దశాబ్దాలుగా తెలుగు వారిని అలరిస్తున్న లలిత సంగీతంలోని సాహిత్య మాధుర్యాన్ని, విశిష్టతను నేటి తరానికి చేరువ చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ‘లలిత సంగీతం – సాహితీ సౌరభం’ పేరిట ప్రత్యేక అధ్యయన శిబిరం నిర్వహించారు. అబిడ్స్‌లోని డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లలిత సంగీతంలో సాహిత్యం, సంగీతం సమ్మేళనమై శ్రోతలకు అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తాయని, ముఖ్యంగా నవతరం గాయకులు భావయుక్తంగా పాడటానికి సాహిత్య విశ్లేషణ ఎంతో అవసరమన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాంతా-వసంతా ట్రస్టు అధినేత కె.ఐ. వరప్రసాద రెడ్డి మాట్లాడుతూ…తెలుగు లలిత గీతాల వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడెమీ వ్యవస్థాపకుడు, సంగీత గురువు కొమాండూరి రామాచారి ఈ శిబిరానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

శిబిరంలో భాగంగా లలిత గీతాల రచయితలు సాహిత్యాంశాలను క్షుణ్ణంగా విశ్లేషించారు. అందులో పమిడికాల్వ మధుసూదన్ ఉపన్యాసమిది:-
శబ్దాల సందడి లేని… నిశ్శబ్దానికి చేరువగా సాగే ఒక మధుర ప్రయాణం-‘లలిత సంగీతం’.
“భాషకు రాగం తోడైతే అది పాటవుతుంది… ఆ పాటకి భావం ప్రాణమైతే అది ‘లలిత గీతం’ అవుతుంది.”
సముద్రపు హోరులో వినిపించని సంగీతం… సెలయేటి గలగలలో వినిపిస్తుంది.
పండిత సభల గంభీరతలో దొరకని ఉపశమనం… పల్లె పదాల పలకరింపులో దొరుకుతుంది.
శాస్త్రీయతకు ఉన్న నిష్ఠను వీడకుండా, సామాన్యుడి కష్టసుఖాలను పక్కన పెట్టి, కేవలం ‘మనసు’తో మాట్లాడే కళా రూపమే ఈ లలిత సంగీతం.
ఆకులో ఆకునై కలిసిపోయేంతటి ప్రకృతి తన్మయత్వం…
కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారిన అమృత బిందువు…
రేడియో అలల మీద తేలివచ్చిన స్వచ్ఛమైన మలయమారుతం…
ఇది కేవలం సంగీతం కాదు, తెలుగు వాడు దాచుకున్న ఒక సున్నితమైన సాహిత్య నిధి. కాలం వేగంగా పరిగెడుతున్నా, అలసిన గుండెకు సేదదీర్చే ఒక చల్లని చెట్టు నీడ – మన తెలుగు లలిత సంగీతం.
సంగీత ప్రపంచంలో లలిత సంగీతం ఒక ప్రత్యేక అధ్యాయం. ఇది శాస్త్రీయ సంగీతానికి ప్రత్యామ్నాయం కాదు, సినిమా సంగీతానికి పోటీ కూడా కాదు. భావాన్ని మృదువుగా, సూటిగా హృదయానికి చేరవేసే ఒక సాంస్కృతిక మార్గం. ఈ మార్గం ఎలా మొదలైంది? ఎలా విస్తరించింది? ఎప్పుడు శిఖరాలను చేరింది? ఇప్పుడు ఎక్కడ ఉంది?
రేడియోలో పుట్టిన లలిత సంగీతం:-
శాస్త్రీయ సంగీతానికి ఉన్న గంభీరతకు, సామాన్య శ్రోతకు మధ్య ఉన్న ఖాళీని పూడ్చాలనే అవసరంలో నుండే లలిత సంగీతం పుట్టింది. కర్నాటక శాస్త్రీయ సంగీతంలోని పవిత్రతను, శుద్ధతను నిలబెట్టుకుంటూనే సాధారణ మనిషి పాడుకోగలిగే సరళతను అందించడమే దీని మూల లక్ష్యం.
ఇందులో ఆకాశవాణి రేడియో పాత్ర కీలకం. దశాబ్దాలపాటు రేడియో తరంగాల మీదుగా లలిత గీతాలు ఇళ్లలోకి ప్రవేశించాయి. సభల గడపలు దాటి, సంగీతం వంటింట్లోకీ, పనిముట్ల మధ్యకీ చేరింది.
సాహిత్య ప్రధానం:-
లలిత సంగీత వికాసానికి సాహిత్యమే ప్రాణం. కృష్ణశాస్త్రి, నారాయణ రెడ్డి, దాశరథిలాంటి కవులు లలిత గీతాన్ని కవిత్వ స్థాయికి తీసుకెళ్లారు. ‘ఆకులో ఆకునై…’ లాంటి గీతాలు మనిషి–ప్రకృతి మధ్య ఉన్న అద్వైత భావనను అతి సున్నితంగా ఆవిష్కరిస్తాయి. కొమ్మలు, రెమ్మలు, గాలి, నీరు మానవ భావోద్వేగాలుగా మారిపోతాయి. పదజాలం సరళమైనదే అయినా, అందులోని తాత్వికత మాత్రం లోతైనది.
లలిత గీతం జటిలమైన గ్రాంథిక భాషకు, అతి సాధారణ వాడుక భాషకు మధ్య ఒక గౌరవప్రదమైన సాహిత్య వారధిగా నిలిచింది.

మాధుర్యమే ప్రధాన శక్తి:-
లలిత సంగీత వైభవం దాని సమతుల్యతలో ఉంది. ఇక్కడ సంగీతం సాహిత్యాన్ని డామినేట్ చేయదు. స్వరాలు పదాలకు వేదికలవుతాయి.
శాస్త్రీయ సంగీతంలో రాగ పాండిత్యం ప్రధానమైతే, లలిత సంగీతంలో ఆ రాగంలోని మాధుర్యం ద్వారా భావాన్ని శ్రోత హృదయానికి చేర్చడం ముఖ్యం. అందుకే ఈ గీతాలు కాలాన్ని దాటి నిలిచాయి. వినేవాడికి అవి కచేరీలు కావు, ఆత్మీయ సంభాషణలు.
డిజిటల్ యుగంలో…
నేటి డిజిటల్ యుగంలో వేగం, శబ్దం హోరు, తక్షణ ఆకర్షణల మధ్య లలిత సంగీతానికి చోటు దొరకడం కష్టం. ఆకాశవాణి ఆడియో లైబ్రరీలోని అమూల్యమైన లలిత గీతాలను యథాతథంగా వాటి నేపథ్య కథనాలతో పాటు కొత్త తరానికి చేరవేయాలి. కనుమరుగవుతున్న లలిత గీతాల చరిత్ర, వాటి సాహిత్య విలువలు, కవుల కృషిపై చర్చ తెలుగు భాషను కూడా కాపాడుతుంది. తెలుగు లలిత సంగీతం భావం, భాష, రాగాల అపురూప సమ్మేళనం. ఇది వినోదం మాత్రమే కాదు- ఒక సాంస్కృతిక వారసత్వం.

