నా తదుపరి సాహసయాత్ర బహుశా మరణం. మరణించాక ఇంకేమీ లేదనుకుంటే గొడవే లేదు. అలాకాకుండా కొత్త విషయం ఉందంటే అంతకు మించిన సాహసయాత్ర ఇంకోటి లేదు”

-జేన్ గుడాల్, పర్యావరణ శాస్త్రవేత్త, మానవతావాది

నిన్నటి వరకు ఈ మహిళామణి గురించి తెలీదు. ఆమె మరణించాక ఇప్పుడు ఇన్నాళ్లూ తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నాను. ఈ రోజు నా సోషల్ మీడియా నిండా జేన్ గురించి అనేక వార్తలు. డీ కాప్రియో నుంచి ప్రిన్స్ హ్యారి వరకు ప్రపంచం నలుమూలలనుంచి ప్రముఖుల సంతాపాలు. ఒక మనిషి తన జీవితకాలంలో ఇంత కృషి చేయగలరా అనిపిస్తుంది. బ్రిటన్ ఈమె పుట్టిల్లు. అడవులు, జంతువులంటే మక్కువ. చింపాంజీలంటే మరీ ఇష్టం. ఆ ఇష్టమే వాటిగురించి పరిశోధించేలా పురిగొల్పింది. గైడ్ లీకీ సాయంతో 26 ఏళ్ళ వయసులో టాంజానియా అడవుల్లో కాలు పెట్టింది మొదలు అరవైయేళ్లపాటు అదే లోకంగా జీవించారు. కర్ర ఉపయోగించడం, భావవ్యక్తీకరణ, సామాజిక సంబంధాలు మనుషులకు మాత్రమే అనే అభిప్రాయం తప్పంటూ చింపాంజీలూ ఆలోచిస్తాయి, కుటుంబం కోసం కష్టపడతాయని నిరూపించారు.

మొదట్లో ఆడపిల్ల అని జేన్ పరిశోధనకు నిధులు సరిగా ఇవ్వలేదు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రోత్సాహంతో ఆమె పరిశోధనలు వెలుగుచూశాక విజ్ఞానరంగంలో అమ్మాయిల ప్రవేశానికి మార్గం ఏర్పడింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.

మొదటిసారి తల్లి ప్రోత్సాహంతో టాంజానియా జొంబీ అడవుల్లో చింపాంజీలపై పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. వాటికి పేర్లు పెట్టి పిలుస్తూ ఆదరంగా చూసేవారు. జేన్ పరిశోధనల ఫలితంగా చింపాంజీలపై అమానుష ప్రయోగాలు ఆగాయి. అనేక సంరక్షణ సంస్థలు ఏర్పడ్డాయి.

ఈ భూమిపై ఉన్న అన్ని ప్రాణులకూ జీవించే హక్కు ఉందంటారు జేన్. ఆమె ప్రకృతిని పరిశీలించి ఊరుకోలేదు. ఆ శబ్దాలు చెవులారా విని, కలసి పయనించారు. ప్రపంచం ఆ శబ్దాన్ని వినడానికి నిరాకరిస్తే తానే స్వరమయ్యారు. నిజమైన నాయకత్వం అంటే ఇతరులపై అధికారం చలాయించడం కాదని, అన్ని జీవులపట్ల దయగా ఉండటమని నిరూపించారు. కళ్ళలో దయ, గుండెనిండా ప్రేమతో అడవులను తరగతిగదుల్లా ప్రపంచానికి పరిచయం చేశారీమె. సానుభూతి, ధైర్యం కలబోసిన ఒక మహిళ ఏదైనా చేయగలరని, ఇతర జీవులకు మేలు చేస్తూ ముందుతరాలకు ఆ స్ఫూర్తి అందించవచ్చనడానికి జేన్ సజీవ తార్కాణం. శునకం తనకెంతో ఇష్టమైన జంతువని, పెంపుడు కుక్క ద్వారా ఎన్నో నేర్చుకున్నానని అనేవారు. ఎప్పుడూ మూగజీవులతో గడిపేందుకు ఇష్టపడే జేన్ తన 90 వ పుట్టిన రోజు నాడు 90 శునకాలతో గడపడం మరచిపోలేని అనుభూతి అనేవారు. 91 ఏళ్ల వయసులో అమెరికాలో ఒక సదస్సు కోసం వెళ్లి, మరణించారు. నిండు జీవితాన్ని పరిశోధనలో గడిపి ఆ విజ్ఞానాన్ని అనేక పుస్తకాలద్వారా మనకు అందించిన జేన్ గుడాల్ మహిళల్లో మణిపూస. మూగ ప్రాణులకు దేవత. 90 ఏళ్లపాటు భూమి, పర్యావరణం, ప్రాణులకోసం పరితపించిన జేన్ గుడాల్ గురించి తెలియని వారు ఇప్పుడైనా తెలుసుకోవడం అవసరం.

“ఆశే పచ్చదనం
మారే రుతువుల వర్ణం
మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
నువ్వెంత? నేనెంత? రవ్వంత!
ఎన్నో ఏళ్ళదీసృష్టి చరిత
అనుభవమే దాచింది కొండంత
తన అడుగుల్లో అడుగేసి
వెళదాం జన్మంతా…”
జనతా గ్యారేజ్ సినిమాలో రామజోగయ్య శాస్త్రి పాటలో మాటలివి. సృష్టిలో అన్నీ మనకోసమే. ఆ సృష్టిలో ప్రకృతి మనలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. సృష్టిలో ఉన్న ప్రతిప్రాణి మనుగడకు జేన్ గుడాల్ లాంటివారు భరోసా అవుతారు. పర్యావరణ పరిరక్షణకు దారి దీపాలవుతారు. భూమి మీద సకల జీవులకు తోడవుతారు.

-శోభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here