Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసందర్భం డిమాండ్ చేసింది!

సందర్భం డిమాండ్ చేసింది!

We Swear:  ఊరవతల పెద్ద ఏ సీ ఫంక్షన్ హాల్. చిన్నా పెద్దా విలేఖరులు ఒక్కొక్కరు వచ్చి ముందు వరుసలో కూర్చుంటున్నారు. లైవ్ వాహనాలు కాన్వాయ్ లా ఆగకుండా వస్తూనే ఉన్నాయి. కెమెరాలు, మైకులు లెక్కే లేదు. సీరియస్ గా సబ్జెక్ట్ కు మాత్రమే పరిమితమై హుందాగా ప్రశ్నించే రిపోర్టర్లు మొదలు టింగరి టింగరిగా తమ ప్రశ్నలు తమకే అర్థం కాకుండా అడిగే ‘కవరేజ్’ రిపోర్టర్ల వరకు అందరితో హాల్ నిండిపోయింది.

స్టేజ్ వెనుక ఫ్లెక్సీలో-
“తెలుగు సినిమా నిర్మాతల జీవన్మరణ వాంగ్మూలం- వేదిక- తేదీ”
అని చిక్కటి తెలుగులో అక్షర దోషాల్లేకుండా చక్కగా ఉంది. సాధారణంగా “టెల్గూ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ లైఫ్ అండ్ డెత్ డిక్లరేషన్” అని ఇంగ్లీషులోనే ఉండాలి. దెబ్బతిన్నప్పుడు అమ్మా అని అసంకల్పితంగా మాతృ భాషలోనే మాట్లాడతాము కాబట్టి…ఈ విషాద వేళ నిర్మాతలకు మాతృ భాష విలువ తెలిసినట్లు ఉంది.

స్టేజీ మీద మూడే సీట్లున్నాయి. వరుసగా పేరు మోసిన నిర్మాతలు ముగ్గురూ వచ్చి కూర్చున్నారు. అన్ని టీ వీ ఛానళ్లలో, అన్ని యూ ట్యూబ్ ఛానళ్లలో ఇదే లైవ్ వస్తోంది.

సినిమా ఫంక్షన్లు ఏవయినా సినిమాటిగ్గానే ఉంటాయి. ఉండాలి. అదే దానికి బలం- అదే బలహీనత కూడా. అరచేతి మందం నిండు మేకప్ తో, జిగేల్ జిగేల్ మనే డ్రస్సుతో మొదట యాంకర్ ఉపన్యాసం ప్రారంభమయ్యింది. అందరు యాంకర్లు సుమలు కాలేరు కాబట్టి…రాసిచ్చిన స్క్రిప్ట్ కూడా వాక్యానికొక తప్పుతో తడబాటు లేకుండా చెప్పుకుపోతోంది యాంకరమ్మ. యాక్చువల్లీ ఈ సమావేశానికి మా ఇన్వైట్ ఇవ్వగానే వచ్చిన మీకందరికీ ఒక బ్లాక్ బాస్టర్ సెన్సేషనల్ న్యూస్ ఇవ్వబోతున్నాం అని మొహం మీద మేకప్పును తడి కర్చీఫ్ తో అద్దుకుంటూ, మొహం మీద పడే జుట్టును వెనక్కు తోసుకుంటూ, మైకును పట్టుకోలేక పట్టుకుని ప్రకటించింది.

మా హీరో వేధించలేదు:
పేరు మోయలేక మోస్తున్న మొదటి నిర్మాత నిర్వికారంగా, నిస్తేజంగా, నిరాశగా, నీరసంగా, నిస్పృహగా మాట్లాడ్డం మొదలు పెట్టాడు. ఆయన మాటలు యథాతథంగా-
“నేను ఈ ఇరవై ఏళ్ళల్లో ఇరవై భారీ సినిమాలు తీశాను. తెలుగులో వందల కోట్లతో సినిమా నిర్మాణం అన్నది నాతోనే మొదలు. యావత్ భూ ప్రపంచంలో ఉన్న నా ఆస్తులన్నీ అమ్ముకుని అభిరుచిగల సినిమాలు నిర్మించాను. తాజాగా నేను తీసిన మూడు వందల కోట్ల సినిమా విడుదల తరువాత మూడు కోట్లే రాబడి వచ్చినా నేనేమీ బాధ పడలేదు. కానీ నా ఆరాధ్య దైవమైన నా హీరోతో నేను గొడవ పడ్డానని…నా దైవానికి నేనివ్వాల్సిన రెండొందల కోట్ల రెమ్యూనరేషన్లో చివరి 65 కోట్లు ఇవ్వకపోతే…నా దైవం నన్ను బెదిరిస్తే…అప్పటికప్పుడు నేను ఉంటున్న ఇల్లు, ఊరవతల నా పదెకరాల సెవెన్ స్టార్ ఫార్మ్ హౌస్ అమ్మి…అప్పటికప్పుడు బ్యాలెన్స్ మొత్తం సెటిల్ చేస్తేనే…నా దైవం నేను నిర్మించిన సినిమా విడుదలకు అంగీకరించాడని…సామాజిక మాధ్యమాల్లో నా ఇల్లు, ఫార్మ్ హౌస్ ఫోటోలు, వీడియోలతో వైరల్ అవుతున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు.

అనేక గొడవల తరువాత నా ఆరాధ్య దైవం నన్ను బెదిరిస్తేనే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు వస్తున్న వార్తలను కూడా నేను ఖండిస్తున్నాను. నా ఇతర వ్యాపారాల్లో నష్టాల వల్ల సరిగ్గా ఈ సినిమా విడుదలకు ముందు రోజే నా యావదాస్థులను అమ్ముకోవడం వల్ల మీడియా అపార్థం చేసుకుంది. నా దైవం నన్ను వేధించలేదని చేతులు జోడించి వివరణ ఇచ్చుకుంటున్నాను. ఇంతకంటే ఈ సమయంలో నేను ఇంకేమీ మాట్లాడలేను. చచ్చిన పామును కొట్టి కొట్టి ఇంకా చంపాల్సిన పనిలేదు. సందర్భం డిమాండ్ చేసింది కాబట్టి ఈ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది- అంతే”.

మా దర్శకుడు ఏడిపించలేదు:
తెలుగు సినిమాను తెలుగు నేల మీద తప్ప ప్రపంచమంతా తిప్పి నిర్మించే మరో పేరు మోసిన అంతర్జాతీయ నిర్మాత మైకందుకుని గంభీరంగా మాట్లాడుతున్నాడు.
“పొద్దున దుబాయ్ బుర్జ్ ఖలీఫా వందో అంతస్థు బాల్కనీలో కూర్చుని మా నెక్స్ట్ ప్రాజెక్ట్ “ఎక్స్” గురించి మా “వై” హీరోతో స్టోరీ డిస్కషన్లో ఉండగా మా “జెడ్” మేనేజర్ ఫోన్ చేసి అర్జంటుగా హైదరాబాద్ రమ్మంటే చార్టర్డ్ విమానం అద్దెకు తీసుకుని…నేరుగా ఈ ప్రెస్ మీట్ కు వచ్చాను. శంషాబాద్ లో మా పైలట్ ఇంజన్ ఆన్ లోనే పెట్టుకుంటాను…వెంటనే వచ్చేయండి అన్నాడు…నాకెక్కువ టైమ్ లేదు. రెండు నిముషాలు మాట్లాడి వెళ్ళిపోవాలి. మా హీరో అక్కడ బాల్కనీలో ఒకడే వెయిట్ చేస్తూ ఉంటాడు.

మొన్న నేను నిర్మించిన సినిమా ఖర్చు 500 కోట్లు. 750 కోట్లు వస్తుందని మా దర్శకుడు చెప్పాడు. ఏడు కోట్ల యాభై లక్షల గ్రాస్ వచ్చింది. మరో ఏడు లక్షల యాభై వేల ఓవర్సీస్, శాటిలైట్, ఓటీటీ రైట్స్ మీద వచ్చింది. ఈ మొత్తం గ్రాస్ మొన్న మా దర్శకుడి కొత్త ఇంటిముందు లాన్ గ్రాస్ కు సరిపోయింది.

అడవిలో అన్నలకు పాఠాలు చెప్పే కథ డిమాండు చేయడంతో ఊరవతల వెయ్యెకరాల్లో అడవి సెట్ వేయడానికి అయిదు వందల కోట్లు ఖర్చయ్యిందే తప్ప...ఇందులో దర్శకుడి అంచనా తప్పు కాలేదు. షూటింగ్ గ్యాప్ లో మా దర్శకుడు “అడవిగాచిన వెన్నెల”; “ఆటవిక న్యాయం” పుస్తకాలు పదే పదే చదివే వాడు. ఐదేళ్లలో మా అడవి సెట్ నిజమయిన అడవికంటే దట్టంగా పెరిగి నిజమయిన కౄర మృగాలు రావడంతో…ఆ అడవిని మేము రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వడంతో వచ్చినది కీర్తి లాభమే కానీ…నష్టం కాదు. సందర్భం అలా డిమాండ్ చేసింది.

నేను ఒక్కో పాటకు అయిదు కోట్లు ఖర్చు పెట్టినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా సత్యదూరం. ఒక్కో పాటకు ఖర్చు జస్ట్ నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షలా తొమ్మిది వందలా తొంభై తొమ్మిది రూపాయలే. అది కూడా ఈమధ్య తెలుగు ప్రేక్షకులు సంస్కృతం పాటలకు ఎగబడుతుండడంతో వారణాసిలో పుట్టి అమెరికాలో పెరుగుతున్న అవధి గాయకుడితో పాడించడానికి, ఒరిస్సాలో పుట్టి జర్మనీలో స్థిరపడ్డ రచయిత చేత రాయించడానికి, రాజస్థాన్ లో పుట్టి భోజ్ పురిలో పెరిగి లండన్లో స్థిరపడ్డ సంగీత దర్శకుడి చేత స్వరకల్పన చేయించడానికి కొంత ఖర్చయ్యింది తప్ప…మేమనుకున్న అవుట్ పుట్ వచ్చింది. మా సినిమాకు డబ్బు రాకపోయినా…“వస్త్ర చోరా! ఇస్త్రీ వీరా! శస్త్రాస్త్ర ధీరా! హరా! నరవరా! చరచరా!” అన్న పాటను ప్రపంచవ్యాప్తంగా భాషలకతీతంగా యూ ట్యూబులో ఇప్పటికి 300 కోట్ల మంది చూశారు. ఈ ఏడాది ఆస్కార్ తో పాటు 300 అవార్డులు ఈ పాటకే. రాసి పెట్టుకోండి.

డబ్బు పెట్టిన నిర్మాతగా నన్ను ఒక్క ఫంక్షన్ కు కూడా మా దర్శకుడు పిలవలేదన్నది నిజం కాదు. పిలిచినా నాకు సిగ్గెక్కువ కాబట్టి రాననుకుని…నా సిగ్గు పోకుండా నా దర్శకుడు నన్ను కాపాడాడు…నా హీరో దుబాయ్ నుండి కాల్ చేస్తున్నాడు…నేను పోవాలి- అంతే”.

మా పప్పులు ఉడకలేదు:
మరొక నిర్మాత మైక్ అందుకున్నాడు.
“నేను మొదట అతి పెద్ద నిర్మాతను. తరువాత దర్శకుడిని అయ్యాను. ఆపై నటుడ్ని అయ్యాను. మా అబ్బాయిని హీరోను చేశాను. మా పప్పులు ఉడకలేదు. ప్రస్తుతం ఇద్దరం సైడ్ క్యారెక్టర్లు వేస్తున్నాం. మా ఇద్దర్నీ ప్రోత్సహించాల్సిందిగా పరిశ్రమను వేడుకుంటున్నాను. సందర్భం డిమాండ్ చేసే ఏ సిచ్యువేషన్ లో అయినా నేను, మా అబ్బాయి కలివిడిగా అయినా…విడి విడిగా అయినా…నటించడానికి సిద్ధంగా ఉన్నాము”.

ప్రెస్ మీట్ ముగిసినట్లు యాంకర్ నెత్తిమీద విరబోసుకున్న ఒత్తయిన జుత్తును ప్రతీకాత్మకంగా చేతులు పెట్టుకుని సవరించుకుంటూ ప్రకటించింది.

కొసమెరుపు:-
దశాబ్దాల పాటు విసుగు, విరామం లేకుండా సినిమా నిర్మాణంలో మునిగి తేలిన హిమాలయమంత తెలుగు నిర్మాతలు, స్టూడియో యజమానులు దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, అక్కినేని నాగార్జున ఇప్పుడెందుకు సినిమాలు తీయడం లేదన్న ఒక విలేఖరి ప్రశ్న పొరపాటున మైక్ ఆన్ లోనే ఉండడం వల్ల లైవ్ లో కూడా వచ్చేసింది. అది విన్న సురేష్ బాబు, అరవింద్, నాగార్జున ముసి ముసిగా నవ్వుకున్నారు!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్