Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇప్పటి మన పెళ్లి అసలు పెళ్లే కాదా?

ఇప్పటి మన పెళ్లి అసలు పెళ్లే కాదా?

అరెరే!
భారత సర్వోన్నత న్యాయస్థానం- సుప్రీం కోర్టు పుసుక్కున ఎంతమాట అనేసింది! ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే!

అంటే…
కొన్ని దశాబ్దాలుగా ట్రెండు మారిన మన భారతీయ హిందూ పెళ్లి అసలు పెళ్లే కాదా?

వివాహ ఆహ్వానపత్రికలు ముద్రింపించి…మూలలకు పసుపు, కుంకుమ రాసి…మధ్యలో అక్షతలు అద్ది…ఊరూరూ తిరిగి…ఇంటింటికి వెళ్లి…బొట్టు పెట్టి…పెళ్లికి పిలిచే సంప్రదాయాన్ని వాట్సాప్ యూనివర్సిటీ మింగేసింది. వాట్సాప్ లో కాబోయే వధూవరులు పెళ్లికి ముందే తొందరపడి కూసిన…ఎగిరిన…ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిన ప్రీ వెడ్ ప్రత్యేక కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో చేసిన డ్యాన్స్ వీడియోను పడేశాము. చూడలేదా? అదే ఇన్విటేషన్. అదే మా పర్సనల్ పెళ్లి పిలుపు.

ఏమిటీ?
ప్రాణాలకు తెగించి మీరు పెళ్లి పందిట్లోకి వచ్చారా? దానికి మేమెలా బాధ్యులమవుతాం చెప్పండి? ద్వారంలో మీపై పన్నీటి జల్లులు చల్లకపోతే ఈవెంట్ మేనేజర్ బాధ్యుడు. మాకేమి సంబంధం?

ఏమిటీ?
మీరు మంటపంలోకి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించడానికి అమెరికా వీసా కోసం దీనంగా క్యూలో నిలుచున్నట్లు గంటలు గంటలు నిరీక్షించారా? అది ఇసుకవేస్తే రాలని మా పెళ్లి జనసాంద్రత మహిమ. పెళ్లి కూతురి తండ్రినైన నన్నే మా ఫోటోగ్రాఫర్ పక్కకు తోస్తే కింద ఎక్కడో బిక్కు బిక్కుమంటూ గడిపాను. ఇక మిమ్మల్ను ఎలా పట్టించుకుంటాను చెప్పండి?

ఏమిటీ?
వీడియోగ్రాఫర్ అడిగితే మా అబ్బాయి రెండోసారి మంగళసూత్రం కట్టాడని పెదవి విరుస్తున్నారా? తాళికట్టే ఆ సమయానికి కెమెరా యాంగిల్ సరిగ్గా కుదరలేదట. జీవితాంతం గుర్తుండే పెళ్లి మూడు ముళ్ల వీడియో బాగోకపోతే మా అబ్బాయి సంసారమే చేయలేడు. ఫొటోగ్రాఫర్ల పౌరోహిత్యం వల్ల ఇంకోసారి కూడా తాళి కట్టడం ఎగతాళి కానే కాదు. మూడు ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి మొత్తం అయిదు ముళ్లు వేశాడు మావాడు. ఏడడుగులు ప్లస్ కెమెరాలకోసం రిపీట్ అడుగులు కలిపి మొత్తం పాతిక అడుగులదాకా అయి ఉంటాయి. కలిసి కలకాలం నడవాల్సినవారు వంద అడుగులు వేస్తే లాభమే తప్ప…రకంగానూ నష్టం లేదు. మొదటి మూడు ముళ్లు పురోహితుడు చెప్పినప్పుడు జారిపోయేలా ఉన్నా…కెమెరా బాయ్స్ మరో రెండు ముళ్లు రిపీట్ లో గట్టిగా వేయించడంతో అయిదు ముళ్ల బంధం మరింత గట్టి పడిందే కానీ…ఇందులో పెదవి విరవాల్సింది…ముక్కున వేలు వేసుకోవాల్సింది ఏముంది చెప్పండి?

ఏమిటీ?
మా పెళ్లి బఫేలో మీరు అడుక్కుతిన్నా మింగమెతుకు దొరకలేదా? మీరు మీసాలకు సంపెంగనూనె రాసుకుని రాకుండా ఉండి ఉంటే…మింగ మెతుకును సామెత ఇచ్చి ఉండేదేమో!
అయినా… మేము అయిదు వేల మందికి అన్నాలకు క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇస్తే…పది వేల మంది వచ్చారని…అందరికీ పెట్టామని…ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నారే! అయినా…పెళ్లిళ్లల్లో బఫే భోజనం దగ్గర కొంచెం చొరవ, నిస్సిగ్గు, శారీరక బలం, ఓపిక, అడుక్కుతినే దీనత్వం, అన్నానికి ఎంతకాలంగానో మొహంవాచినవారిలా నిలుచుని ఆబగా తినే సహృదయం లేకపోతే ఎలా చెప్పండి!

ఏమిటీ?
మీరు పెళ్లి పందిరి ఎక్కుతూ మంటపం మెట్లదగ్గర తొక్కిసలాటకు కాలుజారి పడ్డారా? తుంటి ఎముక విరిగి ప్రస్తుతం బొమికల డాక్టర్ గురవారెడ్డి పర్యవేక్షణలో పడుకుని ఉన్నారా? పదివేల మంది ఒక్కసారి ఎగబడేచోట మీ జాగ్రత్తలో మీరు ఉండకపోతే ఎలాగండీ? పాపం ఇన్సూరెన్స్ కూడా లేదేమో! మా రెండో అబ్బాయి మొదటి పెళ్లినాటికి లేచి…నడుస్తారా? వాట్సాప్ లో ఇన్విటేషన్ పడేస్తా…టేక్ కేర్. టేక్ రెస్ట్!

ఏమిటీ?
పెళ్లి మంటపంలో ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్లు పురోహితుల భుజాలెక్కారని బాధపడుతున్నారా? బూటు కాళ్లు పెళ్లి హోమాన్ని అపవిత్రం చేశాయా? ప్రత్యేక మేకప్ ఆర్టిస్టుల బిగింపులు, పూతలతో పెళ్లికొడుకు- పెళ్లి కూతురు రోబోల్లా మెడ పక్కకు తిప్పలేకపోతే మీకెందుకు? తిప్పితే మీకెందుకు? రేప్పొద్దున వారు చేయబోయే యాంత్రిక సంసార జీవనానికి ఈ రోబో యాంత్రిక పెళ్లి భంగిమలను పరమ పవిత్ర ప్రతీకలుగానే చూడాలి.

ఏమిటీ?
పెళ్లిలో మీ ఫోటో ఒక్కటి కూడా తీయలేదా? మీ మొహానికి అరచేతి మందం మేకప్పు; మీ పైన కాశ్మీరీ దుప్పట్ల లాంటి ఊపిరాడని జిలుగు బట్టలు; మీ ఒంటి నిండా ఏడువారాల నగలు లేకపోతే…మీ మొహానికి ఫోటో ఎందుకు చెప్పండి!

ఏమిటీ?
మొన్న ఇటలీ మిలాన్ పక్కన ద్వీపంలో మా రెండో అమ్మాయి మూడో సెవెన్ స్టార్ డెస్టినేషన్ వెడ్డింగ్ కు మిమ్మల్ను పిలవలేదని చిన్నబుచ్చుకున్నారా? భలేవారే. ఇంకా నయం. మా బంధువుల్లోనే ఎవరినీ అక్కడికి పిలవలేదు. మా వ్యాపారరాజకీయ; రాజకీయవ్యాపార అవసరాలున్నవారినే పిలిచాము. తరువాత ఇక్కడ సోమాలియా శరణార్థులకు ఐక్యరాజ్యసమితి ఉదారంగా ఆహారపొట్లాల పంపిణీ శిబిరం నిర్వహించినట్లు మా ఫార్మ్ హౌస్లో రిసెప్షన్ పెట్టాము కదా? వేనవేలమంది ముక్కలను ముక్కలు ముక్కలుగా నమిలి మింగారు. మీరు రాలేదా? ఇలాంటప్పుడు పెద్దవారికి ఉండే కష్టాలు మీ చిన్నవారికేమి తెలుస్తాయి?

ఏమిటీ?
ఆ కుర్చీని అట్ల మడత పెట్టి…న బూతో న భవిష్యతి పాటలకు పండు ముసలి మొదలు పాలు తాగే పసిపిల్లలదాకా పెళ్లి పందిట్లో అలా సంగీత్ గెంతులు గెంతకూడదంటారా? కడుపుకు అన్నమే తింటున్నారా మీరు? పెళ్లి పందిట్లో ఆ కుర్చీని అట్లా మడతపెట్టకపోతే…దాన్నసలు పెళ్లంటారా?

“పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు
తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..
మొత్తం కలిసీ నూరేళ్ళు

పెళ్ళైతె ముంగిళ్ళు.. లోగిళ్ళు
ముగ్గులు.. ముత్తైదు భాగ్యాలూ….
ముద్దూ ముచ్చట్లు.. మురిసే లోగుట్లు..
చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు..

గోదారి ఒడ్డున.. గోగుల్లు పూచిన వెన్నెలలో
కొసరాడు కోర్కెలు.. చెరలాడు కన్నుల సైగలలో…

మమతానురాగాల మరుమల్లెలల్లిన పానుపులూ…
హృదయాలు పెదవుల్లో..
ఎరుపెక్కు ఏకాంత వేళల్లో
వలపు పులకింతలో..
వయసు గిలిగింతలో..
వింతైన సొగసుల వేడుకలో…

కలలన్ని కలబోసి.. వెలసిన ఈ పంచవటిలో
ఇల్లాలు నేనై.. ఇలవేల్పు నీవైన కోవెలలో…

సిరిమువ్వ రవళుల మరిపించు
నీ నవ్వు సవ్వడిలో…
కులమన్నదే లేని అలనాటి వేదాల ఒరవడిలో
సామగానాలము..
సరసరాగాలము
ప్రేమికులమన్న కులమున్న లోకంలో
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు…”

అగ్నిచుట్టూ ఏడడుగులు, ప్రమాణాలు, తలంబ్రాలు, మంత్రాశీర్వచనాలు, అక్షతలు, ముత్తయిదు భాగ్యాలు, హృదయాలు ఎరుపెక్కడాలు, వలపు పులకింతలు, వయసు గిలిగింతలు, ఇల్లాలు- ఇలవేల్పులు, ముద్దూ ముచ్చట్లు, కొత్త సంసారానికి తప్పట్లు- తాళాలు…మొత్తం కలిసి- పెళ్లంటే సంప్రదాయాలు సందళ్లు- ఆ సందళ్లు త్రేతాయుగపు పంచవటిలో కష్టసుఖాల్లో కలిసి నడిచిన సీతారాములదాకా చేరే సంకల్పాలు, ఆదర్శాలు– అని సుప్రీం కోర్టు ఇప్పటి తీర్పునే అప్పుడు వేటూరి అనన్యసామాన్యమైన రీతిలో యుగాయగాలకు నిలిచి వెలిగేలా కవితాదర్శంతో చెబితే చెప్పి ఉండవచ్చుగాక.

ఇప్పుడు పెళ్లి పేరిట జరిగే డ్యాన్సులు, వేసే సెట్టింగులు, జరిపే ఈవెంట్లు పెళ్లే కాదని భారత సర్వోన్నత న్యాయస్థానం అంటే మాత్రం మేము ఒప్పుకుంటామా ఏమిటి? హమ్మా! వినేవారుంటే చెప్పేవారు ఏమైనా చెప్తారు!

రండి! రండి!
త్వరగా తెమలండి!
కొరియోగ్రాఫర్ బయట బెల్ కొడుతున్నాడు.
ఊ అంటావా?
మావా ఊహూ అంటావా? పాట సంగీత్ కు ఇంటిల్లిపాదీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. మొన్న ఆ పెళ్లిలో కుర్చీని వాళ్లు సరిగ్గా మడతపెట్టలేక చతికిలబడ్డారు. మనం అలా కాకూడదు. కుప్పిగంతుల అన్న మన ఇంటిపేరు నిలబెట్టాలి. మన ఉన్మత్త గోత్రం పరువు నిలపాలి. డ్యాన్స్ అదరగొట్టాలి. పెళ్లి పందిట్లో ముహూర్తం వేళ మన డ్యాన్స్ చూసి సమంతే సిగ్గుతో తలదించుకోవాలి!

ఏయ్! ఎవర్రా అక్కడ?
డి జె ఆడియో ప్లే చేయండి!
రెడీ! స్టార్ట్ కెమెరా! యాక్షన్!
ఎగరండి పందిట్లో!
త్రీ…టూ…వన్…హియర్ వుయ్ గో…

“మాంగల్యం తంతునా…నేను?
మమ జీవన సంగీత్ హేతవే!
కంఠే బద్నామి సుభ యాంగిల్!
త్వం జీవ ఫోటో శతం!”

చూడబోతే…
సుప్రీం కోర్టు తాజా తీర్పు ప్రకారం ఈమధ్య జరిగిన మా పెళ్లిళ్లు పెళ్లిళ్లే కాదంటారా? ఏమిటి?
మరి మేము పెళ్లయ్యిందనుకుని సంసారాలు చేస్తూ…పిల్లలను కూడా కని…వారికి కూడా ఈ మోడల్ పెళ్లిళ్లే చేస్తున్నామే! మా తెలుగు యాంకర్లు పెళ్లిని పెల్లి అని అనడం మొదలుపెట్టినప్పటినుండే పెళ్లిలో తాళి ఎగతాళి అయి…పందిట్లో బఫే తాలికి అతిథులు ఎగబడాల్సిన ఎగతాలి అయినట్లుంది!

లోకకల్యాణాన్ని కాంక్షించే మిలార్డ్స్!
హిందూ సంప్రదాయ వ్యతిరేకమైనా సరే…మా నవీన కల్యాణాలను పెద్దమనసుతో గుర్తించండి యువరానర్! గుర్తించండి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్