“నమ్మరే!
నేను మారానంటే నమ్మరే!
నేనొకనాడు దొంగని
అయితే మాత్రం ఏం?
బాగుపడే యోగం లేదా?
బ్రతికే అవకాశం ఈరా ?
చెడినవాడు చెడే పోవాలా ?
పాతిపెట్టిన పాతబ్రతుకు వలవేస్తుంది
కోరుకున్న కొత్త జీవితం వెలివేస్తుంది
కష్టం చేస్తానంటే కాదంటారే?
నా శ్రమలో ద్రోహం ఉందా?
నా చెమటలో దోషముందా?
ఎవరు నమ్మకున్నా…
నన్ను నమ్ముకున్న వారున్నారే…
వాళ్ళేం కావాలి?
నేనేం చేయాలి?”
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల
చిత్రం: అదృష్టవంతులు(1969)
సినిమా పాట సుప్రభాతమై, సుశ్లోక నీతిశతకమై ఒక వెలుగు వెలిగిన ఒకానొక స్వర్ణయుగంలో వచ్చిన పాట ఇది.
అలా గతంలో గ్యాంగ్ స్టర్ గా ఉండి…రామాయణం పారాయణం చేయడంవల్ల శ్రీరాముడి మాటకు ప్రభావితమైన ఒక అరుదయిన…గుండెను తడిమే కథ ఇది.
వాల్మీకి ప్రచేతస మహర్షి కొడుకు. వాల్మీకి ముందు పేరు ప్రాచేతసుడు. రామనామ జప తపస్సులో ఏళ్ల తరబడి కదలకుండా ఉన్నప్పుడు ఆయనమీద పుట్ట(వల్మీకం) ఏర్పడడం వల్ల వాల్మీకి అయ్యాడు. “రామ” అని కూడా అనలేని అడవి దొంగ అయిన వ్యక్తికి రుషులు “మ- రా” అనమన్నారని, “మరామరామరా” అంటుంటే అదే “రామ రామ రామ” అయ్యిందని అనాదిగా మనం వింటున్నది కట్టుకథే తప్ప…ఈ కథకు ఎక్కడా పౌరాణిక ఆధారం లేనేలేదని మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి పురాణ సరస్వతులు, పండితులు ఎంతగా చెప్పినా ఎందుకో ఒప్పుకోవడానికి మన మనసు అంగీకరించదు.
తన పేరు ప్రాచేతసుడు అని రామాయణంలోనే వాల్మీకి స్పష్టంగా చెప్పుకున్నాడు. అంతకుమించి ఆయన తన గురించి తాను ఇంకేమీ చెప్పుకోలేదు కాబట్టి…మన నోటికొచ్చినట్లు కథలల్లి...ఆయనచేత దారిదోపిడీలు చేయించాము. రుషుల మెడలో హారాలను కూడా దోచుకోమని చెప్పాము. చివరికి నారదుడి వీణ మహతిని కూడా పావలాకు అమ్ముకోవచ్చు…దోచుకో! అని వాల్మీకికి ప్రాంప్టింగ్ ఇచ్చాము. మనం చెప్పినట్టల్లా చేసిన వాల్మీకి చేత చివర మనమే తపస్సు చేయించి పుణ్యపురుషుడిని చేసి… అప్పుడు ఆయన చేత ఆది కావ్యం రాయించాము. వాల్మీకి చుట్టూ ఎన్నెన్నో కట్టుకథలు అల్లాము. అవన్నీ ఇక్కడ అనవసరం.
మధ్యభారతంలో ఉన్న వాల్మీకి రుషుల సూచనమేరకు తమసానదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుంటాడు. ఒకరోజు శిష్యుడు భరద్వాజుడితో కలిసి నదిలో స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వస్తుండగా...చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షుల జంటలో ఒకదానిమీద వేటగాడు బాణం వేస్తాడు. గుచ్చుకున్న బాణంతో నేల కూలి…విలవిలాడుతూ పక్షి చనిపోతుంది. అది చూసిన వాల్మీకిలో శోకం శ్లోకరూపంలో వ్యక్తమయ్యింది. ఆ క్షణం నుండి వాల్మీకి మనసు దేనికోసమో అన్వేషిస్తోంది. సకల సద్గుణ సంపన్నుడు ఈ క్షణాన ఈ భూమ్మీద మనమధ్య ఎవరైనా ఉన్నారా? అని నారదుడిని అడుగుతాడు. రాముడి గురించి నారదుడు వాల్మీకికి చెబుతాడు. భూమ్మీద కొండలు, నదులు ఉన్నంతవరకు నువ్ రాయబోయే రామాయణం నిలిచి ఉంటుందని తరువాత బ్రహ్మ అభయమిస్తాడు. అప్పటికే జరిగిన కథను నారదుడిద్వారా విని…రాసినది; తరువాత అందులో తనే ఒక పాత్రగా, సాక్షిగా ఉండి వాల్మీకి రాసినది- రామాయణం.
“రామాయణం” మాట వ్యుత్పత్తి అర్థం- రాముడి నడవడిక. రాముడు నడిచిన దారి; రాముడు చూపిన దారి- రామాయణం.
యుగయుగాలుగా రామాయణాన్ని కోట్ల మంది పారాయణం చేశారు. చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు. రామాయణంలో ఏ కాండ చదివితే ఏ ఫలం దక్కుతుందో కూడా ప్రామాణికంగా నిర్వచించి పెట్టారు. ప్రత్యేకించి సుందరకాండ పారాయణం జగద్విదితం.
రామాయణంలో-
ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక విషయాలు పట్టుకుంటారు. భాషావేత్తలు భాషా సౌందర్యాన్ని పట్టుకుంటారు. వేదాంతులు వేదాంత విషయాలు పట్టుకుంటారు. మంత్రతత్వజ్ఞులు మంత్రశాస్త్ర రహస్యాలు పట్టుకుంటారు. అద్వైతులు రాముడిలో పరబ్రహ్మను పట్టుకుంటారు. చిన్న పిల్లలు హనుమ సాహసగాథలను పట్టుకుంటారు.
ఒక కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ రామాయణం చదివి ఏమి చేశాడో చూడండి!
మధ్యప్రదేశ్ ఉజ్జయిని దగ్గర గ్యాంగ్ స్టర్ రౌనక్ గుర్జర్ చేయని నేరం లేదు. నరరూప రాక్షసుడిలా బతికాడు. ఒకసారి పోలీసు కాల్పుల్లో కాళ్ళు దెబ్బతిన్నాయి. కదలిక తగ్గిపోయింది. దుర్మార్గాలు చేసే శక్తి నశించింది. ఇంటిపట్టున ఊరికే అలా కూర్చోకపోతే “రామాయణం” చదువుకోరాదూ! చేసిన పాపాలూ పోతాయి; పుణ్యమూ వస్తుంది! అని ఎవరో చెప్పారట. అంతే! రామాయణం పుస్తకాలు తెచ్చుకున్నాడు. పారాయణ మొదలుపెట్టాడు. చేస్తూనే ఉన్నాడు.
తల్లి గురించి శ్రీరాముడు రామాయణంలో అన్న ఒక మాట రౌనక్ మనసును తాకింది. “మన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి తల్లికి తొడిగినా…ఆమె రుణం తీరేది కాదు” అన్న రాముడి హితబోధ రౌనక్ ను వెంటాడింది. ఒక ముహూర్తాన డెర్మటాలజిస్ట్ సాయంతో తన తొడ చర్మం కత్తిరించి…నిజంగానే చెప్పులు కుట్టించాడు. ఒక శుభ ముహూర్తాన చుట్టుపక్కల వారందరినీ పిలిచి…తల్లి కాళ్లకు నమస్కరించి…తొడిగాడు. రాముడు చెప్పిన మాటనే తల్లికి చెప్పి…ఆమె కాళ్లమీద పడి కన్నీళ్లతో కడిగాడు. ఆ తల్లి కళ్లల్లో ఆనందబాష్పాలు. చుట్టూ నిలుచుని చూస్తున్నవారి కళ్లల్లో నీటి ధారలు.
రామాయణం ఎందరో పారాయణ చేసి ఉంటారు. రాముడు ఎందరికో హితబోధ చేసి ఉంటాడు. రౌనక్ లా రాముడి మాట విన్నవారెందరు? విని తన చర్మం ఒలిచి తల్లి కాళ్లకు చెప్పులు కుట్టించిన కొడుకు రౌనక్ లా కాకపోయినా…రామాయణం అద్దంలో తమను తాము చూసుకుంటూ…తమను తామే సంస్కరించుకునే వారెందరు?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018