Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపక్షులు- అక్కు పక్షులు

పక్షులు- అక్కు పక్షులు

Jumpings: పక్షి తెల్లవారడానికంటే ముందే గూడు వదిలి…పొద్దువాలే వేళకు కచ్చితంగా అదే గూటికి వస్తుంది. పక్షులు గూళ్లకు చేరే వేళ, గోధూళి వేళ అని కొన్ని యుగాలుగా ఒక కాలప్రమాణం వాడుకలో ఉంది. చంద్రుడి మీద విహార యాత్రలు చేయగలిగే చంద్రయానపు అత్యాధునిక కాలంలోకి రాకెట్ వేగంతో వెళుతున్నా కొన్ని ఆచారాలు మారవు. వాటితో ముడిపడి ఉన్న వాడుక మాటలకు కూడా కాలం చెల్లదు. ఎన్నికలవేళ రాజకీయ పక్షులు సొంత గూళ్లకు వెళ్లడం దీనికి పెద్ద ఉదాహరణ.

పక్షి గూటికి వెళ్లడంలో దారి తప్పదు. ధర్మం తప్పదు. పుల్లా పుడక, పచ్చి ఎండు గడ్డిపోచలు, ఆకులు అలములు తెచ్చి ముక్కుతో, కాలి గోళ్లతో గాలిలో తేలుతూ అత్యంత సొగసుగా కట్టుకున్న సొంత గూటికే వెళుతుంది. గూడు లేకపోతే కొమ్మమీదే రెక్కలను దుప్పటిగా కప్పుకుని పడుకుంటుంది కానీ…ఇంకొక పక్షి అల్లారుముద్దుగా అల్లుకున్న గూట్లోకి వెళ్లదు. మనకు ప్రభుత్వాలు దయదలచి ఉచితంగా ఇళ్లు కట్టించి గృహప్రవేశాలు కూడా చేయించి…దగ్గరుండి పాలు కూడా పొంగించినట్లు…పక్షులకు ఏ ప్రభుత్వాలూ సింగిల్ బర్డ్ రూమయినా కట్టి ఇవ్వవు. అలా కట్టివ్వాలని ఏ పక్షి కోరుకోదు. అలా కోరుకుంటే అది అక్కుపక్షి అవుతుంది కానీ…పక్షి కాలేదని పక్షికి క్లారిటీ ఉంది.

పక్షి గూడును నిర్మించుకునే నైపుణ్యం మీద గుర్రం జాషువా పరవశించి కవిత్వీకరించిన గిజిగాడు పద్యాలను ప్రస్తావిస్తూ ఐధాత్రి గతంలో ప్రచురించిన ఒక కథనం లింక్ ఇది.

జాషువా ‘గిజిగాడు’ పద్యాలు

ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. ఎన్నికల వేళ ఫలానా రాజకీయ పక్షి మళ్లీ సొంతగూటికి అని మీడియాలో వస్తున్న వార్తలతో ఆకాశంలో ఎగిరే అసలు పక్షుల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. చిట్టి పిచుకలు మొదలు పెద్ద రాబందులవరకు కోకాపేట హై రైజ్ కొండల మీద అఖిల పక్షి సంఘాల సమైక్య కార్యాచరణ సమితి- అ.ప.సం.స.కా.స అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని పరిస్థితిని విహంగ వీక్షణంగా సమీక్షించాయి. అందులో కొన్ని తీర్మానాలివి:-

1 .పరిస్థితిని బట్టి ఆటోమేటిగ్గా రంగులు మార్చుకునే ఊసరవెల్లులు, ఎలా పడితే అలా ఎగిరే కప్పలు ఉండగా…పక్షి గూటిని రాజకీయ కప్ప గంతులకు ప్రతీకగా వాడడం అంత సముచితంగా లేదు.

2. తెలుగు భాషలో “అక్కుపక్షి” మాట అనాదిగా వాడుకలో ఉంది. కనీసం ఇలాంటి సందర్భాల్లో “అక్కుపక్షి” మాట అతుకుతుందేమో భాషాశాస్త్రవేత్తలు పెద్దమనసు చేసుకుని ఆలోచించాలి.

3. నిజంగా గూడు లేని నిరుపేదలు, రెక్కాడితేగాని డొక్కాడని అభాగ్యులు, గూడు చెదిరిన నిర్భాగ్యులు మొదలయిన రెక్కతెగిన జీవితాలకు మా రెక్కల పక్షి భాష ఎంతగా వాడుకున్నా…మాకు అభ్యంతరం లేదు. కావాలంటే మా సొంత గూళ్లు ఖాళీ చేసి వారికి గుళ్లు కట్టి ఇస్తాం.

4. ఇప్పుడు మీరు సొంతగూటికి ఫలానా పక్షులు అని చెబుతున్న వ్యక్తులకు భూమ్మీద ఉన్న అన్ని పక్షులు గూళ్లు కట్టుకున్నా..ఇంకా వేల ఎకరాల భూములు మిగిలి ఉండేంత సంపన్నులు.

5. ఎన్నికల వేళ “వలస పక్షులు” అని పదే పదే వాడి మా సున్నితమయిన గుండెలను గాయపరుస్తున్నారు. ఉన్నచోట తిండి దొరక్క, నీళ్లు దొరక్క వాతావరణం అనుకూలించక…మేము వేల మైళ్ళు వలస వెళ్లి…మళ్లీ అన్నీ అనుకూలించగానే వెళ్ళినదారిలోనే వెనక్కు వస్తున్నాం కానీ… మీలాగా ఎన్నికకు ఎన్నికకు మధ్య, ఉప ఎన్నికకు సాధారణ ఎన్నికకు మధ్య వలసలు వెళ్లడం లేదు. మా జీవనపోరాటంలో భాగమయిన ఉదాత్తమయిన వలసలను మీ తుచ్ఛమైన వలసలతో దయచేసి పోల్చకండి.

6. సరిహద్దులు లేని మా రెక్కల విశ్వయానాన్ని మీ సంకుచిత ఓటు గూటి, ఓటి గూటి పరిహాసప్రాయ పరిభాషకు వాడకండి.

7. ఏ గూటి పక్షి ఆ పాటే పాడాలని మాకు మీరు చెప్పాల్సిన పనిలేదు. మీరే ఒక గూట్లో ఉండి…మరో గూటి పాట పాడుతున్నారని తెలుసుకోండి.

8. సృష్టిలో మమ్మల్ను సృష్టించిన బ్రహ్మే అసూయపడేంత గూటి నిర్మాణ కౌశలం మాది అని నవయుగ కవితాచక్రవర్తి గుర్రం జాషువా మాకిచ్చిన నోబెల్ బహుమతిని మీరు గుర్తించకపోయినా పరవాలేదు. దయచేసి మమ్మల్ను అవమానించకండి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్