పదపదవే వయ్యారి గాలిపటమా!
పైన పక్షిలాగా ఎగిరిపోయి
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా!
ప్రేమగోలలోన చిక్కిపోయినావా?
నీ ప్రియుడున్న చోటుకై పోదువా?
నీ తళుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా
నీకు ఎవరిచ్చారే బిరుదు తోక?
కొని తెచ్చావేమో అంతేగాక!
రాజులెందరూడినా మోజులెంత మారినా
తెగిపోక నిలిచె నీ తోక
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో?
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో?
వగలాడివిలే జగదంతవులే
దిగిరాకుండా ఎటులుందువులే?

దాదాపు అరవై ఏళ్ల కిందట కులదైవం సినిమాలో కొసరాజు రాయగా, ఘంటసాల స్వరపరచి జమునా రాణితో కలిసి గానం చేసిన పాట ఇది. అంతకు ముందే 1957 లో బాబీ సినిమాలో “చలి చలిరే పతంగ్…” హిందీ పాట ట్యూన్, భావం ఆధారంగానే ఈ పాట తయారయినా తెలుగులో ఆ పతంగ్ మరింత హొయలు పోయింది. గాలిపటానికి జయపతాక లాంటి ఒకే ఒక పాట ఇది. గాలి పటానికి భుజ కీర్తులు తొడిగి విను వీధిన సమున్నతంగా నిలబెట్టిన పాట ఇది. తెగిన గాలి పటానికి తోక కట్టి నీలాకాశంలో దారి చూపిన పాట ఇది. గాలి పటంలో ఒయ్యారాలను దర్శించిన సాహిత్యమిది. తెలుగు జ్ఞాన పథాన్ని జానపదంలో ముంచి పునీతం చేసిన కొసరాజు రసగీతి ఇది. సినిమాలో ప్రేమాభిమానాల వ్యక్తీకరణకు గాలిపటాన్ని రాయబారిగా చేసిన ఉదాత్త సందర్భమిది. తెలుగువారు ఎవరయినా విని తీరాల్సిన పాట ఇది. ఇప్పటికే ఎన్నో సార్లు విన్న వారు సంక్రాంతి గాలిపటాల మధ్య మళ్లీ ఈ పాటను మననం చేసుకోండి. వినని వారు అర్జెంటుగా యూ ట్యూబులో అయినా చూసి, విని తరించండి.
గాలి పటాలను ఎగరేసే బాల్యాన్ని ఎలాగూ కోల్పోయాం. కనీసం గాలి పటం గొప్పదనం మీద తెలుగులో ఇంత గొప్ప పాట ఉందని కూడా తెలియకపోతే నిజంగా మన బతుకుల్లో భావం తెగిన గాలి పటమే అయి దిక్కూ మొక్కూ లేకుండా పోతుంది.
పదండి…
కొసరాజు గాలి పటం వెంట మనం కూడా భావ రాగాల రెక్కలు కట్టుకుని పక్క చూపు చూసుకుంటూ పక్షిలా పైకి ఎగిరిపోదాం. విను వీధిన నీలి మబ్బుల్లో ఎగురుతూ కింద పుడమి తళుకు బెళుకులను, ప్రకృతి కులుకులను విహంగ వీక్షణం చేద్దాం. మన బరువయిన అహంకారపు తోకలను కత్తిరించుకుని, బరువు తగ్గి కాసేపు గాల్లో తేలి వద్దాం. రాజులువస్తుంటారు. పోతుంటారు. పాత మోజులు పోయి, కొత్త మోజులు మోసులెత్తుతూ ఉంటాయి. రాజుల పదవి ఉంటే ఉంటుంది. ఊడిపోతే ఊడిపోతుంది. కంటికి కనిపించకపోయినా తెగిపోక నిలిచే మనవయిన ఆత్మాభిమాన తోకలే మన ఆస్తి పాస్తులు. మింట చుక్కల దాకా ఎగరడానికి స్పేస్ క్రాఫ్ట్ లు అక్కర్లేదు. మనసుకు రెక్కలు తొడిగితే చాలు…దిక్కులు దాటి…చుక్కలు దాటి ఎగురుతున్న ఈ తెలుగు గాలి పటాన్ని సంక్రాంతి పూట అయినా పట్టుకోగలం.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

