విజయనగర సామ్రాజ్య చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘట్టం…మహామంత్రి తిమ్మరుసును కృష్ణదేవరాయలు శిక్షించడం. ఒక వెలుగు వెలిగిన సామ్రాజ్యానికి దిశానిర్దేశం చేసిన మేధావి, కళ్లు లేని గుడ్డివాడిగా మారి జైలులో ప్రాణాలు విడిచాడా? ఈ కథలో నిజమెంత? చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయి?
అపోహల పునాదులపై అల్లిన కథ
విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు కృష్ణదేవరాయలు, ఆయన కుడిభుజం మహామంత్రి తిమ్మరుసు (అప్పాజీ) గుర్తుకు వస్తారు. రాయలవారిని సింహాసనం ఎక్కించడం దగ్గరి నుంచి, కళింగ యుద్ధం దాకా అన్నీ తిమ్మరుసు వ్యూహాలే. అలాంటిది, రాయల కుమారుడు తిరుమల రాయల మరణానికి తిమ్మరుసే కారణమని భావించి, రాయలు ఆయన కళ్లు పీకించాడనేది జనబాహుళ్యంలో ఉన్న పెద్ద కథ. నాటకాలు, సినిమాలు ఈ కథను మన రక్తంలోకి ఎక్కించేశాయి. కానీ, అసలు చరిత్రలోకి తొంగిచూస్తే ఈ ఇదంతా ఒక కట్టుకథ అని అర్థమవుతుంది.

విషప్రయోగం జరిగిందా? నూనిజ్ ఏం చెప్పాడు?
ఈ అపవాదు పుట్టడానికి మూలం పోర్చుగీసు యాత్రికుడు ఫెర్నావో నూనిజ్. రాయల కొడుకు ఆరేళ్ల వయసులో విషప్రయోగానికి గురై చనిపోయాడని, ఆ కుట్ర వెనుక తిమ్మరుసు కొడుకు ఉన్నాడని రాయలు నమ్మాడని నూనిజ్ రాశాడు. కానీ విదేశీ యాత్రికులు వీధిలో విన్న పుకార్లను కూడా చరిత్రగా రాసే అలవాటు ఉన్నవారనేది మనం మర్చిపోకూడదు. ఆ కాలంలో మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలడం వల్ల పసివాడైన తిరుమల రాయలు మరణించాడని చరిత్రకారులు అనేక ఆధారాలతో తేల్చి చెప్పారు.
శాసనాలు చెబుతున్న సత్యం: తిమ్మరుసు గుడ్డివాడు కాలేదు!
చరిత్రకు అసలైన సాక్ష్యాలు శాసనాలు. నేలటూరి వెంకటరమణయ్య, కె.ఎ. నీలకంఠ శాస్త్రి వంటి ప్రముఖ చరిత్రకారులు శాసన ఆధారాలతో ఈ ‘కనుగుడ్ల కథ’ను కొట్టిపారేశారు.
తిరుమల శాసనం:-
కృష్ణదేవరాయల మరణం తర్వాత కూడా తిమ్మరుసు పేరుతో తిరుమలలో దానధర్మాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి.
రాజపదవులు:-
రాయల తర్వాత వచ్చిన అచ్యుతదేవరాయల కాలంలో కూడా తిమ్మరుసు కుటుంబం గౌరవప్రదమైన హోదాల్లో ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఒకవేళ తిమ్మరుసు రాజద్రోహి అయితే, తర్వాతి రాజులు ఆయన కుటుంబాన్ని ఎందుకు ఆదరిస్తారు?
నాటకీయతలో చరిత్ర బలిపశువు
తెలుగు సాహిత్యం, సినిమాలు ‘సెంటిమెంట్’ కోసం కొన్నిసార్లు చరిత్రను వక్రీకరిస్తాయి. ఒక గొప్ప రాజు, తనను తండ్రిలా చూసుకున్న మంత్రిని శిక్షించడం అన్నది కథలో గొప్ప మలుపు (Twist). అందుకే కవులు, రచయితలు ఈ విషాదాంతాన్ని వాడుకున్నారు. రాయల తండ్రికి ఇద్దరో, ముగ్గురో భార్యలనే విషయంలోనే క్లారిటీ లేని చరిత్రలో.. ఈ కళ్లు పీకించిన ఘటనను గుడ్డిగా నమ్మడం భావ్యం కాదు.

“తిమ్మరుసు లేకపోతే కృష్ణరాయలు లేడు.. కృష్ణరాయలు లేకపోతే తిమ్మరుసు లేడు” అన్నది చరిత్ర పాఠం. సవతి తల్లి కుట్ర నుండి రాయలను కాపాడటానికి మేక కళ్లు చూపించి రాయల ప్రాణాలు కాపాడిన వాడు తిమ్మరుసు. అలాంటి తిమ్మరుసుపై రాయలు కత్తి కడతాడనుకోవడం కేవలం మన ఊహ మాత్రమే. చివర్లో కొడుకు మరణం చూసి రాయలు మానసిక కృంగుబాటుకు గురైన మాట వాస్తవం కానీ, అది తిమ్మరుసుపై కోపంతో కాదు, పుత్ర వియోగం వల్ల కలిగిన వేదన.
అప్పాజీ మచ్చలేని మహనీయుడు
తిమ్మరుసు పట్ల మనకున్న గౌరవాన్ని ఈ కట్టుకథలు తగ్గించలేవు. పెనుగొండలో ఉన్నది తిమ్మరుసు సమాధి కాదు, అది ఒక కట్టడం మాత్రమే. తిమ్మరుసు కుల సంప్రదాయం ప్రకారం ఆయనకు దహన సంస్కారాలే జరిగి ఉంటాయి. కాబట్టి, ఐదు వందల ఏళ్ల నుంచి ప్రచారంలో ఉన్న ఈ “కనుగుడ్ల కథ”ను పక్కన పెట్టి, రాయలు -తిమ్మరుసుల మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని మనం గుర్తుంచుకోవాలి. చరిత్రను వక్రీకరణల నుండి కాపాడుకోవడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

