కరోనా విలయతాండవ వార్తల మధ్య ఈ ప్రకటనను ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. ప్రకటనలను కూడా చదివే పాఠకులు సహజంగా తక్కువ. ఈ ప్రకటన మనలాంటి సగటు పాఠకులు చదివినా, చదవకపోయినా పెద్ద నష్టమేమీ ఉండదు. టైమ్స్ లాంటి అగ్రశ్రేణి భారతీయ పత్రికలన్నిట్లో వచ్చిన ఈ ప్రకటన భారత ప్రధానమంత్రిని ఉద్దేశించి ఒక అమెరికా స్థిరాస్తి వ్యాపార సంస్థ- ల్యాండోమస్ ఇచ్చినది. మన ప్రధానమంత్రి ఈ ప్రకటన చదవకపోతే మాత్రం ఈ ప్రకటన ఉద్దేశం నెరవేరదు. మిగతా పత్రికలు పట్టించుకున్నట్లు లేదు కానీ- ఈనాడు మాత్రం ఈ ప్రకటనను వార్తగా బిజినెస్ పేజీలో ప్రచురించింది.
ప్రకటనలో విషయం:-
భారత దేశంలో ల్యాండోమస్ 37 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. ప్రపంచంలో భారత్ ను అగ్ర స్థానంలో నిలబెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ల్యాండోమస్ అండగా నిలుస్తుంది. మోడీగారూ! మా ప్రణాళికలను వివరించడానికి మీ విలువయిన సమయాన్ని కేటాయించండి.
బి జె పి కి ఇష్టమయిన కాషాయం రంగు పట్టీలనే పైన కింద పెట్టి ప్రకటనను డిజైన్ చేయించారు. కంపెనీ అమెరికాదే అయినా- ఆ కంపెనీ అధిపతి ప్రదీప్ కుమార్. కాబట్టి అక్కడ స్థిరపడ్డ భారతీయుడే.
ఈ ప్రకటనను మన ప్రధాని చూసి- ఆ 37 లక్షల కోట్ల రూపాయల మొదటి విడత పెట్టుబడులను అర్జంటుగా ఒడిసిపట్టుకోవాలని భారతీయులుగా మనం కోరుకుందాం. అయితే- ఇలా ప్రకటన ఇవ్వవచ్చా? దీనికి నిజంగా ప్రధాని స్పందించి వారికి సమాధానమిస్తే- అప్పుడు ప్రధాని అపాయింట్ మెంట్ కు ప్రతివారు పత్రికల్లో ప్రకటనలే ఇవ్వాలా? ఇది ఏ సంప్రదాయానికి దారి తీస్తుందన్నది ఒక చర్చ.
సాధారణంగా వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతామంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు వెళ్లి ఎర్ర తివాచీలు పరిచి, ఆగమేఘాల మీద అనుమతులిస్తాయి. అలాంటిది ల్యాండోమస్ 37 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామంటే ప్రధాని కార్యాలయం స్పందించకపోతేనే ఇలా ప్రధానికి బహిరంగప్రకటన ఇచ్చారా? లేక పరిపాలనా విధానాల మీద అవగాహన లేక 37 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతాం అని ప్రకటన ఇస్తే- ప్రధాని రెక్కలు కట్టుకుని అమెరికాలో ప్రదీప్ దగ్గరికి వెళ్లి బాబ్బాబు రా నాయనా! అని ప్రాధేయపడతారు అని అనుకున్నారా?
స్థిరాస్తి వ్యాపారంలో ల్యాండోమస్ ఎంత పెద్ద కంపెనీ అయినా అయి ఉండవచ్చు. వారు అజ్ఞానంతో ఇచ్చినా, అమాయకత్వంతో ఇచ్చినా, అహంకారంతో ఇచ్చినా…ఒక దేశ ప్రధానికి ఇలా బహిరంగ ప్రకటన ఇచ్చి అపాయింట్ మెంట్ కోరడం మాత్రం హుందాగా లేదు. ఒక వేళ అపాయింట్ మెంట్ కోసం సరయిన పద్ధతిలో అడిగి అడిగి సమాధానం రాక ఇలా ప్రకటన ఇచ్చి ఉంటే మాత్రం ల్యాండోమస్ ను అర్థం చేసుకోవచ్చు!
ఇదే ఒక అలవాటుగా స్థిరపడితే- భారత ప్రధాని రోజూ పేపర్లలో తనను ఉద్దేశిస్తూ ఇచ్చిన బహిరంగ ప్రకటనలు చదువుకుంటూ కూర్చోవచ్చు!
-పమిడికాల్వ మధుసూదన్