ్రైటన్లో ఓ స్కూల్లో చేరారు. లండన్లోని యూనివర్సిటీ కాలేజీలో కొంత కాలం లా చదివారు. మధ్యలోనే అక్కడ చదువు మానేశారు. షేక్సియర్ రచనలను అధ్యయనం చేయడంపై ఆయన దృష్టి మళ్ళింది.

1883లో ఠాగూర్ వివాహం మృణాళిని దేవితో జరిగింది. అప్పుడామె వయస్సు పదకొండేళ్ళు. ఠాగూర్ దంపతులకు అయిదుగురు పిల్లలు.ఠాగూర్ భార్య, ఇద్దరు పిల్లలు శాంతినికేతన్లోనే మరణించారు. 1905 జనవరి 5న ఠాగూర్ తండ్రి చనిపోయారు.

1912లో ఠాగూర్ మళ్ళీ ఇంగ్లండుకి వెళ్ళారు. ఠాగూర్ గీతాంజలి ఇంగ్లీష్ అనువాదానికి ఆంగ్లో ఐరిష్ కవి విలియం బట్లర్ ఈట్స్ ముందుమాట రాశారు. ఈ పర్యటనలో ఠాగూర్ ఎజ్రా పౌండ్, జి.బి. వెల్స్, థామస్ ఎస్. మూర్, జార్జి బెర్నార్డ్ షా తదితర ప్రముఖులెందరినో కలిశారు.

ఆయన గీతాంజలికి 1913లో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి లభించింది.

ఈ గీతాంజలికి దేశ, విదేశ భాషలలో అనేక అనువాదాలున్నాయి. అంతెందుకూ, మన తెలుగులోనే నలభై యాభైకిపైగా అనువాదాలున్నాయి. గుడిపాటి వెంకట చలం, రాయప్రోలు సుబ్బారావు, కె.వి.రమణారెడ్డి, ఆదిపూడి సోమనాథరావు, బొమ్మకంటి వేంకట సింగరాచార్య, కొంగర జగ్గయ్య, బెందాళం కృష్ణారావు, చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు, మువ్వల సుబ్బరామయ్య, నాగరాజు రామస్వామి, శంకరంబాడి సుందరాచారి, బెజవాడ గోపాలరెడ్డి, బెల్లంకొండ రామదాసు, అమరేంద్ర, మసన చెన్నప్ప, డా. భార్గవి తదితరులు గీతాంజలిని ఆంధ్రీకరించారు.

నోబెల్ పురష్కారానికి లభించిన పారితోషికంతోనూ, తానుస్వ యంగా సేకరించిన విరాళాలతోనూ ఠాగూర్ శాంతినికేతన్ లో విశ్వభారతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అమర్త్యసేన్, సత్యజిత్ రే, ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు ఈ విశ్వభారతిలో చదువుకున్నారు.

1915లో అయిదో కింగ్ జార్జ్ చేతుల మీదుగా సర్ టైటిల్ పొందారు. అయితే మరో నాలుగేళ్ళకు ఆ టైటిల్ తిరిగిచ్చేసారు. జలియన్ వాలా బాగ్ ఊచకోతకు నిరసనగా ఆయన సర్ టైటిల్ వాపస్ చేశారు.

అరవయ్యో ఏట ఠాగూర్ బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. ఆయన పెయింటింగ్స్ ని యూరప్ దేశాల్లో ప్రదర్శించారు.

మన దేశానికి, బంగ్లాదేశ్ కి ఠాగూర్ జాతీయ గీతం రాశారన్నది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఆయన బెంగాలీలో రాసిన మరొక గీతమే శ్రీలంక జాతీయగీతమైంది. ఠాగూర్ శిష్యుడైన ఆనంద సమరకూన్ బెంగాలీ నుంచి శ్రీలంక అధికార భాష సిన్హలలోకి అనువదించారు.

1926లో ఠాగూర్ ఇటలీ వెళ్ళి ముస్సోలినిని రోమ్ నగరంలో కలిసారు. వీరి భేటీపై కొంత చర్చ జరిగిందికూడా.

ఠాగూరే మొట్టమొదటగా గాంధీజీని “మహాత్మా” అని పిలిచారు.శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ని 1930 – 31 సంవత్సరాల మధ్య కనీసం నాలుగుసార్లు కలిసిన ఠాగూర్ తొలిసారి ఐన్ స్టీన్ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ ఇద్దరూ నోబెల్ బహుమతి గెల్చుకున్నవారే. 1913లో ఠాగూర్ కి సాహిత్య విభాగంలో ఈ అవార్డు దక్కితే ఐన్ స్టీన్ కి 1921లో భౌతిక శాస్త్రంలో లభించింది.

ఓమారు ఠాగూర్ గాంధీజీని విమర్శించకపోలేదు. 1934 జనవరి 15న బీహారులో భూకంపం సంభవించింది. అప్పుడు గాంధీజీ “కులతత్వాన్ని పాటిస్తున్న కారణంగానే దేవుడు ఆగ్రహించి భూకంపంతో బీహార్ ప్రజలను శిక్షించాడు” అని చేసిన వ్యాఖ్యను ఠాగూర్ తీవ్రంగా దుయ్యబట్టారు.

ఠాగూర్ తన జీవితంలో చివరి నాలుగేళ్ళు ఆరోగ్యపరంగా ఎన్నో అవస్థలు పడ్డారు. కోమాలోకి వెళ్ళిపోయారకూడా. అప్పుడప్పుడూ ఆయన స్పృహలోకొచ్చేవారు. అటువంటి సమయాల్లోనూ ఆయన కవితలు రాయడం విశేషం. ఈ కవితలతో ఆయన మృత్యువుకెలా చేరువయ్యానో రాసుకున్నారు. 1941 ఆగస్టు ఏడవ తేదీన ఠాగూర్ కోలకత్తాలో తుదిశ్వాస విడిచారు. అప్పుడాయన వయస్సు ఎనబై ఏళ్ళు.

ఆయన స్మృత్యర్థం మన దేశంలో మూడు, బంగ్లాదేశ్ లో మ్యూజియంలు ఏర్పాటయ్యాయి.

ఠాగూర్ రాసిన పుస్తకాలలో ఇరవై రెండు స్పానిష్ భాషలోకి అనువదింపబడ్డాయి.నాకు అప్పుడప్పుడూ ఆదివారాలపూట అబిడ్స్ (హైదరాబాద్)కి వెళ్ళి నాకు నచ్చిన ఒకటి రెండు పుస్తకాలు కొనడం అలవాటు. అలా ఓమారు అబిడ్స్ జీపీవో ముందర తెలుగులో ఠాగూర్ బాల్యస్మృతులతోపాటు మరొక పుస్తకంకూడా కొన్నాను. కానీ ఎలా మరచిపోయానో తెలీదు, ఠాగూర్ పుస్తకాన్ని కొన్న చోటే వదిలేశాను. కానీ దానికి బదులు అక్కడి నుంచి మరొక చిన్న పుస్తకం తెచ్చుకున్నాను. కొంత దూరం వెళ్ళాక ఇది తెలుసుకుని ఠాగూర్ పుస్తకం కోసం తిరిగి అబిడ్స్ పుస్తకాల దుకాణానికి వెళ్ళానే గానీ ఫలితం లేకపోయింది. చాలా బాధపడ్డాను.

– యామిజాల జగదీశ్

Also Read:

సంపద తెచ్చిన పైత్యం

Also Read:

సార్ పోస్ట్!

Also Read:

భారతీయ సంస్కృతిపై అటామిక్ బాంబు దాడి

RELATED ARTICLES

Most Popular

న్యూస్